ఒక యాక్సిడెంట్ గ్లోబర్ రేసర్ ఏర్పాటుకు కారణమైంది

అల్ట్రా రన్నర్స్‌కు వేదికగా గ్లోబ్ రేసర్స్ .. ప్రమాదం నుంచి రేసుల వరకూ ఎదిగిన కవిత.. 

ఒక యాక్సిడెంట్ గ్లోబర్ రేసర్ ఏర్పాటుకు కారణమైంది

Friday May 29, 2015,

4 min Read


“ప్రతీ సారి పరుగు పందెంలో పాల్గొన్నపుడల్లా నాకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఆ సమయంలో లభించే ఉత్సాహాన్ని, శక్తిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. క్లిష్టమైన ట్రయిల్స్‌లో రన్నింగ్ అంటే బాగా ఇష్టం. ప్రతీ పరుగులోని అడుగుకూ ఓ రిథమ్ ఉంటుంది. కొండలపై నుంచి ఇది అసాధ్యం అనిపించే పోటీలు, వివిధ ప్రాంతాల్లోని రకరకాల రేసులు నాకు మరింతగా ఉత్సాహాన్నిస్తాయి.” – కవిత కనపర్తి, గ్లోబ్ రేసర్స్ డైరెక్టర్

విత కనపర్తి, గ్లోబ్ రేసర్స్ డైరెక్టర్

విత కనపర్తి, గ్లోబ్ రేసర్స్ డైరెక్టర్


ప్రతీ రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఉదయం ఐదింటికల్లా కవిత తన స్నేహితురాలి ఇంటికి రన్నింగ్ చేస్తూ బయల్దేరింది. కానీ ప్రమాదం ఆమెను వెంటాడి... ఓ బస్ గుద్దేయడంతో ఆస్పత్రిపాలైందామె. 3 వారాలపాటు కోమాలో ఉన్న కవిత.... కళ్లు తెరిచిన వెంటనే తెలుసుకున్న విషయం... అప్పుడైన గాయాలు ఆమెను జీవితాంతం వెంటాడేవి అని. అంతేకాదు తన జీవితంలోనీ చాలా సంఘటనలను కూడా మర్చిపోయేటట్టు చేసిందా యాక్సిడెంట్. అవన్నీ మళ్లీ నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన పరిస్థితి కల్పించిందా ప్రమాదం. అప్పుడామె వయసు 15 ఏళ్లు మాత్రమే. బోర్డ్ ఎగ్జామ్స్ రాసేందుకు కొన్ని వారాల గడువుందంతే అప్పటికి.

కొండలు, గుట్టల్లో అలా సాగిపోయే ప్రయాణం ఆమెది

కొండలు, గుట్టల్లో అలా సాగిపోయే ప్రయాణం ఆమెది


అయినా సరే జీవితమంటే భయపడలేదు కవిత కనపర్తి. “నేనెప్పుడైనా గందరగోళానికి గురైనా, భయపడినా, ఏదైనా కష్టంగా భావించినా... నా షూస్ వేసుకుని ట్రయల్స్‌కి వెళ్లిపోతాను. ఎప్పుడూ నా తెలివిని మాత్రం నాతోనే ఉంచుకుంటాను”అంటారు కవిత. పాఠశాల విద్య పూర్తయ్యాక హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా ప్రయాణమయ్యారామె. అక్కడ అనేక దశలను ఆమె దాటాల్సి వచ్చింది. విద్య పరంగా ఎలక్ట్రికల్ ఇంజినీర్, కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో మేథావి, ఇంటీరియర్ డిజైనింగ్, ఆ తర్వాత 2009లో గ్లోబ్ రేసర్స్ క్రియేట్ చేసిన అల్ట్రా రేసుల నిర్వహణ.

“గ్లోబ్ రేసర్స్ అనుకోకుండా ఏర్పాటైంది. నిజానికి దీన్ని అల్ట్రారేసుల కోసం అనుకోలేదు. నా పరుగుల రికార్డులను తెలిపేలా ఓ బ్లాగ్ అనుకున్నా అంతే” అంటారు కవిత. తాను అనుకున్నది చిన్న లక్ష్యమే అయినా... విధి మరో దారిలో తీసుకెళ్లింది. 2009లో అమెరికా నుంచి ఇండియా వచ్చినపుడు కవిత ఓ అపార్ట్‌మెంట్‌లో మరో రన్నర్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి కొండల్లో పరుగులు తీయాలని నిర్ణయించుకున్నారు.

వారి మొదటి పరుగు సందక్‌ఫులో ఏర్పాటు చేసుకున్నారు. ప్రయాణ ఏర్పాట్లు, ఆ ప్రాంతంలో అవసరయ్యే ఏర్పాట్లను కవిత స్వయంగా చూసుకున్నారు. “నేను ఈ పరుగును పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోవాలని అనుకున్నా. అందుకే ప్రయాణ ఏర్పాట్లతో సహా అన్నీ చూసుకున్నా. స్థానిక వ్యక్తులతో మాట్లాడాను. రూటు, మ్యాప్స్, ప్లాన్ అన్నీ స్వయంగా నిర్ణయించుకున్నాన”ని చెప్పారు కవిత.

