ఈ-దాన్‌తో ఎటువంటి విరాళాలైనా మేడ్ ఈజీ

సాయం ఏదైనా సకాలంలో అందితేనే సార్థకత అంటున్న మయాంక్ జైన్ ఎన్జీవోల సాయంతో దూసుకుపోతున్న సంస్థ ఈ -దాన్ దుస్తులు, పాత టీవీలు, ఫ్రిజ్‌లు, పుస్తకాలు ఏవైనా ఈ-దాన్‌లో దానం చేయచ్చుజనంలో సామాజిక స్పృహ పెరిగింది- మయాంక్ జైన్

ఈ-దాన్‌తో ఎటువంటి విరాళాలైనా మేడ్ ఈజీ

Wednesday July 29, 2015,

4 min Read

మాట్టాడే పెదవులు కంటే సాయం చేసే చేతులు మిన్న అంటారు. సమాజానికి ఏదో చేయాలని సంకల్పించేవారు కొందరు... ఏదో ఒకటి చేస్తూ చేస్తున్నదాన్ని ఇంకా విస్తరించాలని ఆలోచించేవారు ఇంకొందరు. సమాజం మనకేమిచ్చిందనే దానికంటే సామాజిక బాధ్యతగా మనం ఏం చేయాలని ఆలోచించాలంటారు ఈ -దాన్ సహ వ్యవస్థాపకుడు మయాంక్ జైన్.

మయాంక్ జైన్

మయాంక్ జైన్


కొంతమందికి డబ్బులు అవసరం అవుతాయి..మరికొందరికి చేతిసాయం...ఇంకొందరికి బట్టలు, ఆహారం...ఇలా ఏ అవసరం ఎవరికి ఉంటుందో మనం ఊహించడం కష్టం. మనకు తోచింది సాయం చేయడం మానవత్వం అనిపించుకుంటుంది. కొంతమంది పనిచేసే స్థితిలో ఉన్నా అది చేయకుండా ఎదుటివారి సాయం తీసుకుంటుంటారు. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు తమ సేవా కార్యక్రమాల కోసం విరాళాలు అడుగుతుంటాయి. ఆ విరాళాలు వస్తురూపంలో ఉండవచ్చు. లేదంటే వేరే విధంగానూ ఉండవచ్చు. ఉదాహరణకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేద విద్యార్ధుల కోసం వాడేసిన పాత పాఠ్యపుస్తకాలు అవీ సేకరిస్తూంటాయి. మరికొన్ని సంస్థలు ఆహార పదార్ధాలు అంటే వండినవి కాకుండా చాలాకాలం పాటు నిల్వ ఉండేవి సేకరిస్తాయి.

అయితే చాలా సంస్థలు మాత్రం విరాళాలు తీసుకుని వాటిని సద్వినియోగం చేస్తుంటాయి. దుర్వినియోగం చేసేవాటి గురించి మనం ఆలోచించకూడదు. వివిధ విరాళాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది ఈ-దాన్. దీక్షా కొత్వాల్‌వాలా, కోసల్ మల్లాది ఈ దాన్‌కు రూపకల్సన చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు గ్రాడ్యుయేట్లు దీక్షా కొత్వాల్ వాలా, కోసల్ మల్లాదితో పాటు ముంబై ఎన్ఎంఐఎంఎస్ ఎంబీయే గ్రాడ్యుయేట్ మయాంక్ జైన్‌లు ఈ దాన్ విజయవంతంగా నడుపుతున్నారు.

వీరితో పాటు సోషల్ మీడియాకి చెందిన లతిక్‌పతేలా, సిద్ధార్థ్ ఫడ్కర్ లు ఈ దాన్‌కు మంచి రూపం తెచ్చారు. వివిధ వర్గాలకు చెందిన వారితో మమేకం కావడం వివిధ రకాల విరాళాలు సేకరించడం, వివిధ స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవడం వీరి పని.

image


13 రాష్ట్రాల్లో కార్యకలాపాలు

ఈ దాన్ ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు సాగిస్తోంది. ‘‘ఈ దాన్ ద్వారా వేయి రకాల విరాళాలు సేకరించాం. అందులో వాడి పక్కన పడేసిన టీవీలు, ఫ్రిజ్‌లు, రేషన్, బట్టలు.... వగైరా అన్నీ ఉన్నాయి. నిరుపేదల కోసం పనిచేసే సంస్థలు వీటిని ఉపయోగించుకుంటాయి. స్కూళ్ళలో విద్యాభివృద్ధికి టెలవిజన్‌లు ఉపయోగిస్తాం. ఇక రేషన్ సరుకులతో పిల్లల ఆకలి తీరుస్తాం’’ అంటున్నారు మయాంక్ జైన్.

