అవినీతిని అంతానికే కొత్తనోట్లు.. పాతవి మార్చుకోడానికి జనం పాట్లు  

0

పాత 500, వెయ్యి నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కాసేపటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. అవినీతిని అంతమొందించడమే కాకుండా, దేశ ఆర్థిక స్వావలంబన కోసమే పాత నోట్లు రద్దుచేసి, కొత్తవాటిని తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. నవంబర్ 10 నుంచి కొత్త రూ.500, రూ.2000 నోట్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. నోట్లను ముద్రించే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు. క్షణం విశ్రాంతి లేకుండా నోట్లను ప్రింట్ చేస్తున్నామని అన్నారు. పాత నోట్ల రద్దుతో హోల్ సేల్ వ్యాపారులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తవని ఆయన క్లారిటీ ఇచ్చారు.

నిజానికి దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దుచేయడం ఇదే మొదటిసారి కాదు. 1946 జనవరిలో మొదటగా భారత రిజర్వ్‌ బ్యాంక్‌ రూ. వెయ్యి, రూ. 10వేల నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత 1954లో రూ. వెయ్యి, రూ. 5వేలు, రూ. 10 వేల నోట్లను కొత్తగా ప్రవేశపెట్టింది. 1978 జనవరిలో రూ. 10 వేలు, రూ. 5వేలు, రూ. వెయ్యి నోట్లను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత మళ్లీ చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఇదే తొలిసారి.

రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటన చేయగానే ఒక్కసారిగా అలజడి చెలరిగింది. అందరూ 500, 1000 నోట్ల మార్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. చాలాచోట్ల వ్యాపారులు 500 నోట్లను తిరస్కరించారు. పాత నోట్లు అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అవుతాయని చెప్పినా కొందరు వినలేదు. పదీ యాభై నోట్లు ఉన్నవాళ్ల సంగతి పక్కన పెడితే, కట్టలకు కట్టలు ఉన్న వాళ్లంతా యమ టెన్షన్ పడ్డారు. వాళ్ల సంగతి అలా వుంటే మోదీ ప్రసంగం పూర్తికాకముందే జనం ఏటీఎంల బాట పట్టారు. చాలామంది క్యాష్ డిపాజిట్ మెషీన్ సెంటర్ల ముందు బారులు తీరారు. పెట్రోల్ బంకులు కిటకిటలాడాయి. ఏటీఎం సెంటర్లు కిక్కిరిసిపోయాయి. రెండు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవని తెలిసిన జనం ఎగబడ్డారు. చాలామంది 400 మాత్రమే విత్ డ్రా చేశారు. అది కూడా నాలుగైదు సార్లు 400 చొప్పున ట్రాన్సాక్షన్ చేశారు. వెనకాల వున్నవాళ్లు ఆలస్యమవుతోందని విసుక్కున్నారు. పెట్రోల్ బంకుల్లో ఐదొందలిచ్చి వంద రూపాయల పెట్రోల్ మాత్రమే కొట్టమని చాలామంది అడిగారు. బంకు యజమానులు అందుకు ససేమిరా అన్నారు. దీంతో గొడవ జరిగింది. సిటీలో ఎక్కడ చూసినా ఇవే సీన్లు.