స్వయంగా ఆర్గనైజ్ చేసుకున్న తొలి రన్ పూర్తయ్యాక... సొంతంగా దేశవ్యాప్తంగా రేసులు నిర్వహించగలనని అర్ధమైంది కవితకు. అసలు ఆమె యూఎస్ నుంచి భారత్ వచ్చిన ఉద్దేశ్యం ఒక చిన్న విజిట్ మాత్రమే. అయితే దేశవ్యాప్తంగా అల్ట్రా రేసుల నిర్వహణ కోసం తన టూర్‌ని పొడిగించుకున్నారామె. వినూత్నంగా ఉండే రేసులు నిర్వహించాలని భావించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఏర్పాటు చేసిన వారినుంచి విశేషాలు తెలుసుకోవడంతోపాటు పుస్తకాలూ చదివారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రేసులు నిర్వహించాలనే నిర్ణయానికొచ్చారు కవిత. అందుకోసం ఎలాంటి ట్రైనింగ్‌లు అవసరమో తెలుసుకుని వాటిపై అధ్యయనం చేశారు. తొలి అల్ట్రా రేసును జైసల్మేర్ - పోఖ్రాన్ మధ్య నిర్వహించేందుకు ముందుగా రెక్కీ కూడా నిర్వహించానని చెబ్తారు కవిత.

ఎంతో కాలంగా ఓర్పుగా ఎదురుచూసిన తొలి అల్ట్రారన్ 2009 ద్వితీయార్థంలో జరిగింది. ఐదు స్టేజ్‌లలో 210 కిలోమీటర్ల 'ది థార్ రన్' జరిగింది. “మేం ఆఫ్ లైన్‌లోనే ప్రజలను రిజిస్టర్ చేసుకున్నాం. మార్కెటింగ్ అంతా మాత్ పబ్లిసిటీ ద్వారానే జరిగింది. ఇది మా తొలి రేస్. మా దగ్గర ఓ మాన్యువల్ గానీ, ప్లాన్ గానీ లేదు. చాలావాటిని చివరి నిమిషంలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ మేం బాగానే నిర్వహించాం. గాటొరేడ్, స్యూంటో, సాలోమన్ వంటి భాగస్వాములనూ మేం సంతృప్తిపరచగలగాం” అని చెప్పారు కవిత.

భారతదేశపు మొదటి అల్ట్రారన్నర్ అరుణ్ భరద్వాజ్, ఇద్దరు జర్మన్లు, ఇద్దరు సింగపూర్ రేసర్లు, ఒక కెనడియన్... ది థార్ రన్‌లో పాలుపంచుకున్నారు. “ఇది మా తొలి రేస్. మాకు ఏ విధమైన ప్రణాళికలు లేవు. చాలావాటిపై అంచనా కూడా లేదు. దీంతో మాకు ఈ రేస్ అనేక అనుభవాలు నేర్పింది. ఇప్పుడైతే మేం అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నాం. ప్రతీ రేసుకు ముందస్తుగా రెక్కీ, నిర్వహణపై ఏడాది ముందే ప్రణాళిక మొదలైపోతుంది. డ్రైవర్లు, వాలంటీర్లు సహా అందరికీ అవగాహన కల్పిస్తున్నామం”టారు కవిత.

ఒక కంపెనీగా, సంస్థగా ఎదగడంలో గ్లోబ్ రేసర్స్‌కు ఒకటే ప్రాధాన్యం. అదే రన్నర్. “ప్రతీ రేసు వైవిధ్యంగా ఉంటుంది. ఆయా ప్రాంతాలు, పరిస్థితులు, తీరుతెన్నులకు అనుగుణంగా నిబంధనలు రూపొందిస్తాం. మేం వాటికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. అలాగే ప్రతీ రేసులోనూ ఎంతమంది రన్నర్లు ఉండాలో పరిమితి ఉంటుంది. కానీ బ్రాండింగ్ కంపెనీలు ఎక్కువ మంది రేసర్లు ఉండాలని కోరుకుంటారు. వాలంటీర్ల విషయంలోనూ నిష్పత్తిని జాగ్రత్తగా నిర్ణయిస్తాం. రన్నర్-వాలంటీర్ల నిష్పత్తి ప్రతీ రేసుకు మారుతూ ఉంటుంది” అంటారు కవిత.

image


“అల్ట్రారన్నర్లకు మా సంస్థ వేదికగా మారింది. తమపై తమకు అంచనాలు, కలలు, కోరికలు ఉన్న రన్నర్స్ అందరూ గ్లోబ్ రేసర్స్ దగ్గరు వస్తున్నారు. మేం వారికి తగిన సలహాలు ఇచ్చి, ఏది చేయాలో, ఏది చేయకూడదో సూచనలు చేస్తున్నాం. వారికి రేస్ ప్రారంభమయ్యే ముందు ఏ విధమైన ట్రైనింగ్ అవసరమో కూడా సూచిస్తాం. రేస్ సమయంలో ఏమేం వెంట ఉండాలో సలహా ఇస్తాం. చివరకు ఓడిపోతే తీవ్రంగా స్పందించకుండా ముందుగా కౌన్సిలింగ్ కూడా మేమే ఇస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఎదురైతే తక్షణం ఎలా రియాక్ట్ కావాలో శిక్షణ ఇస్తున్నాం. ఒక్క రన్నర్ కూడా రేస్ సమయంలో ప్రమాదవశాత్తూ ప్రాణాలమీదకు తెచ్చుకోకూడదన్నదే మా లక్ష్యం” అంటున్నారు కవిత.

భారతదేశంలో ఉన్న అల్ట్రా రన్నర్లను... ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా మారాలన్నదే తమ ఉద్దేశ్యమని చెబ్తోంది గ్లోబ్ రేసర్స్. దేశంలోని అల్ట్రా రన్నర్స్ అంతర్జాతీయ స్థాయి రన్నర్స్‌గా ఎదిగేందుకు తగిన శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయడమే తమ తర్వాతి లక్ష్యమని చెబ్తున్నారు కవిత కనపర్తి.