ఈ దాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి క్లిక్ చేస్తే చాలు... మీరు ఈ దాన్‌కి ఏం ఇవ్వదలిచారో అక్కడ వివరాలు పొందుపరచవచ్చు. ఈదాన్ ఆయా వ్యక్తుల వివరాలు సేకరించి.. వాటిని సంబంధిత ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థకు తెలియచేస్తుంది. ఇచ్చిన వివరాలను పరిశీలించి ఆ సంస్థ వారు అక్కడినించి విరాళాలు తీసుకుంటారు. అవసరం ఉన్నవారికి వాటిని చేరుస్తారు.

బాగా పెరిగిన ఎన్జీవోలు

మనదేశంలో ఇటీవలి కాలంలో ఎన్జీవోల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం 3.4 మిలియన్ ఎన్జీవోలు ఉన్నారు. ప్రతి 400 మందికి ఒక ఎన్జీవో ఉంది. ఎన్జీవోలకు విరాళాలు ఇవ్వడం ఇప్పుడెంతో ఈజీ. ఈ దాన్ రాకతో ఎవరు ఏం దానం చేయాలన్నా చిటికెలో ఆయా సంస్థలు వారిముందు ప్రత్యక్షం అవుతాయి. వారు ఏం చేయదలుచుకున్నారో ఆలోచించి.. వారినుంచి విరాళాలు సేకరించడం చాలా తేలికగా జరిగిపోతోంది.

ఈదాన్ ద్వారా అనేక ఎన్టీవోలు తమ సేవలు అందించడానికి సిద్ధమే. అయితే మంచి ఎన్జీవో ద్వారా మన లక్ష్యాల్ని మనం చేరుకోవాలంటారు మయాంక్ జైన్. మనం సరైన ఎన్జీవోని ఎంపికచేసుకోలేకపోతే ఆ విషయంలో తప్పులో కాలేసినట్టే. మంచి విరాళాలు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు ఉన్నా వారిని సరిగా కలుసుకోలేకపోవచ్చు. మంచి ఎన్జీవో ద్వారానే ఈ దాన్ సక్సెస్ అవుతుందంటారు.

image


పేదరికాన్ని పోగొట్టే మంత్రం

దేశంలో పేదరికం పోవాలంటే ఈ దాన్ అవసరం ఎంతో ఉంది. విరాళాలు ఇవ్వడంలో ఉంతే తృప్తిని అందరికీ తెలియచేయాలి. మనకు అందుబాటులో ఉన్న వనరుల్ని, వస్తువుల్ని ఇతరులకు దానం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన స్థాయిలో విరాళాలు ఇవ్వడం ఎంతో అవసరం అంటారు ఈ దాన్ వ్యవస్థాపకులు. ఈ దాన్‌పై ఎంతో చర్చ జరగాలంటారు.

అర్థవంతమయిన విరాళం, సాయం అవసరమయిన వ్యక్తికి, అవసరమయిన సమయంలో అందాలి. అప్పుడే దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. సమాజం గురించి ఆలోచించేవారు సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మనం చేసే సాయం చిన్నదే కావచ్చు. అది ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తుంది. ఈదాన్‌ని చేరుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ విప్లవం వచ్చింది. అరచేతిలోనే స్వర్గం, ప్రపంచం కనిపిస్తోంది.

ఏదిచేసినా నిరాడంబరం చేయాలనుకునేవారికి ఈ దాన్ వెబ్‌సైట్ మంచి దారి. చేసిన సాయం పదిమందికి తెలియాలనుకుంటారు మరికొందరు. అలాంటివారు ఈదాన్‌కి సమాచారం ఇచ్చి వారు పంపే ఎన్జీవో ద్వారా తమ పనిచేసుకోవచ్చు. తాము ఇవ్వాలనుకున్న వస్తువుని అవసరం ఉన్నవారికి అందచేయవచ్చు.

ఓ పేదరాలైన తల్లి తాను సంపాదించే తక్కువ మొత్తాన్ని ఎలా ఖర్చుచేయాలి, ఆ డబ్బుతో పిల్లలకు రేపు ఎలాంటి ఆహారం పెట్టాలి, వారిని ఎలా చదివించాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలని అని ఆలోచిస్తారు. ఈదాన్ లాంటి సంస్థలు ఇలాంటివారికి సాయం చేయాలి. క్రిందిస్థాయిలో ఏం జరుగుతుందో ఆలోచించాలంటారు ఈదాన్ సహ వ్యవస్థాపకుడు కోసల్ మల్లాది. చిన్న జాబ్ చేస్తున్న వ్యక్తి మంచి వ్యాపారం చేయాలని కోరుకుంటాడు. అలాగే పేదరికంలో ఉన్నవారు బయటికి రావాలని కోరుకుంటారు. ఆకలితో ఉన్నవారికి భోజనం విలువ తెలుస్తుంది. అవసరం ఉన్నవారికే సాయం చేయాలి. ఆ సాయం కూడా సరైన వ్యక్తి ద్వారా సరైన టైంకి అందాలంటారు కోసల్ మల్లాది.

