ఆడిస్తూ పాడిస్తూ చదువు చెప్పే స్టార్టప్ !!

0

ఇవాళరేపు చదువుల తీరు ఎలా వుందీ అంటే- ఎంతసేపు ర్యాంకులు, మార్కులు, గ్రేడ్లు. ఇదే గొడవ. బండెడు బండెడు హోం వర్క్. ఒక ఆటా లేదు. ఒక పాటా లేదు. అగ్గిపెట్టెల్లాంటి రూముల్లో పిల్లలు బట్టీ యంత్రాల్లా మారిపోతుంటారు. బుక్ నాలెడ్జ్ తప్ప.. ప్రాపంచిక విషయాల పట్ల అవగాహన సున్నా. క్రియేటివ్ థాట్స్ రావు. క్వశ్చన్ టు ఆన్సర్ జీవితంలా మారిపోతుంది. మార్కులే లక్ష్యంగా, ర్యాంకులే పరమావధిగా మారిన పిల్లలను ఈజీగా గుర్తుపట్టొచ్చు. అంతలేసి సోడాబుడ్డి కళ్లజోడుతో, అమాయకంగా డాడీ పక్కనో, మమ్మీ పక్కనో తచ్చాడుతుంటారు. 

చదువంటే ఇదేనా? విద్యార్ధులంతా అలాగే ఉండాలా? వారి గుండెల మీద ర్యాంకుల కుంపటి రగులుతునే ఉండాలా? పసిమెదళ్ల మీద మోపిన టన్నుల కొద్దీ బరువు దిగే మార్గం లేదా? అసలు బట్టీ చదువులకి ఆల్టర్నేటే లేదా?

కచ్చితంగా ఉందంటున్నారు సీఎన్ఎన్-ఐబీఎన్ మాజీ జర్నలిస్టు వరుణ్ కుమార్. చదువు అనేది ఒక ఆటలా సాగాలంటారు. అందుకే విద్యారంగంలో ఒక విప్లవం లేవదీశారు. ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. లెర్నింగ్ ప్రాసెస్ ను ఓ ఫన్ లా చేయడమే అతని కాన్సెప్టు. 

నాలెడ్జ్ ఎక్స్ పీ. హైదరాబాదులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పురుడు పోసుకున్న స్టార్టప్. దేశంలోని స్కూల్స్ లో బట్టీ చదువులకు గుడ్ బై చెప్పి సృజనాత్మకతను వెలికితీయడమే దాని అసలు లక్ష్యం. ప్రయోగాత్మక విధానంలో చేసిన పరిశోధనల ద్వారా … విద్యార్థులకు వర్క్ షాపులు నిర్వహిస్తోంది నాలెడ్జ్ ఎక్స్ పీ.

జర్నలిజం నుంచి తప్పుకుని..

సీఎన్ఎన్- ఐబీఎన్ ఛానల్ కోసం ఎడ్యుకేషన్ స్టోరీలు చేస్తున్నప్పుడే వరుణ్ కుమార్ కు ఈ ఆలోచన బుర్రలో మెరిసింది. వెంటనే జర్నలిజానికి టాటా చెప్పి, ఎంబీయే చేయడానికి హైదరాబాద్ ఐఎస్ బీలో చేరారు. అలా చేరీ చేరడంతోనే, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఐడియాని ఐడియాని డెవలప్ చేశారు. ముఖ్యంగా సిలబస్ పూర్తిచేయాలన్న తొందరలో టీచర్లు వేరే అంశాలపై దృష్టిపెట్టలేకపోతున్నారు. దీంతో ఇటు ఉపాధ్యాయుల్లో, అటు విద్యార్థుల్లోనూ సృజనాత్మకత తగ్గిపోతోంది. అక్కడి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాలనుకున్నారు వరుణ్.

సీసీఈ విధానం. అంటే కంటిన్యూడ్ అండ్ కాంప్రెహెన్సివ్ ఇవల్యూషన్. దీనివల్ల ఒక విద్యార్ధి సమర్ధతను పూర్తిస్థాయిలో అంచనా వేయొచ్చు. ఈ విధానం అమలు చేయాలనే ఆలోచనే ఒక యాంగ్జయిటీని రేకెత్తించిందంటారు వరుణ్.

