మానవత్వం మూర్తీభవించిన అహ్మదాబాద్ ఆటోవాలా  

0

ఇది ఆరేళ్ల క్రితం జరిగిన సంఘటన. ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. సబర్మతి రైల్వే స్టేషన్ లో దిగాడు. బయటకొచ్చాక చూసుకుంటే జేబులో పర్స్ లేదు. ఎవరో కొట్టేశారు. ఇప్పుడెలా అని బేల చూపులు చూస్తున్నాడు. అతడి పరేషాన్ గమనించిన ఒక ఆటో డ్రైవర్ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఏంటి సంగతి అని ఆరా తీశాడు. అతను జరిగింది చెప్పాడు. డ్రైవర్ మరోమాట లేకుండా రమ్మని చేయి పట్టుకుని తన ఆటో దగ్గరికి తీసుకెళ్లాడు. ఎక్కడికి వెళ్లాలో చెప్పు.. నేను తీసుకెళ్తాను అన్నాడు. డబ్బులు లేకున్నా పరవాలేదు బండెక్కు అన్నాడు. అతను షాకయ్యాడు. దాన్నుంచి తేరుకోకముందే ఆటోలో మరో అద్భుతం కనిపించింది. ఒకటి కాదు. చాలా కనినిపించాయి. అందమైన కలంకారీ కళాఖండాలు, పక్కన ఒక ఫ్యాన్, ఎదురుగా న్యూస్ పేపర్లు, మేగజైన్లు కనిపించాయి. ఒక పోర్టబుల్ లైట్ ఉంది. స్నాక్స్, తాగునీరు, డస్ట్ బిన్, ఎంపీత్రీ ప్లేయర్లో హిందీ, గుజరాతీ సాంగ్స్.. ఇలా ఆటో చిన్నపాటి ప్రపంచంలా ఉంది.

ఇంతకూ ఎవరా ఆటోవాలా? ఎందుకు ఇతడిని ఫ్రీగా తీసుకెళ్తా అన్నాడు. మీటర్ మీద డబుల్ త్రిబుల్ అంటూ ముక్కుపిండి వసూలు చేసే ఆటోవాలాలు ఉన్న నేటి కాలంలో ఇలాంటి ఆదర్శమూర్తులు కూడా ఉంటారా?

అహ్మదాబాద్(అమ్దావాద్) ఆటోవాలా రూటే సెపరేటు. గుణంలో అతనికి అతనే సాటి. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. ఖాకీ చొక్కా వదిలేసి ఖాకీ కుర్తా ధరిస్తాడు. నెత్తిమీద గాంధీ టోపీ ఉంటుంది. పేరు ఉదయ్ భాయ్. అసలు పేరు ఉదయ్ సిన్హ్ రమణ్ లాల్ జాదవ్. పేదవాళ్లకు, వికలాంగులకు, గర్భిణిలకు తన ఆటోలో చార్జీలుండవు. ఆ మాటకొస్తే సాధారణ ప్రజలకు కూడా మీటర్ మీద చార్జీ ఉండదు. ఎంతిచ్చినా తీసుకుంటాడు. ఇంత ఇవ్వాలని రుబాబ్ చేయడు. విచిత్రం ఏంటంటే ఎంత దూరం ఆటో నడిచినా మీటర్ మీద జీరోనే కనిపిస్తుంది. ప్యాసింజర్ దిగిన తర్వాత ఒక ఎన్వెలప్ ఇస్తాడు. అందులో ఒక గ్రీటింగ్ కార్డు ఉంటుంది. దానిపై పే ఫ్రమ్ యువర్ హార్ట్ అని రాసివుంటుంది. అంటే నీ మనసుకి ఎంతివ్వాలని ఉంటే అంతే ఇవ్వు.. అని అర్ధం. కొందరు ఐదు రూపాయలిస్తారు. ఇంకొందరు యాభై ఇస్తారు. ఎవరు ఎంతిచ్చినా అందులోంచి ఒక రూపాయి చారిటీకి కేటాయిస్తాడు.

పేదలకు ఆపన్న హస్తం అందించే మానవ్ సాధ్నా అనే ఎన్జీవో కార్యకలాపాలకు ఉదయ్ భాయ్ ఆకర్షితుడయ్యాడు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని తనవంతు సాయంగా జనానికి సేవ చేస్తున్నాడు.

