పిల్లల్ని స్కూల్‌కు పంపి..నెల నెలా డబ్బు అందుకోండి.. పేదరిక నిర్మూలనకు ఓ తెలుగమ్మాయి తాపత్రయం

పేదరికం పై 26ఏళ్ల శ్వేత జనుంపల్లి పోరాటం...శాన్‌ఫ్రాన్సిస్కోలో తెలుగమ్మాయి విజయం...ఇండియా,కెన్యా,కంబోడియా, నైజీరియా పేదపల్లెల్లో కొత్త వెలుగు...

1

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయలంటారు. ప్రపంచంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటన్నిటికీ పరిష్కారాలు వెంటనే దొరక్కపోయినా మానవ ప్రయత్నం మాత్రం మానకూడదు. అనేక స్వఛ్చంద సంస్థలు, సోషల్ ఆంట్రప్రెన్యూర్లు వీటిని తీర్చడానికి పని చేస్తూనే ఉన్నాయ్. వాటిలో కొన్నిఅవలంభించే పద్దతులు సమాజంలో పెను మార్పు తెచ్చే ప్రభావవంతమైనవి కూడా ఉంటాయి. వాటిలో ఒకటి కండిషనల్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ (నిర్బంధ నగదు బదిలీ). పేదరికాన్ని నిర్మూలించడానికి చేసే సామాజిక కార్యక్రమాలు, అవి కూడా కొన్ని షరతులపై ఆధారపడి చేసేవి. అంటే ఉదాహరణకు ఓ పిల్లాడిని ఖచ్చితంగా రోజూ స్కూలుకు పంపిస్తే..రోజుకు 50 లేదంటే నెలకు 600 రూపాయల చొప్పున ఆ కుటుంబానికి జమ చేయడం..(ఇది కేవలం ఉదాహరణకోసం ఇచ్చినదే).

ఏంటీ కండిషనల్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ ?

ప్రభుత్వం లేదా స్వఛ్చంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలను కొన్ని నియమ నిబంధనలను అనుసరించి చేపడతాయి. స్కూళ్లకు పిల్లల్ని పంపించడం, క్రమం తప్పకుండా హాస్పటల్‌కి వెళ్లి ఆరోగ్య పరిస్థితి చెక్ చేయించుకోవడం, టీకాలు చేయించడం వంటి ఎన్నో షరతులు ఉంటాయి. కండిషనల్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ అనే సరికొత్త విధానం ప్రస్తుత సమకాలీన పరిస్థితికి సరిపోయే విధానం. తరాలుగా పేదరికంలో మగ్గే వాళ్లకూ ఇది కొంత ఉపశమనం. ఈ పద్దతిలో అనుసరించే విధానాలు మరీ కొత్తవి కాకపోయినా.. వీటి సాయంతో జనాల ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. పేదరికానికి ఆరోగ్యం, నిరక్షరాస్యత అనేవి రెండు కారణాలు. క్రమం తప్పకుండా ఆరోగ్యం చూసుకోవడం, చదువుకోవడం ద్వారా రెండు అంశాలు ఫుల్‌ఫిల్ చేయడంతో వాళ్ల జీవనానికి అవసరమైన కనీస ధనం చేకూరుతుంది. డబ్బు లేక చదువుకోలేకపోవడం, జబ్బులకు చికిత్స చేయించుకోలేకపోవడమనే సమస్యలు తలెత్తవు. లాటిన్ అమెరికా దేశాల్లో ఈ నగదు బదిలీ పథకం మొదలైంది. పేదరికంలో మగ్గిపోతున్న అక్కడి ప్రజల జీవనవిధానాన్ని మెరుగుపరచడంలో ఈ నగదు బదిలీ పథకం ఉపయోగపడిందని సర్వేలు చెప్పాయి.

కండిషనల్ క్యాష్‌ ట్రాన్స్‌ఫర్ పథకాన్నిసమర్ధవంతంగా అమలు చేస్తున్న 'న్యూ ఇన్సెంటివ్స్' అనే స్వచ్ఛంద సంస్థను కలిసింది యువర్ స్టోరీ. తీరా చూస్తే ఆ సంస్థను నిర్వహిస్తుంది ఓ తెలుగు యువతి. వయస్సు చూస్తే కేవలం 26. అమెరికాలో స్థిరపడ్డ ఆమె పేరు జానుంపల్లి శ్వేత. న్యూ ఇన్సెంటివ్ స్థాపించక ముందు డిగ్రీ అవగానే బెంగళూరు రీసెర్చ్ కోసం వెళ్లింది శ్వేత. 

