రైతులను కాపాడుదాం రండి అని పిలుపునిచ్చిన మంచు మనోజ్

0

దేశంలో రైతుల దీనావస్థ గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పులు.. ఆకలి చావులు.. బలవన్మరణాలు.. వెరసి దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న మెడకు ఉరితాడు వేలాడుతోంది. దశాబ్దాలుగా రైతు పడుతున్న యాతన ఇది. దేశానికి వెన్నెముకగా ఉండాల్సిన రైతు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాడు. అలాంటి రైతుకు వెన్నుదన్నుగా ఉండేందుకు సినీ నటుడు మంచు మనోజ్ ముందుకు వచ్చారు.

మంచు మనోజ్ యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సేవ్ ద ఫార్మర్’ నినాదంతో ముందుకు వచ్చాడు. విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాను వచ్చిన సమయంలోనే మనోజ్ ఈ ఫౌండేషన్ స్థాపించాడు. సేవ్ ద ఫార్మర్ ఇనిషియేటివ్‌లో భాగంగా మంచు మనోజ్ ఐదుగురు సెలెబ్రిటీలను నామినేట్ చేశాడు. తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్, డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రానా, సాయి ధరమ్ తేజ, వ్యాపావేత్త జీవీ కేశవ్‌రెడ్డి మనోజ్ నామినేట్ చేసిన వారిలో ఉన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలి చావులు చావడం బాధాకరమని మనోజ్ అన్నారు. అలాంటి వాళ్ల పక్షాన నిలబడటం మనవంతు కర్తవ్యం అని తెలిపారు. రైతులు చందాలు తీసుకోరని అంటున్న మనోజ్.. సేవ్ ద ఫార్మర్‌కు వచ్చే డబ్బును వారి శ్రేయస్సుకు ఉపయోగిస్తామని ప్రకటించారు. నీటి సంరక్షణ, భూసార పరీక్షలు, పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు దక్కేలా చూడటం, రైతుల పిల్లల చదువుకు సాయం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. షూటింగ్ సమయం పోను, మిగతా సమయాన్నంతా కార్యక్రమం కోసమే కేటాయిస్తానని ప్రకటించారు. 

Related Stories

Stories by team ys telugu