శాండ్విచ్ అమ్ముతున్న హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ కుర్రాళ్లు..

శాండ్విచ్ అమ్ముతున్న హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ కుర్రాళ్లు..

Thursday October 29, 2015,

4 min Read


టైటిల్ చూసి వారికిదేం ఖర్మ పట్టింది అని నోరెళ్లబెట్టకండి. అసలు విషయం ఏంటంటే.. ముగ్గురు ఐటీ కుర్రాళ్లు శాండ్విచ్ పేరుతో ఒక ఫుడ్ స్టార్టప్ పెట్టారు. ట్రిపుల్ ఐటీ చదివి ఇదేం రూట్ అని మళ్లీ ఆశ్చర్యపోకండి. చదివిన పట్టా మీదనే ప్రయాణం చేయాలని రాజ్యాంగంలో రాసిపెట్టి లేదు. అలా గిరిగీసుకుని కూచుంటే జీవితంలో ఏదీ సాధించలేం కూడా. ట్రిపుల్ ఐటీ తర్వాత, ఆరుదేశాల్లో విస్తరించి ఉన్న ఓ కంపెనీలో.. ఫస్టు తారీఖున ఆరంకెల జీతం తీసుకుంటూ.. వారంలో ఐదు రోజులు పని చేసి.. శని, ఆదివారాల్లో వళ్లు తెలియకుండా ఆడిపాడటం మాత్రమే అనుకుంటే- వాళ్ల గురించి ఏం మాట్లాడలేం. 

అదే ట్రిపుల్ ఐటీ చేసి, ఆరంకెల జీతం కోసం ఆపడకుండా, శాండ్విచ్ అమ్ముదాం.. డబ్బులు సంపాదిద్దాం అని డిసైడయ్యారంటే- అదిగో ఆ కుర్రాళ్ల గురించి మాట్లాడుకోవాలి. వాళ్ల గట్స్ గురించి చర్చించుకోవాలి. వాళ్లకు వచ్చిన ఐడియాను విశ్లేషించుకోవాలి. వాళ్ల వ్యాపారాన్ని అంచనా వేయాలి.

image


సమయం సాయంత్రం 5. మాదాపూర్ మెట్రో పిల్లర్ నెంబర్ 8. ఒకచోట యంగ్ టర్క్స్ అంతా గుడిగూడారు. టెకీస్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కాలేజ్ గోయింగ్ గాళ్స్.. అందరూ ఆబగా తింటున్నారు. సాస్ అద్దుకుంటూ, బైట్ బైట్ మధ్య కోక్ తాగుతూ, వేడివేడి శాండ్విచ్ లాగిస్తున్నారు. మంచి యాంబియెన్స్. కూల్ ఈవినింగ్. అలా అని అదేం ఏసీ రెస్టారెంట్ రేంజిలో లేదు. చిన్నపాటి ఐస్ క్రీం పార్లరంత. ఇంకా చెప్పాలంటే పాన్ షాప్ కు తక్కువ.. పాలబూత్ కు ఎక్కువ.

సాయంత్రం కాగానే పొట్టపగిలిన మిర్చీ బజ్జీలు ప్యాజ్ అద్దుకుంటూ తినడంలో రొమాంటిజం ఉంది . పల్లీల చట్నీలో పునుగులు నంజుకుని తినడం ఒక ఆర్టు. సమోసాలో టొమాటో సాస్ కాంబినేషన్ మరిచిపోలేనిది. ఆలూబజ్జీ కాంబినేషన్ లేకున్నా బానే ఉంటుంది. ఎగ్ బోండా నాలుగు ముక్కలు చేసి కారం చల్లుకుని తింటే భలే టేస్ట్. మరి ఎప్పుడూ ఇవేనా? వేరే స్నాక్స్ తయారుచేసి జనం చేత శెభాష్ అనిపించుకోలేమా..?

