కోడిని కోయకుండా చికెన్.. మేకను నరకకుండా మటన్.. ఇదీ ఓ తెలుగోడి ఫార్ములా

0

ఇంట్లో దావత్ చేస్తున్నారా? కనీసం నాలుగైదు మేకల తలలు తెగిపడాల్సిందే. మటన్, చికెన్ తో ఫంక్షన్ అదిరిపోవాల్సిందే. ఇలా ఆలోచించేవాళ్లెందరో. ఇంకొన్నేళ్లు ఆగితే... ఇలా మేకల తలలు నరకాల్సిన అవసరం లేదు. కోళ్లను బలివ్వాల్సిన పని లేదు. అలాగని మాంసాహారానికి దూరం కావాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా ఓ షాపుకెళ్లి మటన్, చికెన్ కొనుక్కోవచ్చు. ఇప్పుడూ అదేగా చేస్తుందని డౌటా? అక్కడే ఉంది అసలు ట్విస్టు. అలా అమ్మే మాంసం మేకల్ని, కోళ్లని చంపి సిద్ధం చేయరు. ఆ మాంసాన్ని ఓ ల్యాబ్ లో తయారుచేస్తారు. ల్యాబ్ లో మాంసం ఎలా తయారు చేస్తారన్న సందేహం వచ్చిందా? దాన్ని నిరూపించాడు ఓ తెలుగు డాక్టర్.

ఉమా ఎస్ వాలేటీ... అమెరికాలో ఓ పెద్ద డాక్టర్. మాయో క్లినిక్ లో శిక్షణ పొందిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో అసోసియేట్ ప్రొఫెసర్. ట్విన్ సిటీస్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. ఈ మధ్యే ఓ పరిశోధన ద్వారా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారిపోతుంది. ల్యాబ్ లో మాంసం తయారు చేసి సంచలనం సృష్టంచారాయన. ఇండియన్ అమెరికన్, అందునా తెలుగోడు అయిన వాలేటీ... సైంటిస్ట్ టీమ్ తో చేసిన కృషి ఫలితమే ఈ విజయం. మెంఫిస్ లో బార్బిక్యూ చైన్ రెస్టారెంట్స్ ఉన్న బయోమెడికల్ ఇంజనీర్ విల్ క్లెమ్, స్టెమ్ సెల్ బయాలజిస్ట్ నిఖోలస్ జెనోవీస్ తో కలిసి మెంఫిస్ మీట్స్ ను నెలకొల్పారు వాలేటీ. వీరి కంపెనీకి వెంచర్ క్యాపిటల్ కూడా వచ్చింది. జంతు కణాలను తీసుకొని వాటి నుంచి మరిన్ని కణాలను పుట్టిస్తారు. ఆ కణాలకు ఆక్సిజన్ తో పాటు చక్కెర, ఖనిజాల్లాంటి పోషకాలు అందిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు 9 నుంచి 21 రోజులు పడుతుంది. ఆ తర్వాత మాంసం రెడీ. జంతు వధను తగ్గించడం, తద్వారా వచ్చే దుష్ఫలితాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ ఆలోచనకు బీజం పడింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున జంతు వధను తగ్గించడానికి ఈ ఫార్ములా బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

"మాంసం తినే కుటుంబంలో నేను పెరిగాను. చిన్నప్పటి నుంచి మాంసం తినే వాడిని. మాంసం తినాలంటే ఇలా జంతువుల్ని చంపాల్సిందేనా అని నాకు అప్పట్నుంచే అనిపించింది. అందుకే జంతు వధ లేకుండా మాంసాన్ని తినడం సాధ్యం చేస్తున్నాం"-వాలేటీ.

మార్కెట్లోకి...

రాబోయే సంవత్సరాల్లో అయితే ఈ ఫార్ములాతో మాంసాన్ని తయారు చేసి మార్కెట్లో అమ్మే ఆలోచనలో ఉన్నారు. ఈ మాంసం తినడం ద్వారా ఆరోగ్యపరంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బ్యాక్టీరియా కలుషితం కూడా లేదు. కొవ్వు పెరిగే ఛాన్సే లేదు. ఇక జంతువధ ఎలాగూ ఉండదు. కాబట్టి తద్వారా వచ్చే పర్యావరణ సమస్యలూ తగ్గిపోతాయి. సురక్షితమైన, ఆరోగ్యకరమైన, ఎక్కువకాలం నిల్వ ఉండే మాంసాన్ని తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. బీఫ్, చికెన్ లాంటి ప్రధానంగా తినే మాంసాహారంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బీఫ్ మీట్ పై టెస్ట్ రన్స్ జరిగాయి. రాబోయే మూడేళ్లలో రెస్టారెంట్లకు, ఐదేళ్లలో రీటైల్ గా అమ్మడమే వీరి టార్గెట్. తొలి తయారీ యూనిట్ ను అమెరికాలోనే నెలకొల్పుతారు. దాంతో పాటు భారతదేశం, చైనాల్లో తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను చూస్తున్నారు. సో... ఇది వర్కవుట్ అయితే... ఇకపై మాంసం తినాలంటే మేకను కొయ్యాల్సిన అవసరం లేదు. చికెన్ కావాలంటే కోడి తల తీయక్కర్లేదన్నమాట. మాంసం తినడానికి జంతువును చంపాల్సిన అవసరం కూడా రాదు.

Related Stories