హైదరాబాద్‌లో అమెజాన్ క్యాంపస్

అమెరికా తర్వాత ఇక్కడే అతిపెద్ద సెంటర్ ఇక్కడే !

0


అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం హైదరాబాద్‌లో నూతన క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది. అమెరికా తర్వాత భారత దేశంలో ఓ అతిపెద్ద క్యాంపస్ నిర్మించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. 30 లక్షల చదరపు అడుగుల్లో అధునాతన డెవలప్‌మెంటర్ సెంటర్ ఏర్పాటు కోసం మంగళవారం లాంఛనంగా శంకుస్థాపన చేసింది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

అమెజాన్ క్యాంపస్ కు లాంఛనంగా శంకుస్థాపన 
అమెజాన్ క్యాంపస్ కు లాంఛనంగా శంకుస్థాపన 
అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జపోల్‌స్కీ మాట్లాడుతూ.. ''2005 నుంచే హైదరాబాద్‌తో మా అనుబంధం కొనసాగుతోంది. ఇక్కడ మా ఐటి ఆపరేషన్స్‌ను అప్పటి నుంచే కొనసాగిస్తున్నాం. ఇక్కడున్న నిపుణులు బృందం, టాలెంట్, ప్రభుత్వ ప్రోత్సాహకం, మౌలిక సదుపాయాల వల్లే.. ఇంత పెద్ద కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాం'

ఇప్పటికే దేశంలోని అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అమెజాన్.. ఈ క్యాంపస్ ఏర్పాటుతో తన పరిధిని మరింత విస్తరించనుంది. దేశంలోని చిన్న, మధ్యతరహా కంపెనీలకు మరిన్ని సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే విషయం ఈ సెంటర్ ఏర్పాటుతో మరోసారి స్పష్టమైందని అమెజాన్ చెబ్తోంది. హైదరాబాద్‌లో నిర్మాణమయ్యే అధునాతన్ క్యాంపస్ ప్రపంచ వ్యాప్త బ్యాక్ ఎండ్ అవసరాలను తీరుస్తుంది. అయితే ఈ క్యాంపస్ నిర్మాణం కోసం ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు, ఎంత మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోబోతున్నారు అనే విషయాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రాకతో మరిన్ని కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టే అవకాశముందని తెలంగాణ ఐటి, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. టిఎస్ - ఐపాస్ కింద ఈ సంస్థకు కేవలం పది రోజుల్లోనే అన్ని అనుమతులనూ మంజూరు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

'' తెలంగాణకు మాత్రమే పరిమితమైన కొన్ని అపురూప హస్తకళలను అమెజాన్ మార్కెట్ ప్లేస్ ద్వారా అమ్మకానికి పెట్టాలని చూస్తున్నాం. దీని వల్ల ఇక్కడి కళాకారులకు ఉపాధి కూడా దక్కుతుంది. ఇక్కడి సంస్కృతి కూడా ప్రపంచానికి తెలుస్తుంది. అమెజాన్ వంటి ప్రముఖ సంస్థ ఇక్కడికి రావడం వల్ల హైదరాబాద్ ఖ్యాతి మరోసారి తెలిసొచ్చింది '' - కేటీఆర్.