90 ఏళ్ల వయసులో పీహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకున్నాడు

90 ఏళ్ల వయసులో పీహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకున్నాడు

Wednesday March 29, 2017,

2 min Read

చదువుకోవాలని మనసుండాలేగానీ వయసుతో నిమిత్తం లేదని నిరూంపించారు చెన్నయ్ కి చెందిన పెద్దాయన. 90 ఏళ్ల వయసులో పీహెచ్ డీ చేసి డాక్టరేట్ అందుకున్నారు. మొన్న ఫిబ్రవరిలో పట్టా తీసుకున్నారు కూడా.

వైఎంసీఏ జనరల్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన పాల్.. సెయింట్ మార్క్స్ కేథడ్రల్ చర్చిలో ఇండస్ట్రియల్ టీమ్ సర్వీస్ విభాగాధిపతిగా జాయిన్ అయ్యారు. అంత వయసులోనూ చదువు మీద ఆసక్తి ఉండటంతో, ఖాళీ సమయంలో ఏదో ఒకటి చేయాలని అనుకునే వారు. ఆ క్రమంలోనే పీహెచ్ డీ మీద ఫోకస్ చేశారు. సుదీర్ఘ పరీక్షలు, సెమినార్లు, థీసిస్ సమర్పించి మొత్తానికి డాక్టరేట్ అందుకున్నారు.

image


నేటి యువతలోని విపరీతమైన మానసిక పోకడలు, వాటి ప్రభావంతో ఏర్పడే ఒత్తిడి, నిరాశ మొదలైనవి పాల్ ని ఆలోచింపజేశాయి. ఆ దిశగానే చైతన్యం తేవాలనే తలంపుతో ఇండియన్ సొసైటీ ఫర్ అప్లయిడ్ బిహేవియరల్ సైన్సెస్ (ఐఎస్ఏబీఎస్) పై మనసు లగ్నం చేశారు.

ఐఎస్ఏబీఎస్ అంటే, సమాజంలోని వ్యక్తుల, సంస్థల, స్వయంప్రతిపత్తి గౌరవాలకు సంబంధించిన సంస్థ. మనిషి శక్తి సామర్ధ్యాలను, పరిశోధనలను, అవగాహన, నేర్చుకునే తత్వాన్ని అంచనా వేస్తుంది.

పాల్ స్వతహాగా నిస్వార్ధ జీవి. తనకు ఉన్నదాంట్లో నలుగురికీ పంచేవాడు. బెంగళూరులోని మురికివాడల పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు, టాబ్లెట్లు, వాళ్ల ప్రాథమిక అవసరాలు తీర్చేవాడు. ఒక ఎన్జీవో కలిసి పనిచేశాడు. జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ పేరుతో వేలమందికి సాయం చేశాడు.

పాల్ భార్య జోయ్స్ సిరోమోని కూడా మానవతావాది. నలుగురికి సాయం చేసినోడే గొప్పోడు అని నమ్మే సిద్ధాంతం ఆమెది. తన 34వ ఏట నుంచే ప్రజా సేవకు అంకితమైంది. నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, మానసికంగా కుంగిపోయిన వాళ్లకు స్వాంతన చేకూర్చడం.. ఇదే ఆమె దైనందిన శైలి. ఎంబీబీఎస్ చదివిన జోయ్స్ మంచి గైనకాలజిస్టు. ఇండియా, యూకేలోని అనేక ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవం ఉంది. కోల్ కతాలో పరిపూర్ణత అనే పునరావాస కేంద్రాన్ని స్థాపించి ఎందరో రోగులకు చికిత్స అందిస్తోంది. 2010లో సీఎన్ఎన్ ఐబీఎన్ రియల్ హీరోస్ అవార్డు గెలుచుకుంది.

ఆదర్శప్రాయంగా నిలిచిన ఈ జంట చెప్పేదొక్కటే.. ప్రపంచంలో సగం మంది అమానుష ఘటనల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. అలాంటి సమాజంలో మానవీయ కోణాన్ని వెలికితీసి ప్రపచం శాంతిని ఆవిష్కరించాలి.