హ్యాండీబుక్ స్టార్టప్ కోసం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వదిలేశారు ! !

(యూఎస్, ఇండియా.. రెండు దేశాలకు సంబంధిచిన స్టార్టప్‌లపై సిలికాన్ బ్రిడ్జ్ పేరుతో యువర్ స్టోరీ... సిరీస్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగమే హ్యాండీబుక్ )

హ్యాండీబుక్ స్టార్టప్ కోసం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వదిలేశారు ! !

Monday August 24, 2015,

4 min Read

ఉద్యోగం స‌రే! ఇంటి సంగ‌తెవ‌రు చూస్తారు? బాత్రూం ప‌రిస్థితేంటి? లీకవతున్న వాటర్ టాప్ అంతే సంగ‌తులా? ఊడిపోయిన ప్ల‌గ్‌కి మోక్షం రాదా? వెలిసిపోయిన స‌న్నం అలాగే ఉండాలా? ఊడుతున్న పెచ్చుల‌కు ప‌రిష్కారం లేదా? వీట‌న్నిటికీ మేమున్నాం అంటోంది హాండీబుక్‌!

ఉమాంగ్ దువా, ఓసిన్ హన్‌రాహన్

ఉమాంగ్ దువా, ఓసిన్ హన్‌రాహన్


ఏదైనా సమస్య అనిపిస్తే.. దాన్ని సాల్వ్ చేసేందుకు ఓ స్టార్టప్ పుట్టుకొస్తోంది. ఉమాంగ్ దువా, ఓసిన్ హన్‌రాహన్‌లు ప్రారంభించిన హ్యాండీబుక్ కూడ అలాంటిదే అయినా.. దీనికో ప్రత్యేకత ఉంది. ఇది మన గుండెను తట్టి లేపే స్టార్టప్. మన ఇంటికి, ఆఫీసుకు అవసరమైన రోజువారీ కార్యకలాపాలు చాలా ఉంటాయి. వీటిలో మనం అనేక ఇబ్బందులను ఎదుర్కుంటూ ఉంటాం. హ్యండీగా అనిపించే ఇలాంటి చిన్నచిన్న పనులు కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. క్లీనింగ్, ప్లంబింగ్, పెయింటింగ్ వంటి అనేక కార్యక్రమాల నిర్వహణ కోసం.. ఏర్పాటైంది హ్యాండీబుక్. మొదట న్యూయార్క్, బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో‌లలో ఏర్పాటై.. ఇప్పుడు యూఎస్ అంతటా విపరీతంగా పాపులర్ అయింది.

దీన్ని ప్రారంభించేందుకు సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ దువా.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో విద్యాభ్యాసాన్ని కూడా వదిలేశారంటే... ఈ కాన్సెప్ట్‌పై ఉన్న నమ్మకాన్ని అర్ధం చేసుకోవచ్చు.

స్టార్టప్ ఆలోచనకు మూలం.

ఒక స్టార్టప్ కోసం.. బిజినెస్ స్కూల్‌ని వదిలేసేవారు కనిపించరు ఎక్కడా. అది కూడా ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌ని. కేవలం ఓ కల, ఆలోచన రూపంలో ఉన్న ప్రాజెక్ట్ కోసం.. హార్వర్డ్ నుంచి బయటకువచ్చేశారు ఉమాంగ్.

“హార్వర్డ్ ను వదిలేయడం అన్నది అంత చిన్న నిర్ణయం కాదు. హెచ్‌బీఎస్‌ నాకు బాగా నచ్చింది. అక్కడ ఎంతోమంది మేథావులతోపాటు అద్భుతమైన వ్యక్తిత్వం గలవాళ్లు నాకు తెలుసు. చాలామంది నా నిర్ణయం విని నాకు పిచ్చేమో అనుకున్నారు. నిజానికి అప్పుడు నాకు కూడా భయం వేసింది అందరి మాటలు వింటే. అయితే.. ఒక స్టార్టప్‌ని పార్ట్‌టైంగా నడిపితే... సక్సెస్ కాలేమని నాకు అనిపించింది. దానిలో మనం పూర్తిగా ఇన్‌వాల్వ్ కాలేమని భావించాను”అన్నారు ఉమాంగ్.

