విరాళాల సేకరణ ఈజీ చేసిన ‘ఇంపాక్ట్ గురు’

విరాళాల సేకరణ ఈజీ చేసిన ‘ఇంపాక్ట్ గురు’

Monday November 09, 2015,

5 min Read

ఇంపాక్ట్ గురు.. క్రౌడ్ ఫండింగ్‌కు ఇంటర్నెట్‌ను జతచేసి విరాళాలు సేకరించే ప్రక్రియను సులభతరం చేసిన వేదిక. పియూష్ జైన్ అనే ఓ వ్యక్తి చేసిన వినూత్న ఆలోచన ఇది. ఇప్పుడిదే మనదేశంలోని ఎన్నో ఎన్జీవోలకు విరాళాలు సేకరించే ఖర్చును సగానికి సగం తగ్గించేసింది. ఇంటర్నెట్, సోషల్ మీడియా సాయంతో ఇంట్లో కూర్చున్న చోటు నుంచే లక్షల కొద్దీ నిధులు సమకూర్చిపెడుతోంది. ఇంతకీ ఎవరా పియూష్ జైన్ ? అతను రూపొందించిన ఇంపాక్ట్ గురు ఎలా పనిచేస్తుంది ?

image


పియూష్ జైన్.. అతనేమీ సాధారణ వ్యక్తి కాదు. వాల్ స్ట్రీట్, జేపీ మోర్గాన్ లాంటి పేరున్న సంస్థల సక్సెస్‌లో తనవంతు పాత్ర పోషించాడు. తనకున్న అనుభవం, తెలివితేటలతో ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించగలడు. అతనలా చేసి ఉంటే ఇప్పుడతని గురించి మనమిలా చర్చించుకునేవాళ్లం కాదు. సమాజ హితం కోసం తన నైపుణ్యాన్ని ఉపయోగించాలని అనుకున్నాడు. ఆ నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నది కాదు. 16 ఏళ్ల వయసులో లోనావాలాలోని ఓ అనాథాశ్రమానికి వెళ్లిన పియూష్.. అక్కడి వాళ్లను చూసి చలించిపోయాడు. 

‘అనాథాశ్రమంలోని పిల్లలను చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుడినో నాకు అర్థమైంది. నాకో కుటుంబం, ఇల్లు ఉంది. ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. చదువు పూర్తి కాగానే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా మారాను. వాల్ స్ట్రీట్ లాంటి గొప్ప సంస్థలో పనిచేశాను. కానీ నా నైపుణ్యం సమాజానికి ఎలాగోలా ఉపయోగపడాలన్నదే నా తపన’ అని ఇంపాక్ట్ గురు ఆలోచనకు బీజం ఎలా పడిందో వివరిస్తారు పియూష్. 

సామాజిక సంస్థలకు సులువైన రీతిలో ఆదాయం ఎలా సంపాదించిపెట్టవచ్చో అనే అంశంపై పరిశోధనలు చేశాడు. ఆ ఫలితాలను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పబ్లిష్ చేసింది. నిధుల సేకరణ కోసం అతను ముఖ్యంగా రెండు పద్ధతులను ఆవిష్కరించాడు. అందులో ఒకటి సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ కాగా.. రెండోది క్రౌడ్ ఫండింగ్. మొదటిదాన్ని భారత్ లాంటి దేశాల్లో అమలు చేయడం దాదాపు అసాధ్యమని భావించిన పియూష్ జైన్.. క్రౌడ్ ఫండింగ్ వైపు మొగ్గుచూపాడు.

image


ఐడియా సూపర్ హిట్

పియూష్ క్రౌడ్ ఫండింగ్ పద్ధతిని ఎంచుకోవడానికి మూడు కారణాలు ఉన్నాయి. సామాజిక, మత సంబంధమైన వాటి కోసం తోచిన సాయం చేయాలని అనుకునే భారతీయుల సంఖ్య దాదాపు 35 కోట్లు కావడం అందులో మొదటి కారణం. ఇది మొత్తం అమెరికా జనాభాతో సమానం. ఇక స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని ఈ మధ్య భారత్ లో ఇంటర్నెట్ వినియోగిస్తున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి మూడు నెలలకూ రెండు కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు కొత్తగా చేరుతున్నారని పియూష్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇవన్నీ గమనించిన పియూష్ కు.. ఇంటర్నెట్, సోషల్ మీడియా సాయంతో సామాజిక సంస్థలు విరాళాల సేకరణ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. దీనివల్ల ఆ సంస్థల నిర్వహణ ఖర్చు సగానికి సగం తగ్గిపోతుందని అనుకున్నాడు. 