శ్వేత జనుంపల్లి, న్యూ ఇన్సెంటివ్స్ వ్యవస్థాపకురాలు
శ్వేత జనుంపల్లి, న్యూ ఇన్సెంటివ్స్ వ్యవస్థాపకురాలు

పల్లెటూరు నేపధ్యం

తన నేపధ్యం గురించి చెప్తూ.."మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పల్లెటూరు నుంచి వచ్చారు. అక్కడి పల్లెల వాతావరణం నాకు కొత్త కాకపోయినా..పొలాల్లో పని చేయడం గొప్ప అనుభవం" అని వివరిస్తారు. "మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మరుణం) ద్వారా పేదరికాన్ని పారదోలడంపైనే నాకెప్పుడూ ఎక్కువ ఆసక్తి ఉండేది. ఐతే నిజంగా అది అమలయ్యే తీరు మాత్రం కొత్తగా అనిపించింది" చెప్పింది శ్వేత. ఇండియాలో రీసెర్చ్ అయిపోయిన తర్వాత శ్వేతకు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇంటర్న్‌‌షిప్ రూపంలో బంగ్లాదేశ్‌లోని గ్రామీణ బ్యాంక్‌లో పని చేసే అవకాశం లభించింది. అక్కడే వివిధ విభాగాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల ప్రాజెక్టుల్లో పని చేసింది శ్వేత. ఆ సమయంలో నగదు బదిలీ విధానం తనకు బాగా నచ్చిందని చెప్తారు శ్వేత. దానిపై మరింత పరిశోధన చేసే క్రమంలో సాయం చేసేందుకు ఆమెకు ఎవరూ ఈ విభాగంలో తారసపడలేదు. అప్పుడే తనకు సొంతంగా దీన్ని ప్రారంభించాలని అనుకున్నారు.

అప్పుడు శ్వేతకు 23ఏళ్లు..మంచి సంకల్పానికి వయసుతో పనేంటి ?

"క్షేత్రస్థాయిలో మాకు సాయం చేసేవాళ్ళతో కలిసి మేం ఎవరికోసమైతే ఈ కార్యక్రమం రూపొందించామో..వారి కోసం వేట సాగించాం. స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్లు చెక్ చేయడం, ఎవరైతే క్రమం తప్పకుండా బడికి వస్తున్నారో చూసి వారికి డబ్బు పంపించేవాళ్లం. అలా ప్రతీ ఒక్క స్కూల్‌కూ నెలకు 9 డాలర్ల చొప్పున పంపించాం. అలా కెన్యా, భారత్, కంబోడియా, నైజీరీయాలో ప్రాజెక్టు ప్రారంభించాం" అని తాము మొదలుపెట్టిన విధానాన్ని వివరించారు. ఐతే ఈ క్రమంలో కొన్ని తప్పులూ దొర్లాయి. సీసీటీని దాతలకు అర్ధమయ్యే చెప్పడం కొద్దిగా కష్టమైంది. న్యూ ఇన్సెంటివ్ సంస్థ చేయాలనుకున్నది..చెప్పాలనుకున్నది విరాళాలిచ్చే దాతలకు అర్ధమయ్యేలా వివరించలేకపోయేవారు. తర్వాత పరిస్థితుల్లో మెల్లగా మార్పు వచ్చింది. దాతలను సంప్రదించే విధానంతో పాటు విరాళాలు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఓ వ్యూహాన్ని రచించింది న్యూ ఇన్సెంటివ్ సంస్థ.

ఎంతో గుర్తింపు

శ్వేత జనుంపల్లి స్థాపించిన న్యూ ఇన్సెంటివ్ ఆ తర్వాత చాలామందికి ఉత్తేజాన్నిచ్చింది. ఫోర్బ్స్ పత్రిక కూడా ఆమె కవర్ స్టోరీని రాసింది. పార్టీ కార్ప్స్, ఛేంజ్ మేకర్స్ మేగజైన్లు కూడా ఆమె కథనాలు రాశాయి. 2012లో క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్‌కు ఆమె హాజరయ్యారు.

