ఒకప్పుడు రోడ్లమీద బిచ్చమెత్తిన ఈ వ్యక్తి ఇవాళ 500మంది పిల్లలను చదివిస్తున్నాడు!!

0

జలాలుద్దీన్ కి అప్పుడు ఏడేళ్లు. స్కూల్ నుంచి ఎంతో హుషారుగా ఇంటికొస్తున్నాడు. కారణం.. తాను స్కూల్లో ఫస్టొచ్చాడు. ఆ విషయం నాన్నకు చెప్తే ఎంత సంతోషిస్తాడో అని గంతులేసుకుంటూ ఇంటికొస్తున్నాడు.

గుమ్మంలో తండ్రి కనిపించాడు. రెట్టించిన ఉత్సాహంతో.. క్లాసులో నేనే ఫస్ట్ నాన్నా అని రెండు చేతులు గాల్లోకి లేపాడు. కుర్రాడి మాటలు విన్న తండ్రి సీరియస్ గా చూశాడు. చదివింది చాలు ఇక ఆపు. నిన్ను బడికి పంపించే స్తోమత నాకు లేదు అన్నాడు. తండ్రి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు.. పిల్లాడి గుండెల్లో పిడుగుల్లా పడ్డాయి. కళ్లనుంచి నీళ్లు టపటపా రాలాయి.

కోల్ కతా సుందర్బన్ లో నివసించే జలాలుద్దీన్ కుటుంబం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఒక పూట తింటే మరోపూట పస్తులుండాల్సిన దుస్థితి. ఆ క్రమంలో సుందర్బన్ వదిలి మౌలానా అనే ప్రాంతానికి వలస వెళ్లారు. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. అక్కడ నిలువ నీడ లేదు. ఫుట్ పాతే అడ్డా. చేసేందుకు ఏ పనీ దొరక్క, రోడ్లమీద భిక్షమెత్తారు.

ఎండైనా వానైనా ఫుట్ పాతే దిక్కు. కొంతకాలానికి నాన్న చనిపోయాడు. అమ్మకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇక్కడైతే లాభం లేదని, కుర్రాడిని తీసుకుని తిరిగి సుందర్బన్ కి వెళ్లింది. అప్పుడు జలాలుద్దీన్ వయసు 12. అమ్మను పోషించే బాధ్యత లేత రెక్కలపై పడింది. ఒక టాంగా అద్దెకు తీసుకున్నాడు. చేతులతో లాగే రిక్షా అది. చిన్న పిల్లాడు ఏం లాగుతాడులే అని పెద్దగా ఎక్కేవారు కాదు. ఎంతోకొంత ఇవ్వండయ్యా అని బతిమాలి ఎక్కించుకునేవాడు. అలా ఐదేళ్లు గడిచాయి. అమ్మకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఆమె ఆలనా పాలనా చూసుకునేవాళ్లు లేకపోవడంతో, జలాలుద్దీన్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అతని వయసు 17.

రిక్షా లాగుతూ ఎలాగోలా జీవితాన్ని గడిపేస్తున్నాడు కానీ, జలాలుద్దీన్ మనసంతా ఆగిపోయిన తన చదువు మీదే ఉంది. బడి మానేసి పదేళ్లయినా క్లాసురూం, పుస్తకాలు కలలో వస్తున్నాయి. పేదరికంతో బలవంతంగా చదువు మానేసిన తనలాంటి వాళ్లు ఇంకా ఎందరున్నారో పదే పదే ఆవేదన చెందేవాడు. నిజంగా అలాంటి వాళ్లు కలిసినప్పుడల్లా మనసు కలత చెందేది. అప్పుడే అనిపించింది.. తనలాగా చదువు మానేసిన పిల్లలకు, చదివే స్తోమత లేని విద్యార్ధులకు, నాలుగు అక్షరాలు నేర్పించాలని. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. ఆ మహత్కార్యాన్ని తలకెత్తుకోవాలని అనుకున్నాడు. జలాలుద్దీన్ ఉన్న పరిస్థితుల్లో అతను అనుకున్న సంకల్పం తలకుమించిన భారమే. అయినా దేవుడనే వాడు సాయం చేయకపోతాడా అని ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలాడు.

