నవ్వుతూ బతకడానికి నాగేశ్వరి వెబ్ సైట్..

పరుగు, పోటీ, వేగం, ఇదే జీవితమైపోయింది. మనిషికీ మనిషికీ మధ్య కనిపించని అడ్డుగోడలు వెలుస్తున్నాయి. సంపాదన మోజులో పడ్డ మనకి సాటి మనిషి కోసం ఒక నిముషం ఆగే ఓపిక లేదు. దీని వల్ల మన చుట్టూ వున్న వారిలోనే అనేక మానసిక రుగ్మతలు కనిపిస్తున్నాయి. డిప్రెషన్ సర్వసాధారణమైపోయింది. వదిలించుకోలేని వ్యసనాలు, జీవితాన్ని ఎదుర్కోలేక ఆత్మహత్యకు ఒడిగట్టడం జీవన విధానామైపోతోంది. 2020 కల్లా 20 శాతం మంది భారతీయులు ఏదో ఒక మానసిక రుగ్మతలతో బాధ పడతారని 2013లో డబ్ల్యు హెచ్ ఓ అంచనా.

నవ్వుతూ బతకడానికి నాగేశ్వరి వెబ్ సైట్..

Friday May 15, 2015,

2 min Read

మనకి ఆర్ధికంగా సమస్యలుంటే, అప్పుకోసం బ్యాంక్‌కి వెళ్తాం.. శరీరానికి ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్ దగ్గరకి వెళ్తాం. ఇలా ఏ సమస్య వున్నా దానికి పరిష్కారం కోసం ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకుంటాం కానీ, మానసిక సమస్యలంటే మాత్రం అదేదో బైటికి చెప్పుకోకూడనిది అనే భావం వుంటుంది. మనలో మనమే కుంగిపోతుంటాం. సరిగ్గా ఇలాంటి వాళ్ళకోసమే నాగేశ్వరి ఒక ఆన్ లైన్ పరిష్కారాన్ని కనుగొన్నారు. దానిపేరే nsmiles . మనసులో బాధలు బయటికి చెప్పుకోడానికి సంకోచించే వారికి ఈ nsmiles ఒక దారి చూపెడుతుంది.

నాగేశ్వరి, ఎన్ స్మైల్స్ వ్యవస్థాపకురాలు

నాగేశ్వరి, ఎన్ స్మైల్స్ వ్యవస్థాపకురాలు


బాధితులు తమ పేరు చెప్పకుండానే, ఈ వెబ్ సైట్ ద్వారా సహాయం పొందవచ్చు. అవసరమైతే, చికిత్సలు కూడా ఈ సైట్ సూచిస్తుంది. అవగాహన సదస్సులు, గ్రూప్ డిస్కషన్లు నిర్వహించి వీలైనంత మందికి మానసిక స్థైర్యం కల్పించడమే ఈ సైట్ లక్ష్యం.

టెస్టింగ్, ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చిన నాగేశ్వరికి మొబైల్ టెక్నాలజీ, నెట్‌వర్క్ టెస్టింగ్ అంటే సహజంగానే బాగా ఇష్టం. ఈ ఇష్టానికి మానసిక ఆరోగ్యంపై తనకున్న అభిరుచిని జోడించి nsmiles వెబ్ సైట్ ను, happybeing యాప్‌ను డెవలప్ చేసారు.

మనసు ఏది కోరుకుంటే, అధి సాధించొచ్చు.. అని నమ్మి బీయింగ్ హ్యాపీ యాప్‌ను డిజైన్ చేసాం. మన మనసు ఏ స్థితిలో వుందీ, ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దాని వల్ల అవసరం లేని విషయాలు ఆలోచించకుండా, డిప్రెషన్‌కు చోటివ్వకుండా, మనసును పాజిటివ్ అంశాలపైకి మళ్లించడానికి అవకాశం వుంటుంది. ఇందుకు మైండ్ టెక్నిక్, ధ్యానం, సంగీతం, పాతఫోటోలను చూస్తూ మధురస్మృతులను నెమరవేసుకోవడం లాంటివి ఉపకరిస్తాయి.