‘క్రౌడ్ ఫండింగ్ మనదేశంలో కొన్ని దశాబ్దాలుగా ఉంది. కానీ దానిని సులువుగా, పూర్తిస్థాయిలో వినియోగించుకునే టెక్నాలజీ మన దగ్గర లేదు. నేను స్కూల్లో ఉన్న రోజుల్లో డొనేషన్ ఫామ్‌లను తీసుకొని ఇంటింటికీ తిరగడం గుర్తుంది. ఇప్పటికీ చాలా ఎన్జీఓలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. దీనివల్ల వాళ్ల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వాళ్లు సేకరించిన విరాళాల్లో 60 శాతం దీనికే ఖర్చయిపోతోంది. ఈ ఖర్చును తగ్గించుకోవడం వల్ల మరో మంచి పనికి వాటిని ఉపయోగించే వీలు కలుగుతుంది’ అని పియూష్ తన ఆలోచన వెనక ఉన్న ఉద్దేశాన్ని వెల్లడించాడు. అతని ఆలోచన నుంచి వచ్చిందే ఇంపాక్ట్ గురు. 

ఏడాది కిందట హార్వర్డ్ ఇన్నోవేషన్ ల్యాబ్‍‌లో డిజిటల్ క్రౌడ్ ఫండింగ్ ఆలోచన మొగ్గ తొడిగింది. దీనివల్ల వ్యక్తులు, సంస్థలకు విరాళాలు ఇవ్వడం, సేకరించడం చాలా సులువైంది. స్వచ్ఛంద సంస్థల ఖర్చు కూడా కేవలం 5 నుంచి 10 శాతానికి పరిమితమైంది. సరిగ్గా ఇంత మొత్తాన్నే ఇంపాక్ట్ గురు తమ సాయం కోరి వచ్చిన ఎన్జీఓల దగ్గర కమీషన్‌గా వసూలు చేస్తోంది.

సోషల్ మీడియా సాయం

ఇంపాక్ట్ గురు సక్సెస్ కావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే అంటాడు పియూష్ జైన్. ‘మన రోజువారీ జీవితాల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ప్రతి ఒక్కరి ఫేస్ బుక్ వాల్ ఒక డిజిటల్ రియల్ ఎస్టేట్ లాంటిదే. దీనిని సమాజ హితం కోసం వినియోగించాల్సిన అవసరం ఉంది’ అన్నది పియూష్ భావన. ఇలా నిధుల అవసరం ఉన్న కొన్ని వందల ఎన్జీవోల సమాచారం సేకరించి వారికి పూర్తి పారదర్శకంగా నిధుల సేకరణ చేయాలని సంకల్పించాడు పియూష్. కానీ అందులో 90 శాతం సంస్థలు అందుకు నిరాకరించాయి. ప్రస్తుతం 30 ఎన్జీవోలు ఇంపాక్ట్ గురు ద్వారా విరాళాలు సేకరిస్తున్నాయి. ఈ మధ్యే అధికారికంగా ఇంపాక్ట్ గురు వేదికను కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ దగ్గర రిజిస్టర్ చేసుకున్న సంస్థలకు రూ. 3 లక్షల వరకు విరాళాలు సేకరించి పెట్టింది. 

‘ఆన్ లైన్ ద్వారా ముక్కూ మొహం తెలియని ఎన్జీఓలకు విరాళాలు ఇవ్వాలంటే మన దేశంలో చాలా మంది ఇప్పటికీ వెనకడుగు వేస్తారు. నకిలీ ఎన్జీవోల భయమే ఇందుకు కారణం కావచ్చు. ఆ భయం తొలగించడానికే ఇంపాక్ట్ గురు తాము ప్రమోట్ చేస్తున్న ఎన్జీవోల గురించి పూర్తి పారదర్శక సమాచారం సేకరిస్తుంది. స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలను చాలా మంది ఇప్పటికీ నమ్మరు. అలాంటి వారు కూడా ఇంపాక్ట్ గురు బ్రాండ్‌ను వాడుకొని విరాళాలు సేకరించవచ్చు’ అని పియూష్ చెబుతున్నాడు. ఇంపాక్ట్ గురు మంచి ప్రభావం చూపిస్తుండటంతోపాటు లాభాలు కూడా తెచ్చిపెడుతుండటంతో ఇప్పుడిప్పుడే దానిపై నమ్మకం ఏర్పడుతోంది. విరాళాలు ఇచ్చిన వారు పన్ను మినహాయింపు పొందడానికి 80జీ సర్టిఫికెట్లను కూడా ఇంపాక్ట్ గురు జారీ చేస్తుండటం గమనార్హం. దీంతోపాటు విరాళాలు ఇవ్వడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను కూడా అందజేస్తోంది. పెద్దపెద్ద సంస్థలతోపాటు చిన్న ఎన్జీఓలు కూడా విరాళాలు సేకరించడానికి ఇంపాక్ట్ గురు సాయం చేస్తోంది. ‘స్కాలర్ షిప్‌లు ఆశించే విద్యార్థులు కూడా మా వేదికను ఉపయోగించుకునే వీలు కల్పించాం. ఇది కేవలం ఐదు నిమిషాల ప్రక్రియ. ప్రతిగా తమకు సాయం చేసే కార్పొరేట్ కంపెనీలకు కొంతకాలం పాటు ఉచితంగా ఇంటర్న్‌షిప్ చేయడానికి అంగీకరిస్తే చాలు. ఇలాంటి అవకాశాలు అనేకం ఉన్నాయి’ అని పియూష్ వివరించాడు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద కంపెనీలు ఇప్పటికే సొంతంగా ఫౌండేషన్లు స్థాపించుకున్నాయి. ఆ అవకాశం లేని చిన్న సంస్థలు ఇంపాక్ట్ గురు ద్వారా తమ బాధ్యతను నిర్వర్తించే అవకాశం ఉంది.