సంపాదించిన దాంట్లోంచి ఎంతోకొంత పేదపిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో సమి అనే స్నేహితుడు కలిశాడు. అతను టాక్సీ నడుపుతాడు. కారు డ్రైవింగ్ నేర్పిస్తావా అని అడిగాడు. అతను సరే అన్నాడు. ఏడాది తిరిగే సరికి జలాలుద్దీన్ డ్రైవింగ్ లో ఆరితేరాడు. అప్పుడు అతని వయసు 19

సుందర్బన్ లో టాక్సీ డ్రైవర్లందరినీ కలిశాడు జలాలుద్దీన్. తన ఆశయాన్ని వారికి వివరించాడు. ఒక కమిటీగా ఏర్పడి ఎంతోకొంత సమాజానికి మేలు చేద్దాం అని అందరిలో స్ఫూర్తి నింపాడు. అనుకున్నట్టే సుందర్బర్ డ్రైవింగ్ కమిటీ ఏర్పడింది. మొదటగా ఒక పదిమంది కుర్రాళ్లను సమీకరించారు. డ్రైవింగ్ నేర్పి ఉపాధి కల్పిస్తాం.. నెలకు ఐదు రూపాయల విరాళం వారివారి జీతాల్లోంచి ఇవ్వాలని షరతు పెట్టారు. వాళ్లంతా సరే అన్నారు. అడుగు ముందుకు పడింది.

డ్రైవింగ్ కమిటీ ఐడియా సక్సెస్ అయింది. కమిటీలో సభ్యలు పది మంది నుంచి 20 మంది అయ్యారు. చూస్తుండగానే వారి సంఖ్య 40 అయ్యింది. క్రమంగా నెట్ వర్క్ లో 500 మంది చేరారు. అతి తక్కువ కాలంలోనే ఊరు ఊరంతా టాక్సీ డ్రైవర్లుగా మారారు.

తర్వాతి స్టెప్ పిల్లలకు యునిఫాం, పుస్తకాలు ఇవ్వడం. దానికి కాస్త డబ్బు ఎక్కువగానే అవుతుంది. రోజూ ఎక్కే ప్యాసింజర్లకు తన ఆశయం గురించి వివరించాడు. ఎంతో కొంత విరాళంగా ఇవ్వమని ప్రాథేయపడ్డాడు. జలాలుద్దీన్ మాటల్లో నిజాయితీ కనిపించింది. ఎవరూ కాదనలేదు.

జలాలుద్దీన్ కంటున్న కలలు ఒక్కొక్కటీ నిజమవుతున్నాయి. గుండె సంతోషంతో ఉప్పొంగిపోతోంది. కానీ చేసింది గోరంత. చేయాల్సింది కొండంత. ఇదే స్ఫూర్తితో మరింత మంది పిల్లలకు చదువు చెప్పించాలని ఆరాట పడ్డాడు. ఒక స్కూల్ పెడితే ఎలా వుంటుంది అని ఆలోచించాడు. గ్రామస్తులను కొంత స్థలం ఇవ్వమని అడిగాడు. వాళ్లు ఒప్పుకోలేదు. అయినా నిరాశ చెందలేదు. తాను సంపాదించిన దాంట్లోనుంచే కొంత డబ్బు పక్కన పెట్టి, రెండు గదులున్న ఇల్లు కొన్నాడు. ఒకదాంట్లో తన భార్యా ఇద్దరు పిల్లలు. ఇంకో గదిలో స్కూల్. దానికి ఇస్మాయిల్ ఇస్రాఫిల్ ఫ్రీ ప్రైమరీ స్కూల్ అని, తన పిల్లల పేర్లనే పెట్టాడు. అదే పేరుమీద రిజిస్ట్రర్ చేయించాడు.