బట్టీ చదువులకు స్వస్తిచెప్పాలి. సంపూర్ణ, ప్రయోగాత్మక విద్యవైపు నడిపించాలి. ఇండియాలో ఆ టైం వచ్చిందని నేను నమ్ముతున్నాను- వరుణ్
వరుణ్ కుమార్
వరుణ్ కుమార్

మార్కెట్ ను ఎలా అర్థం చేసుకున్నారు ?

వరుణ్ కుమార్ మొదట ఏం చేశారంటే.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 45 స్కూళ్లను చుట్టొచ్చారు. ప్రిన్సిపల్స్, విద్యార్థులతో మాట్లాడారు. మార్కెట్ పై పూర్తి అవగాహన పెంచుకున్నారు. గ్యాప్ ఎనాలసిస్ చేశారు. తర్వాత ఢిల్లీలో నాలెడ్జ్ ఎక్స్ పీ స్టార్ట్ చేశారు. చిన్నారులకు టెక్స్ట్ బుక్సే లోకం కాకుండా అన్నిరంగాల్లోనూ రాణించాలి. జీవితంపై అవగాహన పెంపొందించుకోవాలి. అందుకే చిన్న వయసునుంచే వివిధ అంశాలపై అవగాహన పెంపొందిస్తున్నామంటున్నారు వరుణ్.

నాలెడ్జ్ ఎక్స్ పీ జట్టు - సవాళ్లు

నాలెడ్జ్ ఎక్స్ పీ కి సీనియర్ అధ్యాపకులు, విద్యావేత్తలు, సైకాలజిస్టులతో కూడిన ఒక టీం ఉంది. వారికి విద్యారంగంలో అపారమైన అనుభవం ఉంది. జాన్ డివే, మారియా మాంటెస్సోరి, డేవిడ్ కోల్బ్, మకిగుచి లాంటి లాంటి మానసిక నిపుణులు నాలెడ్జ్ ఎక్స్ పీలో భాగస్వాములుగా ఉన్నారు. ఢిల్లీలోని 25 స్కూల్స్ లో వీరు సేవలందిస్తున్నారు. నాలెడ్జ్ ఎక్స్ పీ వేదికగా వీరు దేశ నలుమూలలా క్లాసులు ఇస్తున్నారు. స్కూల్స్ కు వెళ్లి ప్రిన్సిపాల్స్ తో మాట్లాడి వారిని ఒప్పించడం, వెయిట్ చేయడం దినచర్యగా మారింది. ఆ ఓపికే ఇప్పుడు మంచి రిజల్ట్ ఇస్తోందంటున్నారు వరుణ్

ప్రోగ్రాం పనితీరు ఎలా వుందంటే..

స్కూల్ లో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రోగ్రాం ఉంటుంది. వర్క్ షాపు పూర్తయిన వెంటనే ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. దాన్నిబట్టి పనితీరును రోజు రోజుకూ మెరుగు పరుచుకుంటారు. ఫైవ్ పాయింట్స్ ఉండే రేటింగ్స్ లో 4.5 కి ఎప్పుడూ తగ్గకుండా చూసుకుంటారు. ప్రయోగాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే మిగతా ఎడ్యుకేషన్ కంపెనీలకన్నా మా పనితీరు ఎంతో బాగుందని మా కస్టమర్సే చెబుతుంటారని వరుణ్ అంటున్నారు.

వర్క్ షాప్ నిర్వహించే ముందు నాలెడ్జ్ ఎక్స్ పీ ఏం చేస్తుందంటే- మొత్తం సిలబస్, చెప్పే విధానాన్ని, పద్దతులను స్టడీ చేస్తుంది. కరికులమ్ లోని కొంత భాగాన్ని తీసుకుని పలురకాల మాడ్యూల్స్ గా మారుస్తుంది. వాటిని డిఫరెండ్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. తర్వాత విద్యార్థుల వయసు, పరిజ్ఞానం బట్టి వివిధ కేటగిరీలుగా విభజించి క్లాసులు చెప్తుంటారు. అవసరమైతే ట్రెక్కింగ్, స్పోర్ట్స్ లాంటివి కూడా నిర్వహిస్తుంటారు. నిజమే రియల్ లైఫ్ ఎక్స్ పోజర్ ఒక్కసారి వస్తే దాన్ని జీవితంలో మర్చిపోలేరు. విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్, గత అనుభవాలను దృష్టిలోపెట్టుకుని కూడా బోధనా పద్ధతి మార్చుకుంటారు.

