ఇండియాలోనే తొలి ట్రాన్స్ జెండర్ స్కూల్  

మరో అడుగు ముందుకేసిన కేరళ

0

ట్రాన్స్ జెండర్ల విషయంలో కేరళ రాష్ట్రాన్ని ఎంతైనా అభినందించాల్సిందే. గత ఏడాది వారికోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చి సమాజాంలో వారికి సముచిత స్థానం కల్పంచింది. ఉనికి సంగతి దేవుడెరుగు కనీసం సంఘంలో ఒకరిగా బతకడానికి కూడా దారీ తెన్నూ తెలియని వారికి మేమున్నామని ముందుకొచ్చింది అక్కడి గవర్నమెంటు. 

ఈసిడింపులు, అవహేళనకు గురై ఉనికి లేకుండా పోయిన ట్రాన్స్ జెండర్ల కోసం తీసుకొచ్చిన పాలసీ.. వాళ్ల హక్కులను కాపాడటమే కాదు.. వాళ్లకు ప్రత్యేకంగా ఒక ఐడెంటిటీ సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తోంది. ట్రాన్స్ జెండర్ ఎవరైనా సరే సర్టిఫికెట్ వర్తించేలా పాలసీని రూపొందించారు.

ఇప్పుడదే కేరళ ట్రాన్స్ జెండర్ల కోసం మరో అడుగు ముందుకేసింది. దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ స్కూల్ ని కొచ్చిలో ఏర్పాటు చేయబోతోంది. దానిపేరు సహజ్ ఇంటర్నేషనల్ స్కూల్. సామాజిక వివక్షను రూపుమాపాలన్న లక్ష్యంతో పోరాడుతున్న యాక్టివిస్ట్ కల్కి సుబ్రమణ్యం చేతుల మీదుగా ఈ డిసెంబర్ 30న స్కూల్ ని ప్రారంభించబోతున్నారు.

అయితే స్కూల్ పెడతామంటే దాదాపు 50 మంది దాకా ప్రాపర్టీ ఓనర్లు ఒప్పుకోలేదు. స్థలం కోసం నానా కష్టాలు పడాల్సివచ్చింది. మొత్తానికి ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పెద్దమనసుతో కొంత స్థలాన్ని లీజుకిచ్చింది.

నేషనల్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా మొదటగా 10మందితో బ్యాచ్ తో ప్రారంభిస్తారు. కొంతమంది ఉపాధ్యాయులు, సోషల్ వర్కర్లు స్వచ్ఛదంగా పాఠాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతానికైతే స్కూల్ రన్ కావడానికి ఒకరిద్దరు స్పాన్సర్లు ముందుకొచ్చారు. పూర్తిస్థాయిలో నడపాలంటే సర్కారు సాయం చేయాలని వారు కోరుతున్నారు.

స్కూల్ కరికులమ్ ఎలా వుంటుందంటే.. స్కిల్ డెవలప్మెంట్ కింద రకరకాల కార్యక్రమాలుంటాయి. దాంతోపాటు 10,12 తరగతులకు అకాడెమిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. ట్రాన్స్ ఇండియా ఫౌండేషన్ లో పనిచేస్తున్న ఆరుగురు ట్రాన్స్ జెండర్లు దీన్ని లీడ్ చేస్తారు.

కొచ్చి మెట్రో లాంటి ఆర్గనైజేషన్లు ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించడానికి ముందుకు వస్తున్నాయి. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ సమస్య ఎదురవుతోంది. దాన్ని అధిగమించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్గనైజర్ విజయరాజ అంటున్నారు.

Related Stories