పాజిటివ్ మైండ్‌సెట్ చాలా అవసరం

మానసిక రుగ్మతలనేవి అవి ఉన్న వారినే కాదు.. వారి చుట్టూ వున్న వారిని కూడా బాధిస్తాయి. ‘‘ మా దగ్గర బంధువు ఒకాయనకి డిప్రెషన్ వుండేది. అతని డిప్రెషన్ వల్ల ఆ చుట్టు పక్కల అందరిలో ఓ రకమైన నిస్తేజం ఆవరించేది. నా మీద నాకే నమ్మకం పోయి, చాలా ఏళ్ళు ఆత్మన్యూనతతో బాధ పడ్డాను

ఈ ఆత్మన్యూనత నుంచి బయట పడ్డానికి నాగేశ్వరికి చాలా ఏళ్ళు పట్టింది. అప్పుడే ఆమెకు చుట్టూ వున్న మనుషుల ప్రభావం మన మీద ఎంతుంటుందో అర్ధమయ్యింది. మళ్లీ మామూలు మనిషి కావడానికి ఆమె సెల్ప్ హెల్ప్ క్లాసులకు వెళ్లాల్సొచ్చింది. ఈ క్లాసులతో పాటు కుటుంబ సభ్యుల మద్దతుతో ఆమె కోలుకోగలిగారు. తనలాంటి వాళ్ళు ఎందరో వుంటారన్న భావన ఆమెను ఈ వెబ్ సైట్ రూపొందించేలా పురిగొల్పాయి.

ఈ పని చాలా కష్టమైనదే..

మనం చాలా నిర్లక్ష్యం చేసే వాటిలో మానసిక ఆరోగ్యం ఒకటి. మరి అలాంటి విషయం మీద అవగాహన పెంచడం అంటే, కత్తి మీద సామే. ఈ అవగాహన పెంచడాన్నే ఒక జీవనోపాధిగా మార్చుకోవడం ఇంకా కష్టం. అందుకే ఈ సబ్జెక్ట్ మీద తానో వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నట్టు చెప్పినప్పుడే చాలా మందికి అర్థం కాలేదు.

‘‘ అసలు ఈ సబ్జెక్టు, దానికి కారణాలు వివరించడమే చాలా కష్టమైపోయింది. మానసిక ఆరోగ్యం, సంతోషకరమైన జీవన విధానం లాంటి అంశాలు అంతగా అర్థమయ్యేవి కావు’’

మామూలుగానే ఈ విషయాలు అర్థం కాకపోతే, ఇంక దీని మీద పెట్టుబడి పెట్టమంటే ఎవరు పెడతారు. అందుకే క్రౌడ్ ఫండింగ్ (తక్కువ మొత్తంలో ఎక్కువ మంది నుంచి నిధులు సేకరించడం) మార్గాన్ని ఎంచుకున్నారు. ఎలాగైనా తన వెబ్ సైట్ ద్వారా మానసిక ఆరోగ్యానికి సంబంధించి అవగాహన పెంచాలనేది నాగేశ్వరి క్రుతనిశ్చయం. వెబ్ సైట్ తో పాటు, మొబైల్ యాప్ కూడా బాగా సక్సెస్ అయింది. ఇప్పటికే లక్షా డెబ్భైవేల డౌన్ లోడ్లతో మంచి సమీక్షలతో ఈ యాప్ మంచి ఆదరణ పొందడం, నాగేశ్వరికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.

‘‘ఈ మార్గం చాలా కష్టమైనదే అయినా.. నా కుటుంబం అండ వల్ల, ఇది నా మనసుకు నచ్చిన పని కావడం వల్ల.. ఏ రోజు కారోజే నాకునేను ధైర్యం చెప్పుకుని ముందుకు సాగిపోతున్నను’’ అంటున్నారు నాగేశ్వరి.