కొన్నాళ్ల తర్వాత విరాళాలు పెరిగాయి. వాటితో స్టేషనరీ, యూనిఫామ్స్, భోజనాలు సమకూర్చాడు. టీచర్లకు జీతాలు కూడా ఇచ్చాడు. స్కూల్ ని నాలుగో క్లాసు వరకు అప్ గ్రేడ్ చేశాడు.

ఒకరోజు టాక్సీ నడుపుతుండగా, ఒక వ్యక్తి విశాలమైన ఇంటి స్థలం అమ్ముతున్నాడని ఎక్కిన ఓ ప్యాసింజర్ చెప్పాడు. ఎలాగైనా ఆ ప్రాపర్టీని కొని, అందులో పెద్ద స్కూల్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. తన ఇంటికంటే ఐదు రెట్లు పెద్దదైన ఆ లాండ్ ని ఎలాగైనా కొనాలని తన డ్రైవర్ కమ్యూనిటీకి చెప్పాడు. అందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ ఇంటి స్థలాన్ని కొనగలిగాడు. 

జలాలుద్దీన్ చేస్తున్న మంచిపని గురించి విని ఒక పెద్దాయన స్కూల్ బిల్డింగ్ కట్టిస్తానని మాటిచ్చాడు. కొందరు ఇటుకలు, ఇంకొందరు సిమెంట్ ఇస్తామని ముందుకొచ్చారు. వాళ్ల ఆనందానికి అవధుల్లేవ్. 2009లో బిల్డింగ్ పూర్తయింది. నలుగురు టీచర్లతో బడి ప్రారంభమైంది. కొంతకాలానికే వాళ్లసంఖ్య 8కి చేరింది. వందమంది ఉన్న విద్యార్ధులు రెండేళ్లలో రెండింతలయ్యారు. ప్రస్తుతం ఆ బడిలో 400 మంది విద్యార్ధులున్నారు.

జలాలుద్దీన్ ఆశయం నెరవేరింది. పేదిరికం చదువుకు అడ్డుగోడగా వుండొద్దనే స్వప్నం ఫలించింది. ఇప్పుడు జలాలుద్దీన్ కి 65 ఏళ్లు. చూపు మసకబారింది. ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా ఇంకా టాక్సీ నడుపుతునే ఉన్నాడు. బడి కోసం విరాళాలు సేకరిస్తునే ఉన్నాడు. చిన్న కొడుకు కూడా టాక్సీ డ్రైవరే. అతను రోజుకి 400 రూపాయలు సంపాదిస్తాడు. అందులో 200 తండ్రి స్థాపించిన స్కూల్ కి ఇస్తాడు. జలాలుద్దీన్ ఒక అనాథాశ్రమాన్ని కూడా నెలకొల్పాడు. కానీ దానికి నీటి సమస్య ఉంది. అది పరిష్కారం కావాలంటే రెండు లక్షల రూపాయలు కావాలి.

ఇప్పుడు జలాలుద్దీన్ కు మిగిలిన కల ఒక్కటే. తన స్కూల్లో చదవిన పిల్లల్లో ఎవరో ఒకరు కలెక్టరో, బారిస్టరో, ఇంజినీరో అయితే చూడాలనుంది. వాళ్లని మనసారా గుండెలకు హత్తుకోవాలని ఉంది. వాళ్ల చేతులు పట్టుకుని తనివితీరా ఏడవాలని ఉంది.

వచ్చే నెలలో న్యూరోబిన్ ఫోర్ట్ వాళ్లు జలాలుద్దీన్ సేవలకు మెచ్చి హీరోయిజం అవార్డు ఇవ్వబోతున్నారు. మీరు కూడా ఇతని ఆశయానికి చేయందించాలనకుంటే ఎంతో కొంత విరాళం ఇవ్వొచ్చు.

జలాలుద్దీన్ అకౌంట్ వివరాలు:

Name – Sundarban Orphanage And Social Welfare Trust,

Account Number – 1096011062636

Bank Name – United Bank Of India

Branch – Mayukh Bhavan, Salt Lake, Kolkata- 700091

IFSC Code – UtbIOMBHD62

Branch code – MBHD62

Related Stories