ఈమెయిల్ జమానాలో ఈకొరియర్జ్ స్పీడ్

కొరియర్ సంస్థలన్నింటినీ ఒక వేదికపైకి తెచ్చిన ఈ-కొరియర్జ్ఆన్ లైన్‌ కొరియర్ సర్వీసులో కొత్త పంథాయువకుల ఆలోచనకు మంచి స్పందన

ఈమెయిల్ జమానాలో ఈకొరియర్జ్ స్పీడ్

Wednesday April 22, 2015,

4 min Read

ప్రపంచమంతా ఇప్పుడు అంతర్జాల మార్గంలో పయనిస్తోంది. ఇంటర్నెట్లో దొరకంది లేదు. వెతికితే దేవుడైనా దొరికేలా ఉన్నాడు. జస్ట్ క్లిక్కంత దూరంలో అనుకున్న పని ఇట్టే అయిపోయే రోజుల్లో ఉన్నాం. ఇది కనిపెట్టిన ఒక బృందం.. ఈ కొరియర్జ్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే దేశంలో 2500పైగా కొరియర్ కంపెనీలున్నాయి. మధ్యలో మీరొచ్చి ఏం చేస్తారు? లిస్టులో ఇంకో కొరియర్ కంపెనీ పేరు కలవడం తప్ప.. అన్న మాటంటే వాళ్లసలు ఒప్పుకోరు.

దానికి తోడు ఇంటర్నెట్లో ఈమెయిళ్ల రూపంలో కొన్ని వందల వేల ఉత్తరాలు కనుమరుగు. ఒకప్పట్లో జనవరి ఫస్ట్, వాలెంటైన్స్‌డే వంటి అకేషన్స్‌లో కొరియర్ బిజినెస్ బాగా జరిగేది.ఇప్పుడో ఇలాంటి సందేశాత్మక చిత్రాలన్నీ మొబైల్ మెసేజ్‌లలోకి కన్వర్టయి పోయాయి. దీంతో కొరియర్ సర్వీస్ అవసరం సగానికి సగం తగ్గింది. ఇప్పుడొచ్చి మేం కొరియర్ సర్వీస్ స్టార్ట్ చేశామటే బిజినెస్ ఎలా జరుగుతుంది? అన్నా సరే వాళ్లకు కోపం వస్తుంది.

ఈ కొరియర్జ్ టీం

ఈ కొరియర్జ్ టీం


ఒక్కసారి మా సర్వీస్‌లో బుక్ చేయండి సార్ మీకే తెలుస్తుంది అంటారు. అసలు మాది ఆర్డినరీ కొరియర్స్ కాదు.. 'ఈ-కొరియర్జ్'.. ఈ సౌండ్ లోనే సంథింగ్ వైబ్రేషన్ లేదూ?! అంటున్నారు. శివ మహది, శ్రీనివాస్ సబా, శశిశేఖర్ ఒక టీంగా ఏర్పడి లాజిస్టిక్ ఫీల్డ్ మీద దృష్టి సారించారు. ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్ అనే ఈ బిజినెస్ పరిశీలించారు. ఇందులోని అవకాశాలను అవగతం చేసుకున్నారు. ఇక్కడి లోటు పాట్లేంటో అర్ధమయ్యాయి. తమకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రంగంలోని లోపాలను సరిదిద్దాలనుకున్నారు. తమకున్న డొమైన్ పరిజ్ఞానంతో మొదట పని ప్రారంభించాలనుకున్నారు. అజయ్ కుమార్ అనే టెక్కీ సాయంతో ఈ కొరియర్జ్ స్టార్ట్ చేశారు.

మొదట కొరియర్ ఫీల్డ్ లో ఉన్న సర్వీస్ ప్రొవైడర్ల గుణగణాలను పరిశీలించారు. ఆయా కంపెనీలు చార్జ్ చేసే ధరలు.. సర్వీస్ క్వాలిటీ అంచనా వేశారు. దేశంలో ఇప్పటికే అన్నీ ఉన్నాయి. మనం కొత్తగా కనుక్కుంటున్నదేం లేదు. అలాగని మేక్ మై ట్రిప్, రెడ్ బస్ లాంటి సంస్థలు ఎందుకు క్లిక్ అయ్యాయి. జస్ట్ బస్ సీటు ఆన్ లైన్లో రిజర్వ్ చేసి పెట్టే రెడ్ బస్ ఓ రేంజ్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. మేక్ మై ట్రిప్ కూడా అంతే.. ఎన్నో యాత్రా సర్వీసులున్నాయి. అయినా మేక్ మై ట్రిప్ అద్భుతమైన విజయాలు సాధించింది. మనం ప్రారంభించిన ఈకొరియర్జ్ కూడా అలాగే సత్తా చాటాలన్న కృత నిశ్చయంతో ప్రారంభించింది శివా టీం.

ప్రస్తుతం కస్టమర్లు తాముండే ప్రాంతంలో ఏ కంపెనీ దొరికితే ఆ కంపెనీలో తమ పార్శిళ్లను బుక్ చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకించీ వాళ్లు చూస్తున్న ప్రత్యేకతలేం లేవు.ఈ కొరియర్జ్ ద్వారా మంచి కొరియర్ సర్వీస్ గుర్తించి వాటికంటూ ఒక వేదిక ఏర్పరిస్తే ఈ వ్యాపారం మూడు సర్వీసులూ ఆరు బుకింగులు అవుతుంది.ఇందులో సందేహం లేదన్న నిర్ణయానికి వచ్చారు ఈ కొరియర్జ్ బృంద సభ్యులు.