"బయట నుంచి చూసేవారికి మేం చేసేది చాలా కష్టంగా, గొప్పగా అన్పించవచ్చు. కానీ ఒక్కసారి ఇందులో పని చేయడం మొదలుపెడితే దాతలను సులభంగా కన్విన్స్ చేయవచ్చు. మన లక్ష్యం గురించి అవతలి వారికి స్పష్టంగా చెప్పగలిగితే వారే మిగిలినవారికి చెప్తారు. అలా ఒకరి నోటి నుంచి మరొకరికి మన మంచి పని గురించి తెలుస్తుంది. గంటలతరబడి ఎవరికీ వివరించాల్సిన పనిలేకుండానే ఎక్కువమంది డొనార్స్‌కు మన కార్యక్రమం గురించి తెలుస్తుంది" అంటూ తాము అవలంబించే పద్దతిని చెప్పారు శ్వేత.

నిధుల సమీకరణ, కార్యక్రమ నిర్వాహణ విషయానికి వస్తే విరాళంగా వచ్చే ప్రతీ డాలర్‌లో 90శాతం నగదు బదిలీకి మరో 10 శాతం క్షేత్ర స్థాయిలో మాతో కలిసి పనిచేసిన వారికి ఇస్తుంది న్యూ ఇన్సెంటివ్. ఎవరైతే ఎక్కువ మంది లబ్దిదారులను పరిచయం చేస్తారో వారికి అంత ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. అందుకే ఎక్కువమందిని చేర్చడమే లక్ష్యంగా ఈ ఫీల్డ్ పార్టనర్స్ పని చేస్తుంటారు. రోజూవారీ కార్యక్రమాల నిర్వహణ కోసం వాల్డన్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుంచి నిధులు వస్తాయి. కేవలం కార్యక్రమాన్ని అమలు చేయడమే కాకుండా ఫీడ్ బ్యాక్‌కు కూడా ఆమె అంతే ప్రాధాన్యత ఇస్తారు. నిధులు సమకూర్చుకునే విధానంలోనూ శ్వేతకు ఓ స్టైల్ ఉంది. తానుండే శాన్‌ఫ్రాన్సిస్కో కాఫీ షాప్స్‌లోనే ఎక్కువ మంది దాతలను ఆమె గుర్తించారు.

 టీమ్ వర్క్ విలువేంటో తెలిసింది

న్యూ ఇన్సెంటివ్స్ సక్సెస్‌కు ముందు చాలా తప్పులు చేశానని వినయంగా ఒప్పుకుంటారు శ్వేత. ప్రారంభంలో చాలా తప్పులు చేశానని, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు ఎలా అమలు అవుతుందో ఎప్పుడూ పైలటింగ్ చేయలేదని గుర్తుచేసుకుంటారు. "ఎవరి సాయం తీసుకోకుండా ఒక్కదాన్నే పని చేసుకోగలనని అనుకునే దాన్ని, అయితే ఆ తర్వాతే టీమ్ వర్క్ విలువ తెలిసి వచ్చింది" అని తప్పులను నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు.

"కండిషనల్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ అనే పద్ధతిని భవిష్యత్తులో ఎవరు అమలు చేయాలని అనుకున్నా వారికి మేము ఓ రెఫరెన్స్‌లా ఉండాలి. న్యూ ఇన్సెంటివ్ ఈ రంగంలో అనుభవాన్ని గడిస్తూ ఇంకా మెరుగైన స్థాయికి ఎదగాలి అదే నా ఆశయం" - శ్వేత.

పేదలకు ఉపయోగపడాలనే తపన, చూపే చొరవే శ్వేత జనుంపల్లి సక్సెస్‌కి మూలకారణాలు. ఈ రంగమే కాదు, ఏ పని చేపట్టాలన్నా ముందు దాన్ని ఇతరులతో పంచుకోవాలని సలహా ఇస్తారామె. "ఎంతమంది అభిప్రాయాలు తీసుకోగలిగితే అంత మంచిది. సలహాలు, సూచనలు, వారి అనుభవాలు అన్నీ మీ ఐడియాకు మరింత స్పష్టతను తెస్తాయి. ఎప్పుడు ఎవరి సూచన,సలహా ఎలాంటి మలుపుకు దారి తీస్తుందో ఎవరికి తెలుసు?" అంటూ ముగించారు

మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్ చూడండి

పేదరికాన్ని దూరం చేసేందుకు ఓ తెలుగమ్మాయి చేసిన వినూత్న ఆలోచన, ఆమె చూపుతున్న చొరవను మీరూ ప్రోత్సహించండి. ఆమెను అభినందించండి.