మయాంక్, వారి టీం ఒక లక్ష్యంతో ముందుకెళుతున్నారు. సాయానికి ఎన్నో దారులుంటాయి. మంచి దారిని ఎంచుకుని సాయం చేయాలంటారు. ఆత్మ సంతృప్తితో ముందుకు సాగాలంటారు. ఎన్ని మైళ్ళ ప్రయాణమయినా ఒక్క అడుగుతో ముందుకేద్దాం అంటారు. ఎందుకంటే ఈ దాన్ ప్రారంభమయిన సందర్భంలో కొంతమంది మాత్రమే స్పందించారు. ఆ స్పందనను చూసి మరికొందరు ముందుకొచ్చారు. ఇప్పుడు వివిధ రకాల విరాళాలను అందించేందుకు ఈదాన్‌ని సంప్రదించేవారు ఎక్కువయ్యారు. ఈ దాన్‌ని మంచి సాయానికి మార్గంగా ఎంచుకుంటున్నారు. దయతో దానం చేయడం ఇప్పుడు బాగా పెరిగిపోయింది.

మెగా మెనూతో ఒప్పందం

ఆకలేసినప్నుడు ఏదో ఒక ఆహారం అవసరం అవుతుంది. అదే మిగిలిపోయిన ఫుడ్ పేదల కడుపు నింపితే ఎంత బావుంటుంది. ఈ దాన్ తన సేవల్ని మరింతగా మెరుగుపరుచుకునేందుకు మెగామెనూ.ఇన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్ విరాళంగా తీసుకుంటారు. ఆహారం లేక అలమటించేవారికి దాన్ని అప్పటికప్పుడు అందచేస్తారు. ఈ దాన్ సాయంతో రెస్టారెంట్ల వివరాలు ఎన్జీవోలకు అందిస్తే వారే వచ్చి ఆహారం తీసుకెళతారు. ఈదాన్ ఈవిధంగా తన సరిహద్దుల్ని పెంచుకుంటూ పోతోంది. వస్తువు ఏదైనా సాయం ప్రదానం అంటారు ఈ దాన్ నిర్వాహకులు.

అందరికీ ఉపయోగపడేవాటిని ఈదాన్‌కి ఇవ్వాలి. త్వరగా పాడయిపోయే వాటిని ఇవ్వకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈదాన్‌కి సమాచారం ఇచ్చాక ఎన్జీవోలు వచ్చి వాటిని తీసుకెళ్ళడం కాస్త సమయంతో కూడుకుని ఉంటుంది. పరిమాణం గురించి అంతగా పట్టించుకోవాల్సింది లేదు. ఒకేరకం వస్తువులు ఇవ్వాలనుకున్నవారు పదిమంది కలిస్తే మంచిది. దుస్తులు ఇవ్వాలనుకున్నవారు బాగా చిరిగిపోయినవి ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే మనం చేసే సాయం చెత్తబుట్ట పాలుకాకూడదు. వెబ్‌సైట్ ద్వారా ఏవైనా వస్తువులు మాత్రమే ఈ దాన్ వారు తీసుకుంటున్నారు. నగదు విరాళాలను ఒప్పుకోవడం లేదు. ఈ దాన్ నిబద్ధతతో పనిచేసే సంస్థ. జవాబుదారీతనం అనేది ఎంతో ముఖ్యం. ఏ సంస్థ అయినా పదికాలాల పాటు మనుగడ సాగించాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం అంటారు మయాంక్ జైన్.

ఏదైనా సాయం చేయాలని భావించేవారికి ఈ దాన్ మంచి సాధనం లాంటిది. ఈదాన్ ద్వారా దాతలు తమ విరాళాలను, వివిధ వస్తువులను దానం చేయవచ్చు. ఈదాన్ ద్వారా మరింతమందికి సేవ చేయడానికి సిద్ధం అంటారు నిర్వాహకులు. మరిన్ని వివరాల కోసం [email protected] ద్వారా లేదా +91-9920414940 ని సంప్రదించవచ్చు.

website