ఉదాహరణకు మనం ఆన్ లైన్ లో ఒక ఎయిర్ ట్రావెల్ ఏజెన్సీ పెడితే.. అందులో వివిధ రకాల ఎయిర్ సర్వీసులను ఎలా అందుబాటులోకి తెస్తామో ఇదీ అంతే.. ఏ విమానంలో ఎగరాలనుకున్నారో ఆ విమానానికే మీ టికెట్ బుక్ చేస్తామని ఎలా చెబుతామో ఇదీ అంతే అంటారు ఈ కొరియర్జ్ ఫౌండర్ శివ. ఇక్కడ ఇంకో సమస్య తలెత్తవచ్చు. ఆన్ లైన్లో బుక్ చేస్తారు సరే.. ఆయా వస్తువులు ఎలా డెలివరీ అయ్యాయో స్టేటస్ ఏంటో తెలుసుకోవడం ఎలా? అంటే ఏవుందీ టెక్నాలజీ వాడ్డమే. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి సమస్యనూ సాల్వ్ చేయవచ్చు బ్రదర్ అంటారీ టీం మెంబర్స్.

ఈ కొరియర్జ్ ని 2014 సెప్టెంబర్ లో లాంచ్ చేశారు. స్పందన సంతృప్తికరంగానే ఉంది. అయితే ఫలితాలను గణాంకాల్లో చెప్పడానికి ఇంకా టైముందని అంటున్నారు ఈకొరియర్జ్ స్థాపకులు. ప్రస్తుతం మేం మా వ్యాపారంలో ఏరోజుకారోజు కొత్త పాఠం నేర్చుకుంటున్నాం. ప్రస్తుతం మేమో తొమ్మిది మంది ఉన్నాం. టెక్నాలజీ అండ్ సేల్స్ లో తీవ్రంగా కష్టపడుతున్నాం. ఈకొరియర్జ్ లక్షమేంటంటే మార్కెట్ లోని మంచి ప్రొడెక్ట్ కనిపెట్టి కస్టమర్లకు అందించడం. ఈ క్వాలిటీయే మా బిజినెస్ ను ముందుకు తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతోంది శివ అండ్ టీం.

ఈ కొరియర్జ్ ఫ్రీ ఫర్ సర్వీస్ రెవెన్యూ మోడల్లో ముందుకెళ్తోంది. బుకింగ్ చేసినప్పుడు ఆయా కంపెనీల రేట్లను బట్టీ చార్జీలు వసూళ్లు చేస్తారు. అందులోంచి కమీషన్ తీసుకుంటారు. ఈ కొరియర్జ్ ప్రధాన వ్యాపకం మార్కెటింగ్ అండ్ సేల్స్. తమకు దేశ వ్యాప్తంగా ఈ వ్యాపారం చేయాలని ఉన్నా.. ప్రస్తుతం కొన్ని ముఖ్య నగరాల్లో మాత్రమే ఈ సేవలందిస్తున్నామని చెబుతున్నారు. ఈ ఇండస్ట్రీని మరింత లోతుగా అబ్జర్వ్ చేసి ఉత్తమ ఫలితాలను రాబట్టాలని చూస్తున్నామని అంటున్నారు ఈకొరియర్జ్ బృంద సభ్యులు.

ఈ రంగంలో సవాళ్లు చాలానే ఉంటాయి. మనం ఇతరుల సేవలను నమ్మి సర్వీసులను అందిస్తుంటాం. గ్రౌండ్ లెవల్లో పని చేస్తున్నది మనం కానప్పుడు ఇబ్బందులు కాస్త ఎక్కువనే చెప్పాలి. వాటన్నిటికీ మనమే సమాధానం చెప్పాలి. ఇది ఎంతో చాలెంజింగా ఉంటుంది. కనీస పరిజ్ఞానం లేని వాళ్లు చాలా మంది పనిచేస్తుంటారు.. వాళ్లందరి నుంచి ఎదురయ్యే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం కనుగొంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రతి పార్సిల్ మాకో ఛాలెంజ్ అంటారు ఈ కొరియర్జ్ నిర్వాహకులు.

ప్రస్తుతం అందిస్తున్న సర్వీసులే కాక ట్రైన్ టికెట్లు, ఎయిర్ బుకింగులు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఈ కొరియర్జ్ టీం మెంబర్స్. ఇందుకు మరింత టెక్నాలజీ అవసరమవుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసం కాటాపూల్ట్ ద్వారా నిధుల సమీకరణ చేస్తున్నారు. భవిష్యత్తును మరింత విస్తరించాలంటే మరిన్ని సవాళ్లను ఎదుర్కోడానికి సిద్ధం.. ఇప్పటికే తమ ఈ కొరియర్జ్ ద్వారా 12వేల నగరాలు, 200 దేశాలకు సర్వీసులను అందించగలుగుతున్నాం. ఈ పరిధి పెరగాలంటే మరింత కృషి అవసరమని తమకు బాగా తెలుసని చెబుతున్నారు టీం హెడ్ శివ. శివ మీ కల సాకారం కావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్.. గో అహెడ్!