250 జలపాతాలను నామరూపాల్లేకుండా చేసిన రాకాసి బొగ్గుగని  

0

చిరిమిరి పేరు వినగానే గుర్తొచ్చేది అందమైన జలపాతాలు, పచ్చటి తివాచీ పరుచుకున్న కొండలు. ఎటుచూసినా ప్రకృతి రమణీయత రారామ్మని పిలుస్తుంది. ఒక్కసారి చూస్తే జన్మంతా గుర్తుండే సుందర సెలయేళ్ల ప్రదేశం. అలుపెరుగని జలధారలు ఒకవైవు, అమాయక గిరిజనులు మరోవైపు. మండు వేసవిలో హిల్ స్టేషన్ వెళ్లాలనుకునేవారికి మొదటి ప్రియారిటీ చిరిమిరినే. ఛత్తీస్ గఢ్ కొరియా జిల్లాలో ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా భాసిల్లిన ఆ భూతలస్వర్గం ఇప్పుడొక నరకకూపంలా మారింది. 

వందల జలపాతాల సుందర ప్రదేశాన్ని రాకాసి బొగ్గు టన్నుల కొద్దీ మన్నుగప్పింది. మట్టికాళ్ల మహారాక్షసిలాంటి భారీభారీ క్రేన్లు నీటి జాడే లేకుండా చేశాయి. దాదాపు 250 జలపాతాలతో అలరారే చిరిమిరి- ఇప్పుడు చంటిపిల్లవాడి బుగ్గలపై ఎండిపోయిన కన్నీటి చారికలా కనిపిస్తోంది. గిరిజనుల జీవనశైలిలో భాగమైన ఆ సుజలస్రవంతి ఆవిరైపోయింది. పచ్చదనాన్ని నిలువునా పెకిలించిన ఓపెన్ కాస్ట్ బొగ్గుగనులు నీటి ఆనవాలునే లేకుండా చేశాయి. కమ్మటి జలధారలతో గిరిపుత్రుల బతుకుని నిలబెట్టిన చిరిమిరిని చూస్తే గుండె తరుక్కుపోతుంది.

ఎటు చూసినా పేలుళ్లు, ఎటు తిరిగినా డ్రిల్లింగ్, నల్లటి పొగలాంటి దుమ్ము, దట్టమైన ధూళి. ఇదీ చెరిమిరిలో ప్రస్తుత పరిస్థితి. పచ్చని ఆకుల కొండలు మటుమాయమయ్యాయి. ఛత్తీస్ గఢ్ కొరియా జిల్లా బొగ్గుగనులకు ప్రసిద్ధి. 125 చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు విస్తరించిన చిరిమిరిలో గత 70 ఏళ్లుగా తవ్వకాలు జరుగుతునే ఉన్నాయి. ఫలితంగా 250 జలపాతాలు ఆనవాలు లేకుండా పోయాయి. అక్కడి గిరిజనుల జీవనాధారం అడుగంటి పోయింది. వేల ఏళ్లనాటి పచ్చదనం ఎండిపోయింది.

ఏ నీటికైతే ఇబ్బంది లేకుండా అక్కడి జనం హాయిగా బతికారో అదే నీటికోసం ఇప్పుడు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సహజ సిద్ధ జలపాతం నుంచి వచ్చిన పరిశుభ్రమైన నీళ్లను తాగి బతికిన ప్రజలు ప్రస్తుతం కలుషిత జలాలతో గొంతు తడుపుకుంటున్నారు. వాటితో రోగాల బారిన పడుతున్నారు. కనీసం మున్సిపాలిటీ వాళ్లకు కూడా ఆ నీటిని శుద్ధి చేయాలన్న ఆలోచన రాకపోవడం బాధాకరం అంటారు అక్కడి గిరిజనులు.

70 ఏళ్ల తవ్వకాల ఫలితంగా కళ్లముందు కళకళలాడిన జలపాతాలు నోరెళ్లబెట్టిన తీరుని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ పదేళ్లలోనే చాలా సెలయేళ్లు వట్టిపోయాయి. 300 సహజసిద్ధ జలపాతాలుంటే అందులో ఇప్పుడు 20 మాత్రమే మిగిలాయంటే ఎంత వినాశనం జరుగుతుందో ఊహించొచ్చు. ప్రస్తుతం ఆ నీళ్లే అక్కడి ప్రజల అవసరాలు తీరుస్తున్నాయి. అవికూడా మాయమైతే నో మ్యాన్ జోన్ గా మారే రోజు ఎంతో దూరంలో లేదని పర్యావరణవేత్తలు అంటున్నారు.

ఎక్కడ చూసినా జలపాతలు గలగలమంటూ పారేవి. జనం పెద్దగా ప్రయాస పడేవారు కాదు. ఇప్పుడు మున్సిపల్ వాటర్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. క్యాన్ల చొప్పున లెక్క పెట్టకుంటూ నీళ్లు పట్టుకుంటున్నారు.

చిరిమిరి ఒక్కటే కాదు. దేశమంతా తాగునీటికి కటకటే ఏర్పడింది. ఏటికేడు ఆ తీవ్రత పెరుగుతునే ఉంది. ఆ లెక్కన 2050 నాటికి పరిస్థితి విషమిస్తుంది. అప్పటికీ జనాభా 160 కోట్లయితే, ప్రపంచంలోని జలవనరుల్లో కేవలం 4 శాతం మాత్రమే అందుబాటులో ఉంటుందని గ్రీన్ పీస్ నివేదిక చెప్తోంది. మరీ ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల మూలంగా పర్యావరణం పెను విధ్వంసానికి గురవుతోందని రిపోర్టులో తెలిపింది. ఫలితంగా మనిషి మనుగడకు ముఖ్య ఆధారమైన నీటి జాడే లేకుండా పోతుందని హెచ్చరించింది.

ఒకప్పుడు పచ్చని ప్రకృతి నడుమ, ఏ కష్టమూ తెలియకుండా బతికిన గిరిజనల జీవితాలు ఓపెన్ కాస్ట్ బొగ్గుగనులతో ఎంత చిన్నాభిన్నమయ్యాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.