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా..

స్టార్టప్ పెట్టిన కొద్దిరోజుల్లోనే మంచి రెస్పాండ్ వచ్చింది. ఏడాదిలోనే 25 స్కూల్స్ తో పార్ట్ నర్ షిప్ కుదిరింది. వీటిలో ద శ్రీరాం స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, సర్దార్ పటేల్ విద్యాలయ లాంటి ప్రతిష్టాత్మక స్కూల్స్ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మరికొన్ని వర్క్ షాపులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగ్రా, డెహ్రాడూన్, జైపూర్, చండీగఢ్, ముంబై, కోల్ కతాలో సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది కంపెనీ. 2014 నుంచి ఏటా 300 శాతం వృద్ధిరేటు సాధిస్తోంది. అయితే ఆదాయ వివరాలు వెల్లడించేందుకు మాత్రం నాలెడ్జ్ ఎక్స్ పీ ఇష్టపడటం లేదు. అదే బిజినెస్ సీక్రెట్ అంటోంది.

జాతీయ స్థాయిలో లీడర్ షిప్ వర్క్ షాపులు నిర్వహించాలనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. సర్కారీ బడుల్లోనూ వర్క్ షాపులు నిర్వహించేలా ఒప్పిస్తాం అంటున్నారు వరుణ్ . పిల్లకు చదవడం, రాయడం వస్తే సరిపోదు. వారిని సంపూర్ణ విద్యావంతులుగా మార్చాలన్నదే మా లక్ష్యం అంటారాయన.

యువర్ స్టోరీ మాట

మూస పద్దతులనుంచి ప్రపంచంమంతా ప్రయోగాత్మక, సృజనాత్మక విద్య వైపు ప్రపంచం వెళ్తోంది. వేగంగా నేర్చుకోవడంలోనే విజయం దాగుంది. నేర్చుకోవడం ఒక ఫన్ లా ఉండాలి. ఆడుతూ పాడుతూ చదువుకోగలగాలి. ఐబీఈఎఫ్ రిపోర్ట్ ప్రకారం దేశ హైస్కూల్స్ లో 20 ఏళ్లలో ఏడుకోట్ల మందికి పైగా విద్యార్థులు చేరారు. వారు స్కూల్ మధ్యలోనే మానేయకుండా చూడాలి. అందుకే కొత్త పద్ధతులపై దృష్టిపెట్టాలి. సంప్రదాయ మూసపద్ధతులకు స్వస్తి చెప్పాలి. స్కూల్స్ , టీచర్స్ కు బిజీ షెడ్యూల్ ఉండటంతో ప్రయోగాత్మక విద్యకు ఉన్న స్కోప్ కాస్త తక్కువే. అయితే కొత్త పద్ధతుల్లో విద్య నేర్చుకోవడం అంత కష్టమేమీ కాదు. ఇందుకోసం అవసరమైతే స్కూల్ టైమింగ్స్ మార్చాలి. 

దేశంలోని స్కూల్స్ లో సరైన మౌలిక సదుపాయాలు లేవు. అలాంటిచోట వర్క్ షాపుల నిర్వహణ అంటే అంత ఈజీకాదు. కొన్ని స్కూల్స్ కు వర్క్ షాపులకయ్యే ఖర్చు భరించే సత్తా లేదు. అందుకే నాలెడ్జ్ ఎక్స్ పీ లాంటి స్టార్టప్ లు అన్ని స్కూల్స్ కు సరిపోయే మాడ్యూల్స్ ను తయారు చేయాలి. అప్పుడే దేశంలో విద్యావ్యవస్థ సమూలంగా మారిపోతుంది.


I am a young post graduate ... have a great zeal for entrepreneurship. Writing is my hobby

Related Stories