కేవలం స్టార్టప్ ఆలోచనతోనే హార్వర్డ్‌ను వదిలేయలేదని వివరించారు ఉమాంగ్. ఓసిన్‌తో కలిసి.. బిజినెస్ స్కూల్‌లో ఉండగా... ఇది ప్రారంభమైంది. హ్యాండీబుక్‌కి ఆదరణ పెరుగుతోంది. కస్టమర్ల సంఖ్య ఊపందుకుంటోంది. దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్లగలమో, ఈ విభాగానికి, సర్వీసులకు ఎంత మార్కెట్ ఉందో అప్పుడే అర్ధమైంది వారికి. ఓ పెద్ద వెంచర్‌గా మార్చడానికి అనుగుణమైన అన్ని అవకాశాలు... హ్యాండీబుక్‌కి ఉన్నాయని అర్ధం కాగానే.. హార్వర్డ్‌ని వదిలేశారు ఉమాంగ్.

స్టార్టప్ ప్రారంభం, నిర్వహణ పెద్ద నిర్ణయాలే అయినా... దీని ప్రారంభానికికి కారణాల మాత్రం చాలా సింపుల్. ప్రజలు రోజువారీ జివితంలో భాగమే ఉండే అవసరాలను స్టార్టప్ గా మార్చాలనే ప్రాజెక్ట్ వెనుక సుదీర్ఘమైన ఆలోచనలు ఉన్నాయి" అన్నారు ఉమాంగ్

హ్యాండీబుక్ చాలా సింపుల్ ఐడియాపై ప్రారంభమైంది. క్లీనింగ్, పెయింటింగ్, ప్లంబింగ్ వంటి సర్వీసులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చన్నదే కాన్సెప్ట్. అయితే ప్రజలకు ఎవరిని నమ్మాలో, ఎక్కడ, ఎప్పుడు సర్వీసులు దొరుకుతాయో ప్రజలకు అంతగా తెలియదు. అలాగే ఆయా సర్వీసులకు సరైన ధర ఎంతో కూడా తెలుసుకోలేరు. “ఫ్లైట్స్, హోటల్స్, క్యాబ్స్ వంటి ఆన్‌లైన్ సర్వీసులకు విపరీతంగా ఆన్‌లైన్ బుకింగ్స్ జరుగుతుంటే... హ్యాండీమాన్ అందించే తరహా సేవలు ఇంకా 20వ శతాబ్దంలోనే నిలిచిపోయాయి అని అంటున్నారు ఉమాంగ్. చాలా స్టార్టప్స్ మాదిరిగానే సమస్యను సాల్వ్ చేసేందుకే హ్యండీమ్యాన్ మొదలైనా... తమ అపార్ట్‌మెంట్ క్లీనింగ్ వంటి సమస్యలు ఇంట్లోంచి మొదలయ్యేవాటికి చక్కని పరిష్కారం అందించడమే ధ్యేయంగా ఈ వెంచర్ నిర్వహిస్తున్నారు. ఈ ఆలోచనను బిజినెస్ స్కూల్‌లో ఉండగానే మొదలైంది ఉమాంగ్‌కు.

నట్టింట్లో మొదలయ్యే సమస్యలను ఎత్తిచూపుతూ... వాటిని సులభంగా, వేగంగా, నమ్మదగిన రూట్లలో పరిష్కరిస్తామంటోంది హ్యాండీబుక్. అన్ని రకాల గృహావసర సర్వీసులకు యూఎస్‌లో సేవలు అందిస్తోంది. ఈతరహా సర్వీసులు అందించేవారిని లిస్టింగ్ చేయడం, వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియచేయడం, అలాగే వారి ఛార్జెస్ ఎంతుంటాయో చెప్పడం.. వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తమ టెక్నాలజీ ద్వారా 60 సెకన్లలోనే ఆన్‌లైన్, మొబైల్ యాప్ ద్వారా సర్వీసులు ఎంపిక చేసుకుని బుక్ చేసుకోవచ్చంటోంది హ్యాండీబుక్.

ప్రస్తుతం 20 మందికి పైగా టీం ఉన్నారు. అలాగే వేలమంది సర్వీస్ ప్రొవైడర్లు ఈ ప్లాట్‌ఫాంపై రిజిస్టర్ చేసుకున్నారు. 15 వేల అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెరిఫై చేశాకే.. సర్వీస్‌ని లిస్ట్ చేస్తామని చెబ్తున్నారు ఉమాంగ్

అనతి కాలంలోనే నడిచొచ్చిన పెట్టుబడులు

హ్యాండీమ్యాన్ ప్రారంభించిన ఏడాదిలోనే ఇన్వెస్టర్లను ఆకర్షించింది. కొందరు మేథావులను బోర్డ్‌లోకి తీసుకున్నారు కూడా. ఇంత త్వరగా నిధుల సమీకరణకు వెళ్లడం అనేది చాలా జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయంగా చెప్తారు ఉమాంగ్. “నిధులు సేకరణ ప్రారంభించక ముందే... కొంతమంది ఇన్వెస్టర్లతో మాట్లాడాం, వారితో సంబంధాలు కొనసాగించాం. దీంతో మదుపర్లు మా పనితీరును గమనించడానికి అవకాశం ఏర్పడింది. దీంతో మా టీంని మరింత స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దగలిగాం” అంటున్నారు ఉమాంగ్.