సరిగ్గా ఈ ప్రశ్న దగ్గర ఆగిపోయారు ముగ్గురు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్. చదివిందేమో ఐటీ, ఆలోచన ఇదేంటి అని చీప్ గా కొట్టిపారేయకండి. వాళ్ల ఆలోచన వెనుక వ్యాపార రహస్యం వింటే ఇదేదో బావుందని మీరే అబ్బుర పడతారు.

image


మూడేళ్ల కిందటే వచ్చింది వాళ్లకు ఈ ఐడియా. దాని పేరు విచ్ ప్లీజ్. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ వితౌట్ ఆయిల్.. హెల్దీ స్నాక్. ఇలాంటివంటే హైదరాబాద్ ఫుడ్ లవర్స్ లటుక్కున అతుక్కుపోతారు. ఐడియా క్లిక్కయింది. లోకల్ టేస్టుకు కొంత నార్త్ ఇండియాను జత చేశారు. ఇంకేముంది మినీ ఇండియాగా చెప్పుకునే హైదరాబాదులో అంతకంటే కావాల్సిందేముంది? అన్ని ప్రాంతాల వారికి అదొక ఫేవరెట్ స్నాక్ అడ్డాగా మారిపోయింది. అది కూడా అతితక్కువ టైంలోనే. మొదట్లో ఐదు పది రకాలుండేవి. ఇప్పుడు ఓ 30 వెరైటీలు చేస్తున్నారు. మెల్లిగా ఆన్ లైన్ పోర్టల్ కూడా ఓపెన్ చేశారు. ఆర్డరివ్వడం.. ఆరగించడం.. స్విగ్గీ లాంటి స్టార్టప్ తో విచ్ ప్లీజ్ ఢీకొట్టింది. బీటుబీ బిజినెస్ లో తనదైన మార్కులు కొట్టేసింది.

“ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండాలనుకునే నాలాంటి వారి కోసమే మా ఈ ఫుడ్ స్టార్టప్ ప్రారంభమైంది”- కోఫౌండర్ రాహుల్ సచ్‌దేవ్

విచ్ ప్లీజ్ ప్రారంభం

2012 నాటి సంగతి. బెంగళూరులో రాహుల్ ఓ ఎమ్మెన్సీ కంపెనీలో పనిచేస్తున్న రోజులవి. ఎందుకో ఉద్యోగం నచ్చ లేదు. అప్పటికే జాబ్ లో చేరి రెండేళ్లయింది. ఏదైనా సొంతంగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నారు. ఆ టైంలో అతను పేయింగ్ గెస్ట్ రూంలో ఉండేవాడు. అక్కడ తిండి సహించేది కాదు. ఆఫీసు కెఫెటేరియాలోనూ అదే దరిద్రం. ఎన్నిరోజులని రెస్టారెంట్‌ బారిన పడాలి. అలా అనుకునే ఓసారి రూంలో శాండ్విచ్ ట్రయల్ వేశాడు. భలే అనిపించింది. పైగా నచ్చింది. దాంతోపాటే ఐడియా కూడా వచ్చింది. మార్కెట్లో ఫుడ్ స్టార్టప్‌లకు ఉన్న డిమాండ్ చూశాక ఇక డిసైడైపోయాడు. మొదట బెంగళూరులో అనుకున్నాడు. కానీ అప్పటికే ఫుడ్ స్టార్టప్ మార్కెట్ బాగానే విస్తరించింది. హైదరాబాద్‌లో బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని భావించాడు. అలా ఇక్కడ ల్యాండయి విచ్ ప్లీజ్ ఎస్టాబ్లిష్ చేశాడు.

వ్యాపారం అన్నాక ఊహ వేరు. వాస్తవం వేరు. పైగా ఫుడ్ బిజినెస్ అంటే రిస్కే. దెబ్బకొట్టిందంటే చివరికి మిగిలేది గిన్నెలు తపాళాలే. ఆ భయం ఓ పక్క వెంటాడుతునే ఉంది. కానీ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో.. సాంప్రదాయానికి భిన్నంగా స్నాక్స్ చేయాలంటే ధైర్యం అవసరం లేదుకానీ..క్వాలిటీ మాత్రం కంపల్సరీ. ఐటెం నచ్చిందంటే చాలు హైదరాబాదీలు దిల్ రాసిచ్చేస్తారు. అలా రాహుల్ అంచనాలేం తారుమారు కాలేదు. టిపికల్ పకోడి లవర్ కూడా కీరదోస ముక్కలతో కూడిన వేడివేడి శాండ్విచ్ తింటున్నాడు.

