ఆనాడు ఒక చిన్న ఐడియా! నేడు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం!

రోనీ స్క్రూవాలా అసామాన్య ప్రస్థానం..!!

ఆనాడు ఒక చిన్న ఐడియా! నేడు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం!

Saturday January 02, 2016,

4 min Read

కడుపులో చల్ల కదలకుండా కూర్చోవటం.. భద్రజీవుల్లా బతకటం సాధారణంగా చాలామంది చేసే పని. కానీ, కొంతమంది సవాళ్లను మంచినీళ్లలా తీసుకుంటారు. నిరంతర చలనమే జీవన మాధుర్యమంటారు. ఆ కోవలోకే వస్తారు రోనీ స్క్రూవాలా. తాను స్థాపించిన సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. 24 ఏళ్ల పాటు ఆ సంస్థకే అంకితమైన స్క్రూవాలాకు ఇంకా దాహం తీరలేదు. అందుకే సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతున్నారు...

రోనీ స్క్రూవాలా....

రోనీ స్క్రూవాలా....


ఓ పెద్ద సంస్థ పెట్టారు.. సక్సెస్ పుల్ గా 24 ఏళ్లు నడిపించారు.. వన్ ఫైన్ మాణింగ్... ఇక చాలంటూ బయటికొచ్చేశారు.. సాధారణంగా ఇంత పెద్ద కెరీర్ తర్వాత ఎవరైనా కాస్త గ్యాప్ తీసుకుంటారు. కానీ, ఇక్కడ జరిగింది వేరు. ఈ వ్యక్తి ఫలాసఫీయే వేరు.. అందుకే సరికొత్త పయనాన్ని మొదలుపెట్టారు..

అది దూరదర్శన్ రాజ్యమేలుతున్న కాలం.. ప్రయివేట్ ఛానల్ పేరెత్తితే పిచ్చోడిలా చూసే రోజులు.. కానీ, రోనీ మదిలో ఓ పాతికేళ్ల ఫ్యూచర్ పిక్చర్- క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మీడియాలో తిరుగులేని వ్యాపారవేత్తగా నిలబడ్డారు. యూటీవీ ఫౌండర్ గా, సీఈవోగా 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీకి కో ఫౌండర్ గా, ఇన్వెస్టర్ గా, ప్రో కబడ్డి టీమ్ ఓనర్ గా, తన అర్ధాంగి జరీనాతో కలిసి సేవాకార్యక్రమాల్లో భాగస్వామిగా మరింత బిజీగా మారిపోయారు.

మూడు దశాబ్దాలుగా వ్యాపారవేత్తగా సక్సెస్ పుల్ లైఫ్. యూ టీవీ, విజయ్ టీవీ, హంగామా-మొదలైన ఛానళ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన స్క్రూవాలా బ్రేక్ కోసం మీడియా నుండి బయటకు రాలేదు. అలా బయటికి రావటమే సరైన పని అని భావించి వచ్చాను అంటారు. ఇంకా చెప్పాలంటే ఆట అప్పర్ హ్యాండ్ లో ఉన్నపుడు బయటికొచ్చి మళ్లీ కొత్తగా మొదలు పెట్టడం అన్నమాట.. ఇదే రోనీ కి నచ్చేపని.. నల్లేరుపై నడక అందరికీ సంతోషమే.. కానీ, చెక్కను కోసి, మేకులు దిగ్గొట్టి పడవను తయారు చేసి సముద్రానికి ఎదురుగా వెళ్లటమంటే అది సాహసికులకే సాధ్యం.

వెనుదిరిగి చూడొద్దు..!!

అది 1980 కాలం.. వ్యాపారం అంటే ఆషామాషీ కాదు.. ఇప్పటిలా స్టార్టప్ లంటూ వేల మంది దూసుకొస్తున్న సమయం కాదు. అప్పుడే రోనీ విన్నూత్నంగా ఆలోచించాడు. స్వంతంగా ఏదైనా చేయాలనుకున్నాడు. దూరదర్శన్ చూపెట్టిందే మహాప్రసాదం అని భావిస్తున్న కాలం అది. అదీ రోజుకు 5 గంటలు వచ్చే ప్రసారాల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న ప్రేక్షకులు. ఆ సమయంలో ముంబయిలో లోకల్ టీవీ ఒకటి పెట్టి ప్రసారాలు మొదలు పెట్టాడు. కుప్పలు తెప్పలుగా టీవీ ఛానళ్లు ఉన్న ఈ రోజుల్లో ఇది పెద్ద విషయంలా కనిపించకపోయినా, అప్పటికది చాలా డేరింగ్ స్టెప్. దూరదర్శన్ మాత్రమే తెలిసిన వారికి మరో ప్రత్యామ్నాయాన్ని పరిచయం చేయటం మామూలు విషయం కాదు. దీనికోసం కొన్ని వందల గడపలు తొక్కాడు. తన ప్రణాళికను వివరించాడు. డెమో ఇచ్చాడు. ఆ పునాదులపై అనూహ్యమైన విజయాలు సాధించాడు.

ఆలోచనలపై నమ్మకం ఉండాలి..