హౌస్‌హోల్డ్ సర్వీసులకు ఉన్న డిమాండ్, ఈ రంగంలో మొదటగా అడుగుపెట్టడంతో కొంత కలిసొచ్చిన అంశం. లాంఛింగ్ చేసిన తొలిరోజు నుంచే లావాదేవీలను నిర్వహిస్తున్నారంటే... దీనికున్న డిమాండ్ అర్ధం చేసుకోవచ్చు. “నిజమైన అవసరం, వాస్తవమైన కస్టమర్లు... ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఇంతకంటే ఏం కావాలి” అన్నారు ఉమాంగ్.

హైలాండ్ కేపిటల్ పార్ట్‌నర్స్, జనరల్ కేటలిస్ట్ పార్ట్‌నర్స్(కయాక్, ఎయిర్‌ బిఎన్‌బిలకు కూడా ముందస్తు పెట్టుబడులు చేసిన కంపెనీ) వంటి వెంచర్ కాపిటలిస్ట్స్‌లనుంచి నిధులు సమీకరించింది హ్యాండీబుక్. అలాగే డేవిడ్ టిస్చ్(న్యూయార్క్‌లోని టెక్‌స్టార్ట్స్ ఫౌండర్) నుంచి ఏంజల్ ఫండింగ్ కూడా తీసుకున్నారు. నిధుల సేకరణ తర్వాత ఈ బోర్డులోకి నాస్‌డాక్ హిస్టరీలో ఫాస్టెస్ట్ ఐపీఓగా రికార్డ్ సృష్టించిన లైకోస్ ఫౌండర్ కం సీఈఓ బాబ్ డేవిస్, జనరల్ కేటలిస్ట్ ఫౌండర్ జోయెల్ కట్లర్ కూడా చేరారు.

ప్రోడక్ట్ చెప్పే సంగతులే మార్కెటింగ్

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రూట్లలో ప్రమోషన్ చేస్తున్నామంటున్నారు ఉమాంగ్. రిఫరెల్స్ కారణంగా మార్కెట్ మరింతగా పెరుగుతోందని వివరించారు. కస్టమర్ల సంఖ్య పెరగడంలో... అత్యధికంగా ఉపయోగపడింది మాత్రం రిఫరెల్స్ “అన్నారు ఉమాంగ్. చెప్పినట్లుగానే వేగంగా, సమర్ధంగా పని పూర్తవుతుండడంతో... ప్రజలే మౌత్ పబ్లిసిటీ ద్వారా మాకు మద్దతు పలికారు. మార్కెటింగ్‌కు ఉపయోగపడ్డారని వివరించారాయన. మొదట న్యూయార్క్, బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో మొదలైన సర్వీసులు.. ప్రతీ 3 నెలలకు 6నగరాల చొప్పున విస్తరించుకుంటూ అభివృద్ధి సాధించారు.

ఒకవైపు హ్యాండీబుక్ యూఎస్‌లో రెక్కలు విప్పుతుంటే... అదే సమయంలో మన దేశంలో మై ప్యూన్, హ్యామర్ అండ్ మాప్, ఈజీఫిక్స్, క్లీన్ ఫెంటాస్టిక్, ఠీక్ కర్ దో వంటి స్టార్టప్‌లు ఇదే తరహా సర్వీసులు అందించేందుకు మొదలయ్యాయి. ప్రస్తుత కాలంలో ఈ తరహా వ్యాపారాలు ప్రజలకు ఎంతో అవసరంగా మారిపోయాయి. ఈ కంపెనీల సర్వీసులను ఖచ్చితంగా అంగీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఈ తరహా పనులు నిర్వహించే వారికి ఇప్పటికే కస్టమర్లున్నా.. అసంఘటితంగా ఉండడం, వ్యవస్థాగత రూపం లేకపోవడం, నమ్మకం కలిగించడం కష్టం కావడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు. వీరందరికీ చక్కని ప్లాట్‌ఫాంగా హ్యాండీబుక్ లాంటి కంపెనీలు వెలుస్తున్నాయి. తగినంత ప్రాచుర్యం కల్పిస్తున్నాయి.

వెబ్‌సైట్