ఉదయ్ కి నలుగురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. తండ్రి కూడా ఆటోనడిపేవాడు. ఆయన సంపాదనకు తోడుగా ఉదయ్ కూడా ఆటోనే ఉపాధిమార్గంగా ఎంచుకున్నాడు. పదో తరగతి వరకు చదివిన ఉదయ్.. పై చదువులకు స్వస్తిచెప్పాడు. ఆటో నడపడానికి ముందు మూడేళ్లు మెకానిక షెడ్ లో పనిచేశాడు. కార్లు ఆటోలు వాష్ చేసేవాడు. ఒక్కో వాహనానికి రూపాయి చొప్పున తీసుకునేవాడు.

ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆటో నడుపుతూ సమాజ సేవ చేస్తున్న ఉదయ్ ని ఇంట్లోవాళ్లేం అభినందించలేదు. ఎందుకీ గాంధీగిరీ.. ఎవరిని ఉద్ధరించడానికి అంటూ తిట్టేవారు. తండ్రికి కొడుకు చేసే పని సుతరామూ ఇష్టం లేదు. పైగా ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే సంపాదన కొంచెమే కావడంతో కొడుకు స్కూల్ ఫీజు చెల్లించలేకపోయాడు. ఫలితంగా పిల్లాడు ఫెయిల్ అయ్యాడు. ఉదయ్ భాయ్ కి తల తీసేసినట్టయింది. ఆ రోజున తను చేసేది కరెక్టేనా అని పునరాలోచనలో పడ్డాడు.. ఫీజు మెల్లిగా కడతానని ఎలాగోలా ప్రిన్సిపల్ ని బతిమాలి మేనేజ్ చేశాడు. ఆ సమయంలో మదిలోకి వచ్చిన స్వార్ధచింతన కాసేపట్లోనే ఎగిరిపోయింది. మళ్లీ ఎప్పటిలాగే మనసుని గట్టిచేసుకున్నాడు. ప్రాణమున్నంత వరకు పక్కోడికి సాయం చేసే విషయంలో రాజీపడేదే లేదని అనుకున్నాడు

ఉదయ్ భార్య కూడా అతని మల్లే గుణవంతురాలు. భర్త చేసే పనిని ఏనాడూ ఆమె తప్పుపట్టలేదు. సరికదా ప్రోత్సహించింది. ప్యాసింజర్ల కోసం ధోక్లా, లస్సీ చేసి ఇస్తుంది. ఉదయ్ ని చూసి చాలామంది ఆటో డ్రైవర్లు మారిపోయారు.

ఒకసారి ఇలాగే ఒక పెద్దాయన ఆటో ఎక్కాడు. చివర్లో ఎన్వలప్ ఇస్తే దాన్ని ఎగాదిగా చూసి, పైసా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఉదయ్ భాయ్ ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆటో ముదుకు కదిలింది. ఇంతలో ఫోన్ మోగింది. చేసింది ఎవరో కాదు.. ఇందాక డబ్బులివ్వకుండా వెళ్లినతనే. అతనెంత నిర్దయగా ప్రవర్తించాడో ఫోన్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే రమ్మని పిలిచి డబ్బులిచ్చాడు. అది మరిచిపోలేని అనుభవం అంటాడు ఉదయ్.

మొదట్లో ఆటో కలర్ ఫుల్ గా ఉండటంతో- రేటు ఎక్కువేమో అని ఎవరూ ఎక్కేవారు కాదు. మెల్లిగా అతని కాన్సెప్ట్ ఏంటో జనానికి తెలిసింది. అప్పట్నుంచి ఉదయ్ భాయ్ ఆటో దొరికిందంటే ఎక్కడ లేని సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అంతెందుకు బిగ్ బీ అమితాబ్, చేతన్ భగవత్ అహ్మదాబాద్ వచ్చినప్పుడల్లా ఉదయ్ ని కలవకుండా వెళ్లరు. పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పడానికి స్కూళ్లు అతిథిగా పిలుస్తుంటాయి. మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి ఆంట్రప్రెన్యూర్ మీటింగులకి కూడా వెళ్తుంటాడు.  

Related Stories

Stories by team ys telugu