image


ప్రస్తుతం విచ్ ప్లీజ్‌కి హైదరాబాద్‌లో మూడు ఔట్ లెట్స్ ఉన్నాయి. ఆఫ్ లైన్ సేల్స్ బాగానే ఉన్నాయి. ఇక ఆన్ లైన్‌లో రోజుకి 400 నుంచి 500 దాకా ఆర్డర్లు వస్తున్నాయి. కార్పొరేట్ ఆర్డర్లు కూడా ఎక్కువే. హైదరాబాద్‌లోని మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో డెలివరీ సర్వీసు ఉంది. స్విగ్గీ లాంటి డెలివరీ సంస్థల మద్దతుతో మరిన్ని అమ్మకాలు జరుగుతున్నాయి. జొమాటోలో మంచి స్టార్ రేటింగ్ ఉంది. ప్రారంభ ధర కూడా ఏమంత ఎక్కువ లేదు. 20నుంచి 30 రూపాయలు మాత్రమే. సొంత కిచెన్ ఉండటం విచ్ ప్లీజ్‌కు కలిసొచ్చే విషయం. ఫుడ్ పాండా లాంటి డెలివరీ స్టార్టప్‌లతో టై అప్ అయి బిజినెస్ చేస్తున్నారు. గచ్చిబౌలిలో మొదట ప్రారంభించారు. దాంతో వచ్చిన లాభాలతో మాదాపూర్, ఇంద్రానగర్‌లో స్టాళ్లను తెరిచారు. మంచి లాభాల్లో నడుస్తున్న ఈ కంపెనీ తొలి దశ సీడ్ ఫండింగ్ రౌండ్‌ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతానికి విచ్ ప్లీజ్ బిజినెస్ ప్రాఫిటబుల్‌గా సాగుతోంది. ఫండింగ్ వస్తే సిటీలో ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంటుంది స్టార్టప్ ప్రారంభమై రెండేళ్లు కావస్తోంది. మమ్మల్ని చూసి మరికొంతమంది ఈ తరహా బిజినెస్ ప్రారంభించారు. అయితే వారితో మాకెలాంటి కాంపిటీషన్ లేదంటున్నారు రాహుల్.

విచ్ ప్లీజ్ టీం

రాహుల్ సచ్‌దేవ్ .. విచ్ ప్లీజ్ కో ఫౌండర్ కమ్ డైరెక్టర్. ఆపరేషన్స్‌తో పాటు కిచెన్, చెఫ్ మెయింటెనెన్స్ చూసుకుంటారు. ప్రవీణ్ గిడోడియా, సిద్ధార్థ్ జైన్‌లు కూడా విచ్ ప్లీజ్‌కు కౌ ఫౌండర్లుగా వ్యవహరిస్తున్నారు. వీళ్లు కూడా ట్రిపుల్ ఐటి నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వివిధ ఎమ్మెన్సీల్లో పనిచేసిన అనుభవం ఉంది. వీరితో పాటు చాలా మంది పనిచేస్తున్నారు.

లక్ష్యాలు, ప్రణాళికలు

ఫండింగ్ వస్తే హైదరాబాద్ మొత్తం దున్నేయాలని చూస్తున్నారు. బెంగళూరు తర్వాత టార్గెట్. వచ్చే ఏడాదికల్లా యాప్ ప్లాట్‌ఫాంలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తిగా వెజ్ శాండ్విచ్‌లకే పరిమితమైన ఈ స్టార్టప్.. కస్టమర్ల డిమాండ్ బట్టి నాన్ వెజ్ కూడా అందించాలనుకుంటున్నారు. ఆన్ లైన్ ఆర్డర్లతో బీటుసీ మార్కెట్ పెంచుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు.