జస్ట్ ఆన్ రెంట్... అక్కడ ఫర్నిచర్ అద్దెకిస్తారు..!

అద్దెకు ఫర్నీచర్ అందిస్తున్న ముంబైకి చెందిన రాహుల్

0


చదువు, ఉద్యోగం కారణం ఏదైనా ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి రావడం కాస్త కష్టమే. ఇంట్లో ఉన్న సౌకర్యాలు కొత్త చోట దొరకడం కష్టమే. ముఖ్యంగా ఫర్నిచర్ విషయంలోనైతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త ప్రదేశంలో అద్దె ఇంటిని వెతుక్కోవడమే కష్టం అనుకుంటే, ఇంకా అవసరమైన ఫర్నిచర్ తెచ్చుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారమే. కష్టపడి తెచ్చుకున్నా కొన్నాళ్లకే మరో దూర ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ అయిందంటే ఫర్నిచర్ ను ఎవరికైనా దానం చేయడమో... లేదా వచ్చిన రేటుకో అమ్ముకోవడమో మినహా గత్యంతరం ఉండదు.

ముంబైకి చెందిన రాహుల్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఉద్యోగరీత్యా ముంబై నుంచి కోల్ కతా షిఫ్ట్ అయిన రాహుల్ అక్కడ ఓ ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు. అవసరమైన ఫర్నిచర్ కొనుక్కున్నాడు. అయితే ఏడాది గడిచిందో లేదో కంపెనీ రాహుల్ నుముంబైకి బదిలీ చేస్తూ ఆర్డర్స్ చేతిలో పెట్టింది కంపెనీ. సొంత ఊరికి వెళ్తున్నానన్న ఆనందం ఉన్నా.. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. ముంబైలో ఈ ఫర్నిచర్ అవసరంలేదు. దీంతో గత్యంతరం లేక వచ్చిన రేటుకు అమ్మేశాడు. తానెంతో వ్యయ ప్రయాసలకోర్చి కొన్న ఫర్నిచర్ అలా ఎంతో కొంత మొత్తానికి వేరొకరికి ఇవ్వాల్సి రావడం రాహుల్ కు నచ్చలేదు. ముంబై తిరిగొచ్చాక స్నేహితులకు ఈ విషయం చెప్పాడు. వాళ్లలో కూడా కొందరికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. మాటల సందర్భంలో ఓ ఫ్రెండ్ ఫర్నిచర్ రెంటుకిచ్చే సర్వీసులుంటే ఇలాంటి సమస్యే ఉండదని అన్నాడు. ఆ మాట వినగానే రాహుల్ బుర్రలో లైట్ వెలిగింది.  అలా 2015లో JUSTonRENT.Com ప్రారంభమైంది.

రాహుల్ చిన్నప్పటి నుంచి బిజినెస్ మేన్ అవ్వాలనుకునేవాడు. జస్ట్ ఆన్ రెంట్ డాట్ కాంతో ఆ కోరిక తీరింది. అయితే మధ్యతరగతి కుటుంబం కావడంతో మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలి.. బిజినెస్ ప్రారంభించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఉద్యోగం మాని సొంత వ్యాపారం చేయడమంటే నెలనెలా వచ్చే ఆదాయాన్ని వదులుకోవడమే అని తెలిసినా రాహుల్ ధైర్యంగా ముందడుగేశాడు. కాగ్నిజెంట్ ఎంప్లాయి అయిన రాహుల్.. భార్య అండగా నిలవడంతో వ్యాపారం ప్రారంభించాడు. తల్లిదండ్రులు తొలుత రాహుల్ ను వారించినా ఆ తర్వాత తమవంతు సాయం చేయడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం సెల్ఫ్ ఫండింగ్ తోనే జస్ట్ ఆన్ రెంట్ నడుస్తోంది. అవసరమున్నప్పుడు రాహుల్ ఫ్రెండ్స్ సాయం తీసుకుంటాడు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాహుల్.. ఎంబీయే గ్రాడ్యుయేట్ కూడా కావడంతో సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్ పనులను స్వయంగా చూసుకుంటున్నాడు. తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టేందుకు ఈ కామర్స్ సైట్లు ఎంతో సాయం చేశాయంటారు రాహుల్. ప్రస్తుతం జస్ట్ ఆన్ రెంట్ డాట్ కాం సర్వీసులు పుణె వరకే పరిమితం కాగా.. త్వరలోనే ఇతర నగరాలకు విస్తరించాలన్నది ఆయన ప్లాన్. కస్టమర్ బేస్, తక్కువ రెంట్, వర్డ్ ఆఫ్ మౌత్ తన బిజినెస్ అభివృద్ధికి సాయం చేస్తుందని రాహుల్ నమ్మకం.

“ఫండింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. నిధులు సమకూరితే త్వరలోనే మిగతా నగరాల్లోనూ జస్ట్ ఆన్ రెంట్ సేవలు విస్తరించాలనుకుంటున్నా. ఫండింగ్ కు కంపెనీలు ముందుకొస్తే.. టెక్నాలజీ, మార్కెటింగ్, సప్లై చెయిన్ ను మరింత మెరుగుపరిచే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం బేసిక్ ఫర్నిచర్ను మాత్రమే రెంట్ పై ఇస్తున్నాం. భవిష్యత్తులో ఆఫీస్ ఫర్నీచర్, అడ్వెంచర్ గేర్, లాంగ్ డిస్టెన్స్ క్యాబ్స్ తో పాటు ఇంట్లో అవసరమయ్యే ప్రతి ఫర్నీచర్ ను రెంట్ పై అందించేలా ప్లాన్ చేస్తున్నాం.”-రాహుల్

వస్తువులను అద్దెకిచ్చే విధానం అమెరికాలాంటి దేశాల్లో ఎప్పట్నుంచో ఉంది. భారత్ లోనూ ఈ విధానాన్ని విస్తృతం చేయాలన్నది రాహుల్ ఆలోచన. ఇందుకోసం వినూత్నంగా ఆలోచించడంతో పాటు కష్టపడి పనిచేసే టీంను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వ్యాపార రంగంలో పేరు తెచ్చుకుంటూనే ఫర్నీచర్ కష్టాలు తీర్చడంతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించేందుకు రాహుల్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

“జస్ట్ ఆన్ రెంట్ డాట్ కాం ద్వారా పూనేలోని వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగుల కష్టాలను చాలా వరకు తీర్చగలిగాం. ఈ సైట్ ద్వారా తక్కువ రెంట్ కే సులభంగా ఫర్నీచర్ దొరుకుతుంది. అవసరంలేదనుకున్నప్పుడు వాటిని తిరిగి ఇచ్చేయొచ్చు. సర్వీస్ బాగుండటంతో చాలా వరకు పాజిటివ్ పబ్లిసిటీ దొరుకుతోంది.”- రాహుల్

తనకెదురైన సమస్య ఇంకెవరూ ఎదుర్కోకుండా ఉండాలంటే దేశంలో రెంటల్ సర్వీసులు పెరగాల్సిన అవసరం ఉందన్నది రాహుల్ మాట. రాహుల్ ఆలోచనతో ఫర్నీచర్ విషయంలో చాలామందికి రోజువారీ ఎదురయ్యే సమస్యలు చాలా వరకు తగ్గాయి. అందుకే ఇలాంటి స్టార్టప్స్ ఇంకొన్ని ఏర్పాటు కావాలి.

Related Stories

Stories by uday kiran