అన్నతో పాటు కిలిమంజారో అధిరోహించిన తొమ్మిదేళ్ల చిన్నారి 

 

0

వణికించే చలి.. ఏకధాటిగా మంచు వర్షం.. ఆ జోరువానలో అడుగుతీసి అడుగెయ్యడం కూడా కష్టమే. కాలుజారితేకనీసం డెడ్ బాడీ కూడా దొరకనంత ఎత్తయిన లోయలు. అలాంటి కిలిమంజారో పర్వతాలపై భారత జాతీయజెండాను రెపరెపలాడించారు తెలంగాణ బిడ్డలు. దిగ్విజయంగా పర్వతారోహణ చేసి తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుపడింపజేశారు.

ఆఫ్రికాఖండం టాంజానియాలో దాదాపు 6వేల మీటర్ల ఎత్తులో కిలిమంజారో పర్వతం ఉంది. ఆఫ్రికా ఖండంలోనే అది అత్యంత ఎత్తైన శిఖరం. దాన్ని అధిరోహించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ లోయలు ఎక్కువ. పొరపాటున పట్టు తప్పిందంటే ఎముకలు కూడా దొరకవు. పైగా వాతావరణం ఎప్పుడూ ఒకలా ఉండదు. కొండల కింది భాగంలో ఎండగా ఉంటే.. .పైన విపరీతమైన మంచు వర్షం కురుస్తుంది. అదికూడా రోజుల తరబడి పడుతూనే ఉంటుంది. దీంతో దారంతా ఎప్పుడూ బురదతోనే నిండి ఉంటుంది. అడుగు తీసి అడుగేయాలంటే కష్టం. దానికి తోడు ఆక్సిజన్ ప్రాబ్లమ్. అలాంటి చోట 25 కిలోల బ్యాగ్ వీపున వేసుకొని అవలీలగా నడిచారు ఈ అన్నాచెల్లెలు. వారి సాహసయాత్ర ఎంత త్వరగా పూర్తయ్యిందంటే, షెడ్యూల్ ప్రకారం 7 రోజులు అనుకుంటే 6 రోజుల్లోనే పర్వతారోహణ పూర్తి చేశారు.

రిపబ్లిక్ డే జరుపుకోబోతున్న తరుణంలో… ఈనెల 14న కిలిమంజారోపై సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగరవేసి యావత్ జాతికి గర్వకారణంగా నిలిచారు. కిలిమంజారోపై సీఎం కేసీఆర్, అంబేద్కర్ ఫోటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వినీల అయితే చేతులు, కాళ్లు బొబ్బలెక్కినా లెక్కచేయకుండా.. అన్నకంటే ముందే నడించింది. ఈ పర్వతారోహణ ద్వారా ఈ చిన్నారి కొత్త రికార్డును సాధించింది. ఆసియాలోనే కిలిమంజారోను ఎక్కిన అత్యంత పిన్న వయస్కురాలుగా గుర్తింపు పొందింది.

హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన జార్జ్, సుధారాణి దంపతుల పిల్లలే వినీల్, వినీల. కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతుండగా.. వినీల 4వ తరగతి చదువుతోంది. వినీల్ కు మొదటి నుంచీ పర్వతారోహణపై ఆసక్తి ఎక్కువ. మేఘాలయలో శిక్షణ పొందాడు. కొన్నాళ్లకు చెల్లెలు వినీతనూ తీసుకెళ్లి తనతో పాటు శిక్షణ ఇప్పించాడు. అక్కడ కోర్సు పూర్తయిన తర్వాత ఇద్దరూ కిలిమంజారోను అధిరోహించాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ సహకారంతో ట్రాన్సెండ్ అడ్వెంచర్ సంస్థ కిలిమంజారో పర్వతారోహణకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఎంపిక చేసింది. ఫైనల్ గా 22 మంది సభ్యులు ఎంపికైతే.. అందులో ఈ వినీల్, వినీల ఉన్నారు.

సాహసయాత్ర కోసం వినీల్, వినీత పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. వినీల వయస్సు 9 ఏళ్లే కావడంతో స్పెషల్ ఎక్సర్ సైజులు చేయించారు. యాత్రకు తగ్గట్టుగా రెడీ అయ్యారు. కానీ ఈలోపు తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే చేతిలో డబ్బు లేదు. పైగా సాహస యాత్ర. చుట్టుపక్కల వారు వద్దని వారించారు. పిల్లల మాటలు విని తొందరపడొద్దని భయపెట్టారు. తండ్రి జార్జ్ కొంత వెనుకడుగు వేసినా… సుధారాణి మాత్రం పిల్లలవైపే నిలిచింది. అప్పు చేసి మరీ ఈనెల 6న వారిని టాంజానియాకు పంపించారు. అనుకున్నట్టే వినీల్, వినీల.. అమ్మ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా సాహసయాత్రను పూర్తి చేశారు.

చిన్న వయస్సులోనే ఈ అన్నాచెల్లెలు సాధించిన ఘనత అద్వితీయం. పర్వతారోహణకు వెళ్తామంటే వద్దని వారించిన వారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వదేశానికి వచ్చిన వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 

Related Stories