నాడు మామయ్య చందాలేసుకుని క్రికెట్ అకాడెమీలో చేర్పించాడు- రోహిత్ శర్మ ఇంట్రస్టింగ్ స్టోరీ

నాడు మామయ్య చందాలేసుకుని క్రికెట్ అకాడెమీలో చేర్పించాడు- రోహిత్ శర్మ ఇంట్రస్టింగ్ స్టోరీ

Wednesday May 03, 2017,

2 min Read

రోహిత్ శర్మ. పరిచయం అక్కర్లేని ఇండియన్ క్రికెటర్. సచిన్, సెహ్వాగ్ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్. ఒకటి కాదు రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు. ముంబై ఇండియన్స్ జట్టుకి రెండుసార్లు టైటిల్ తెచ్చిపెట్టిన యువ కెప్టెన్. టాప్ హండ్రెడ్ సెలబ్రిటీల్లో ఒకరు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు రోహిత్ బాల్యం అత్యంత దయనీయం. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. తండ్రి గురునాథ్ శర్మ ఒక ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ పూర్ణిమ. చాలీచాలని సంపాదన. ఈ నేపథ్యంలో రోహిత్ ముంబైలోని బంధువుల ఇంట్లో ఉంటూ చదివేవాడు. వారాంతాల్లో అమ్మానాన్నని చూడ్డానికి వచ్చేవాడు.

image


రోహిత్ కి క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం. అతని అభిరుచిని గమనించిన మామయ్య ఫ్రెండ్స్ దగ్గర తలా యాభై రూపాయలు పోగేసి, చిన్నపాటి క్రికెట్ అకాడెమీలో చేర్పించాడు. మొదట్లో బ్యాటింగ్ మీద పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. స్పిన్ బౌలర్ గా అకాడెమీలో చేరాడు. రోహిత్ శర్మ కమిట్మెంట్ చూసిన కోచ్ దినేశ్- స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ అవమని, అక్కడైతే ఆటకు సరిపడా సౌకర్యాలుంటాయని సలహా ఇచ్చాడు.

కానీ ఇంటర్నేషన్ స్కూల్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంత ఫీజు తమ పేరెంట్స్ చెల్లించలేరి కోచ్ కి చెప్పాడు. అయినా కోచ్ వినలేదు. స్కాలర్ షిప్ ఇప్పిస్తా నీకేం భయంలేదని ధైర్యం చెప్పాడు. అలా అతని అండతో ఆ స్కూల్లో చేరాడు. నాలుగేళ్లు గడిచాయి. అయితే మొదట్లో బంతితో ఆఫ్ స్పిన్ వేసే రోహిత్.. మెల్లిగా కోచ్ సలహాతో బ్యాట్ పట్టాడు.

ఊహించినట్టుగానే జరిగింది. రోహిత్ బంతితో కంటే బ్యాట్ తోనే ఎక్కువ పెర్ఫామెన్స్ ఇస్తున్నాడు. స్కూల్ లెవల్ టోర్నమెంటులో అదరగొట్టాడు. అదే ఊపులో ముంబై అండర్ 17 టీంకి ఎంపికయ్యాడు. ఆ సెలెక్షన్ తప్పు కాదని రుజువు చేయడానికి ఎంతో కాలం పట్టలేదు. ముంబై అండర్ 17 నుంచి ఏకంగా భారత్ అండర్ 17 జట్టుకి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అండర్ 19కి ప్రాతినిధ్యం వహించాడు. ఎప్పుడైతే అండర్ 19కి వెళ్లాడో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 2006లో ఇండియా-ఏ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలా ఏడాది తిరిగేలోగా అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. అప్పటికి రోహిత్ వయసు 20 ఏళ్లే.

మొదట్లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చిన రోహిత్ మెల్లిగా ఓపెనర్ స్థానాన్ని ఆక్రమించాడు. సచిన్, సెహ్వాగ్, సౌరభ్ తర్వాత, అంతటి ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేయగలిగిన ఆటగాడిగా ప్రూవ్ చేసుకున్నాడు. 153 వన్డేలు ఆడిన రోహిత్ పది సెంచరీలు(రెండు డబుల్) 29 అర్ధసెంచరీలతో 5వేల పరుగుల క్లబ్ లో చేరాడు. 2014లో శ్రీలంకపై చేసిన 264 పరుగుల అరవీర భయంకరమైన బ్యాటింగ్ సగటు అభిమాని కళ్లముందే ఉంది. అంతకు ముందు 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు సాధించి వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన సచిన్, సెహ్వాగ్ సరసన నిలిచాడు. ఆ మ్యాచులో కళ్లు చెదిరేలా బాదిన 16 సిక్సర్లు ఇంకా కంగారూల కళ్లముందే తిరుగుతున్నాయి.

ఇక ఐపీఎల్ లోనూ రోహిత్ తిరుగులేని ఆటగాడిగా రుజువు చేసుకున్నాడు. తొలుత హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ తరుపున ఆడి, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ జట్టుకి రెండుసార్లు టైటిల్ అందించాడు.

ఆరోజు కోచ్ స్కూల్ మారమని సలహా ఇవ్వకుంటే, ఇవాళ రోహిత్ శర్మ అనే అద్భుతమైన ఆటగాడు టీమిండియాకు దొరికే వాడు కాదు. ఆటపట్ల నిబద్ధత, తపన రోహిత్ ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఒకప్పుడు మామయ్య చందాలేసుకుంటే తప్ప అకాడెమిలో జాయిన్ కాలేని స్థితిలో ఉన్న రోహిత్- ఇవాళ టాప్ 100 సెలబ్రిటీల్లో ఒకడయ్యాడు. అది ఆదాయం కావొచ్చు, పేరు ప్రఖ్యాతులు కావొచ్చు. ఒక ఆటగాడిగా ఇంతకు మించిన సక్సెస్ ఇంకేముంటుంది.