image


SMILEతో కొత్తగా...

సోషల్ మీడియాలో షేరింగ్‌కు కూడా ప్రతిఫలం ఇస్తున్న ఏకైక వేదిక ఇంపాక్ట్ గురు. చారిటీ ఫండ్ రైజర్‌ను ఫేస్ బుక్‌లో షేర్ చేస్తే ఒక్కోదానికి గరిష్ఠంగా రూ. వెయ్యి వరకు విరాళాలను కూడా అందజేస్తోంది. దీనికి ఆ సంస్థ పెట్టిన పేరు SMILE. దీనర్థం సోషల్ మీడియా ఇంపాక్ట్ లింక్డ్ ఎంగేజ్‌మెంట్. ‘మా వెబ్ సైట్‌ను వంద మంది విజిట్ చేస్తే అందులో కేవలం ఇద్దరు మాత్రమే విరాళాలు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. మిగతా విజిటర్లు కనీసం తమ ప్రచారాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహించాం. అందుకే పరిస్థితులను బట్టి ప్రతి ఫేస్ బుక్ షేర్ కూడా ఓ చిన్న విరాళంతో సమానంగా మేం భావిస్తున్నాం’ అని పియూష్ చెప్పాడు. దీనికి ఐస్ బకెట్ చాలెంజ్ నే ఉదాహరణగా చెబుతున్నాడతడు. ‘ఐస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ డొనేట్ చేయలేదు. కానీ ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియాలో వాళ్ల విలువైన సమయం కేటాయించారు. ఈ ప్రచారం వల్లే నెల రోజుల్లోనే 15 కోట్ల డాలర్ల విరాళాలు వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ ఆలోచన చేశాం. 500 షేర్లు, 20 విరాళాలు సేకరించడానికి దోహదపడే ప్రచారానికి మా వంతుగా డొనేట్ చేస్తాం. మా కమీషన్ ను పది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించుకుంటాం’ అని పియూష్ తెలిపారు. 


నిరుపేద పిల్లల విద్యా హక్కు కోసం పాటుపడే ఇండస్ యాక్షన్ అనే సంస్థ కోసం ఇంపాక్ట్ గురు ఈ ఏడాది సెప్టెంబర్ 19న నిర్వహించిన కార్యక్రమం.. సంస్థ ఇప్పటివరకు సాధించిన విజయాల్లో ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు. విరాళాలు సేకరించడానికి ముంబైలోని ఓ ప్రముఖ వేదికలో జరిగిన వైన్ అండ్ డైన్ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లను అమ్మారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు ప్రముఖ సోషల్ ఆంట్రప్రెన్యూర్స్ ను కలిసే అవకాశం కల్పించారు. దీనివల్ల సేకరించిన రూ.85 వేల విరాళాలతో 40 మంది నిరుపేద పిల్లలకు చదువుకొనే అద్రుష్టం దక్కింది. సమాజ హితం కోసం మీ వంతుగా ఎంతోకొంత సాయం చేయాలనుకుంటే ఇంపాక్ట్ గురు వెబ్ సైట్ కు వెళ్లండి.. మీకు నచ్చిన స్వచ్ఛంద సంస్థకు తోచిన విరాళం ఇవ్వండి. విరాళాల కోసం ఇబ్బంది పడుతున్న స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంపాక్ట్ గురు ద్వారా సులువుగా విరాళాలు సేకరించుకోవచ్చు.

website