వట్టికాళ్లతో 350 కి.మీ. పరిగెత్తిన తెలుగమ్మాయి!

పింకథాన్ లో అరుదైన ఫీట్ సాధించిన నీలిమ పూదోట

వట్టికాళ్లతో 350 కి.మీ. పరిగెత్తిన తెలుగమ్మాయి!

Wednesday November 30, 2016,

2 min Read


నీలిమ పూదోట. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఇటీవలే ఎవరెస్టును అధిరోహించిన ధీర వనిత. ఉగ్గుపాలతోనే ధైర్యాన్ని సాహసాన్ని ఒంటబట్టించుకున్న నీలిమ మరో సంకల్పాన్ని జయించింది. బేర్ ఫుట్‌తో విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరిగెత్తి రికార్డు నెలకొల్పింది. బ్రెస్ట్ కేన్సర్ మీద అవగాహన పెంచాలనే ఉద్దేశంతో చేపట్టిన పింకథాన్ లో పాల్గొన్న నీలిమ మరో అరుదైన ఫీట్ సాధించింది.

2014 లెక్కల ప్రకారం దేశంలో 97,328 మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బారిన పడ్డారు. ఈ సంఖ్య 2030కల్లా రెట్టింపవుతుంది. సాక్షాత్తూ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో చెప్పిన మాటలివి. బెంగళూరులో 35-44 మధ్య వయసున్న మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ సోకినట్టు రికార్డులు చెప్తున్నాయి. అదే చెన్నయ్, ముంబై, ఢిల్లీవంటి నగరాల్లో 45-54 ఏజ్ గ్రూప్ మహిళలు ఈ మహమ్మారి బారిన పడ్డట్టు రిపోర్టులున్నాయి.

ఈ మహమ్మారిని దరిచేరకుండా మహిళల్లో అవగాహన పెరగాలి. వాళ్ల జీవన శైలి మారేలా అవేర్‌నెస్‌ తేవాలి. అందుకోసమే నడుం బిగించింది పింకథాన్. అన్ని మెట్రో నగరాల్లో త్రీకే, ఫైవ్ కే, టెన్ కే రన్ నిర్వహిస్తూ మహిళలను, యువతులను ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తున్నారు. అందులో భాగంగానే నీలిమ వట్టి కాళ్లతో లాంగ్ రన్ చేయాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్టే విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరిగెత్తి మరో అరుదైన రికార్డు నెలకొల్పింది.

image



ఏదైనా అనుకుంటే చేసేయడం నీలిమకు మొదట్నుంచీ ఉన్న అలవాటు. భూకంపాలు సంభవించనీ, సునామీలు తిరుగుబాటు చేయనీ .. దమ్మూధైర్యం గుండె నిండా నింపుకుని ఎదుర్కోవడం ఆమె బ్లడ్ లోనే ఉంది. పింకథాన్ లో పాల్గొనడానికి నీలిమ 5 నెలలు ప్రాక్టీస్ చేసింది. అసాధారణ వాతావరణం మినహా పెద్దగా ఇబ్బందులేం ఎదురుకాలేదని చాలా సింపుల్‌గా చెప్తోంది నీలిమ. సూర్యోదయం కంటే ముందే పరుగు ప్రారంభించి సాయంత్రం కంటే ముందే ఆగిపోయేది. ఎందుకంటే సాయంత్రం ఎండ నేరుగా కళ్లలో పడుతుంది కాబట్టి. మైదాన ప్రాంతాల్లో ప్రాబ్లం లేదుగానీ, పొలాల మధ్య నుంచే వెళ్తుంటే ఎన్నో పాములు ఎదురయ్యాయని నవ్వుతూ చెప్పింది.

ఇదొక్కటే కాదు.. నీలిమ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అన్నీ రికార్డులే. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంకు చెందిన నీలిమ మల్టీ టాలెంటెడ్ యువతి. మంచి రైటర్. డాన్సర్. హార్స్ రైడింగ్ తెలుసు. పాటలు కూడా పాడుతుంది. ఏదైనా చేయాలని అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా మారుతుంది. ఆమె ఉత్సాహన్ని చూసి తల్లిదండ్రులు కాదనరు. వద్దని వారించరు. మొన్న బెంగళూరు టు హైదరాబాద్ 570 కి.మీ. సైకిల్ మీద ప్రయాణించింది.

ఇటీవలే ఎవరెస్టుని అధిరోహించిన తొలి ఆంధ్రా అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. నవ్యాంధ్ర నుంచి ఎవరెస్టు ఎక్కిన తొలి యువతిగా రికార్డుల్లో ఉండిపోవాలన్న తపనతో అత్యున్నత శిఖరంపై సగర్వంగా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసింది. అంతకు ముందు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. నేపాల్‌ లో వచ్చిన భూకంపం కారణంగా మధ్యలోనే వెనుతిరిగారు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి సక్సెస్ అయింది. అదే స్ఫూర్తితో పింకథాన్ లో బేర్ ఫుట్ రన్నర్ గా మరో అరుదైన ఫీట్ సాధించింది. నీలిమ సంకల్ప బలం ముందు ముళ్లబాటలు కూడా పూల బాటలవుతున్నాయి.