రోనీ స్క్రూవాలా నేర్చుకున్న పాఠం ఒక్కటే. ఏదైనా ఆలోచన వస్తే దాని మీద నమ్మకం కూడా కలగాలి. ఇది నేటి స్టార్టప్ ఔత్సాహికులను ఉగ్గుపాలతో నేర్పాల్సిన పాఠం. దూరదర్శన్ కు పోటీగా ఓ లోకల్ ఛానల్. ఊహకందే విషయమేనా? అసలిది జరిగేపనేనా..? పెదవి విరుపులు.. నిరుత్సాహపు మాటలు. ఎక్కే గడపా దిగే గడపా. కానీ, ఆ ఇరవైఏళ్లు కుర్రాడికి ఉత్సాహం సడలలేదు. తాను నమ్మినదానిపై పూర్తి విశ్వాసంతో ముందుకు సాగాడు. కొత్తగా ఓ బిజినెస్ పెట్టడం.. మొదటి నాలుగు రోజులు ఉత్సాహంగా పనిచేయటం.. ఫలితం రాకపోతే, నిరుత్సాహంగా వెనుదిరగటం.. ఇలాంటి స్థితిలో ఉన్న అనేకమంది నేటి ఔత్సాహికులకు రోనీ జీవితం భగవద్గీత లాంటిది. ఈ రోజు నీ ఆలోచనల మీద నీకు నమ్మకముంటే ప్రపంచం రేపైనా నమ్ముతుంది.. ఇదే రోనీ ప్రస్థాన సారాంశం. వ్యాపార నిర్మాణంలో ప్రతి అనుభవం ఓ పాఠమే.. ఏ పాఠం ఎక్కడ అక్కెరకొస్తుందో ఎవరూ ఊహించలేరు. లోకల్ టీవీ పెట్టిన అనుభవం... యూటీవీకి పునాదులు వేయటానికి పనికొచ్చింది. ఇప్పుడది ఊహించనంత పెద్ద సామ్రాజ్యంగా విస్తరించింది.

బిజినెస్ ని కాపాడటమే టార్గెట్..

యూటీవీ ప్రస్థానం నేటి తరంలో చాలామందికి తెలిసిన విషయమే. ఇతర మీడియా హౌస్ లకి కంటెంట్ అందించటంతో పాటు, జోధా అక్బర్, ఎ వెన్స్ డే, ఢెల్లీ బెల్లీ, నో వన్ కిల్డ్ జెస్సీకా, మొదలైన బ్లాక్ బస్టర్ మూవీల నిర్మాణం కూడా యూటీవీ సాధించిన ఘనతే. 2012లో యూటీవీ డిస్నీచేతిలోకి వెళ్లిన తర్వాత కూడా రెండేళ్లు ఎండీ గా ఉన్నారు. యూటీవీ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్న సమయంలో అందులోచి బయటికొచ్చారు. కొత్త జీవితం మొదలు పెట్టారు.

చిత్తశుద్ధి ఉంటే పరమపదసోపానంలో అన్నీ నిచ్చెనలే..

చిత్తశుద్ధి ఉంటే పరమపదసోపానంలో అన్నీ నిచ్చెనలే..


యూటీవీని డిస్నీ తీసుకుంటున్న సమయంలో యునిలేజర్ వెంచర్స్ ని మొదలు పెట్టారు రోనీ. దీని ద్వారా పలు కొత్త స్టార్టప్ లకి ఊతమిచ్చే ప్రణాళికలు రచించారు. ఒకే బిజినెస్ లో కాకుండా, కో పార్టనర్ గా ఉంటూ పలు వ్యాపారాల్లో భాగస్వామిగా మారారు. ఈ క్రమంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ వెంచర్ 'అప్ గ్రాడ్', డిజిటల్ మీడియాలో 'ఎరే', యునిలేజర్ స్పోర్ట్స్, ఇలా పలు సంస్థలకు నాంది పలికారు. యునిలేజర్ ఆధీనంలోనే స్పోర్ట్స్ ముంబయి ప్రో కబడ్డి టీమ్ ఉంది. రోనీ ఏ ఉద్యోగంలో ఉండలేడు కాబట్టే, ఇలా పెట్టుబడులు పెడుతూ స్టార్టప్ లలో భాగస్వామి అయ్యాడనే వ్యాఖ్యలు వినిపించాయి, కానీ, అది అసత్యమంటూ.... తన ఆలోచనలన్నీ అక్షరబద్ధం చేసి డ్రీమ్ విత్ యువర్ ఐస్ ఓపెన్:యాన్ అంట్రప్రెన్యూరియల్ జర్నీ పేరుతో ఓ బుక్ రిలీజ్ చేయబోతున్నారు. అతడే ఓ సైన్యంలా అసామాన్య ప్రస్థానం సాగించిన రోనీ స్క్రూవాలా జీవితం ఔత్సాహికులకు పాఠం లాంటిది.

ఔత్సాహికులకు రోనీ ఇచ్చే టిప్స్ ఇవే ..

నిధులు సమకూర్చటమే లక్ష్యం కాదు. పెట్టుబడి సమకూర్చితే పని పూర్తయినట్టు కాదు..

మీ ఆలోచనలపై నమ్మకముంచండి. విన్నూత్నంగా ఆలోచించండి.

విస్తృతమైన ప్రణాళికలను రచించండి

కొంచెం పెట్టుబడితో కూడా చాలా పనులు చేయొచ్చు.. ఆ దిశగా ఆలోచించండి..

వినియోగదారుడి అవసరాలను ఊహించండి..

వ్యాపారం మొదలు పెట్టినపుడు ఒడిదుడులెన్ని వచ్చినా ముందుకు సాగుతూనే ఉండాలి.. వెనుదిరగకూడదు..