ఇంట్లోనే ఆస్పత్రి తరహా వైద్యం.. 'కేర్ ఎట్ మై హోం' వాగ్దానం

హోమ్ కేర్ ఇండస్ట్రీలో కొత్త స్టార్టప్వ్యాపారవకాశాలపై ధీమాగా ఉన్న కేర్ ఎట్ మై హోంపదినెలల్లోనే 100కు పైగా రోగులకు సేవలుపెద్ద సవాళ్లను ఎదుర్కోడానికి సన్నద్ధం

ఇంట్లోనే ఆస్పత్రి తరహా వైద్యం.. 'కేర్ ఎట్ మై హోం' వాగ్దానం

Tuesday June 16, 2015,

4 min Read

భారతదేశంలో హోమ్ కేర్ పరిశ్రమ విలువ సుమారు 200 నుంచి 400 కోట్ల డాలర్లుంటుంది. పైగా ఇది ఏటా 25శాతం పెరుగుతోంది. 2025 నాటికల్లా 20 శాతం మంది భారతీయులు సీనియర్ సిటిజెన్స్ అవుతారు. వాళ్లలో 65 ఏళ్లు పైబడినవాళ్ళు 70శాతం మంది ఉంటారు. వీళ్ళకు జీవితంలో ఏదో ఒక సమయంలో దీర్ఘకాలం ఆరోగ్య సేవలు అవసరమవుతాయి. ఈ పరిశ్రమ చెల్లాచెదురుగా ఉండటం వలన ఇంతకుముందు కంటే ఇప్పుడు భారతదేశంలో దీనికొక రూపం కల్పించి మంచి ఆరోగ్యసేవలందించే వ్యవస్థ అవసరం ఎక్కువైంది. 2013 సెప్టెంబర్‌లో ప్రారంభమైన కేర్ ఎట్ మై హోమ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారికి ఇంటి దగ్గరే చాలా నమ్మకమైన, సమగ్రమైన వైద్యసేవలందిస్తుంది. వీలైనంతవరకు మళ్ళీ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా ఆస్పత్రినుంచి ఇంటికి మార్చటం, సాఫీగా సాగేలా సేవలు అందించటం దీని ప్రత్యేకత. ఈ సంస్థ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, నర్సింగ్, హెల్త్ అటెండెంట్ అవసరాలు కూడా చూసుకుంటుంది. ప్రస్తుతానికి కేర్ ఎట్ మై హోమ్ లక్ష్యం... ఇంటి దగ్గర ఉండే రోగులు, ఏదైనా సర్జరీ గాని, పెద్ద జబ్బుకు చికిత్సగాని చేయించుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారు, రోజువారీ పనులు చేసుకోలేని వృద్ధులకు సేవలందించటం. గడిచిన 10 నెలల కాలంలో వాళ్ళు వందమందికి పైగా క్లయింట్స్ కు వైద్యసేవలు అందించగలిగారు.

ముందస్తు పరిశోధన

ప్రస్తుతం బాగా నిర్లక్ష్యానికి గురవుతున్న రంగాలు రెండే రెండు.. ఒకటి హోమ్ కేర్ సర్వీసులైతే, మరొకటి విద్యారంగం. హోమ్ కేర్ రంగంలో ఉన్న ఈ ఖాళీని పూరించటానికి ENCHARGE ద్వారా ముందుగా ఒక అంచనా వేస్తుంది. ప్రస్తుతం వారు ఇంకా డిశ్చార్జ్ కాకుండా ఆస్పత్రుల్లో ఉన్న హై రిస్క్ పేషెంట్లమీద దృష్టిపెడుతున్నారు. శస్త్రచికిత్సల తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆస్పత్రి ఆవరణలోనే కొనసాగాల్సిన అవసరం లేనప్పుడు ఆ జాగ్రత్తలను పర్యవేక్షించగల రిహాబిలిటేషన్ సౌకర్యాల అవసరం భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. పైగా హోమ్ కేర్ సర్వీస్ అందించే విషయంలో భారతదేశంలో తగినంత పరిశోధనగాని, టెక్నాలజీగాని, శిక్షణ గాని కొరవడ్డాయి. ఒక రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారంటే కోలుకోవటంలో ఎదురయ్యే సమస్యలన్నిటినీ ఆ పేషెంట్, అతడి కుటుంబ సభ్యులే స్వయంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో హోమ్ కేర్ తీరుతెన్నులను, డిశ్చార్జ్ అయ్యాక పర్యవేక్షించే విధానాన్నీ ఆరు నెలలపాటు అధ్యయనం చేసిన తరువాత తేలిందేమంటే హై రిస్క్ కేసుల్లో సైతం మళ్ళీ ఆస్పత్రిలో చేరాల్సిన అవకాశం 20 శాతానికి పైగా తగ్గిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి విధానాలు పాటించటం ద్వారా కోట్లాది డాలర్లు ఆదా చేసుకోగలిగాయి.

ఈటీంలో

కేర్ ఎట్ మై హోమ్ అనేది ఇద్దరి కృషి ఫలితం. ఒకరు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ యువరాజ్ సింగ్ అయితే, మరొకరు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ నేపధ్యమున్న ప్రణవ్ షిర్కే. మెరుగైన హెల్త్ కేర్ సేవల కోసం పాటుపడే అంకితభావమున్న ఎంతో మంది వృత్తినిపుణులు ఈ సంస్థ కోసం సేవలందిస్తున్నారు. “మా బృందంలో అత్యంత ప్రతిభావంతులైన కేర్ మేనేజర్లు, ఫిజియోథెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, హెల్త్ అటెండెంట్లు ఉన్నారు. హోమ్‌కేర్ ఆవశ్యకతమీద వాళ్ళు శిక్షణ పొందారు” అని చెబుతున్నారు డాక్టర్ సింగ్.

కేర్ ఎట్ మై హోం టీం

కేర్ ఎట్ మై హోం టీం


ఈ పరిశ్రమలో నేర్చుకున్న పాఠాల గురించి అడిగితే, "ఇలాంటి కొత్తప్రాజెక్టు చేపట్టి ముందుకు నడపటం చాలా ఒత్తిడితో కూడుకున్న పని. అయినాసరే, ఉత్సాహంగానే ఉంది. ఇలాంటి జీవితాన్ని కోరుకునేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ముఖ్యమైన విషయమేంటంటే ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది'' అని చెబుతారాయన. కార్యరూపం దాల్చటానికి బాగా సమయం పడుతుంది కాబట్టి స్టార్టప్ అనేది చాలా ఓపికతో వేచి చూడాల్సి ఉంటోందన్నది షిర్కే అభిప్రాయం. “ఉన్న పరిస్థితుల్లో అనుకున్నవన్నీ సాధ్యం కావటం ఆచరణలో కష్టం. కో ఫౌండర్స్ గా మమ్మల్ని మేమే ఉత్సాహ పరచుకోక తప్పదు. కాకపోతే, అన్నిసార్లూ అది సాధ్యం కాకపోవచ్చు. “ అంటారు షిర్కే.

రూపకల్పన

కేర్ ఎట్ మై హోమ్ త్వరలోనే ఆస్పత్రులతో అనుసంధానం కావటం మొదలుపెట్టబోతోంది. ముంబైతో ఆ పని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులు ఈ పునరావాస అవసరాలను అర్థం చేసుకోవటానికి, కోలుకునే మార్గాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడే సరికొత్త మొబైల్ యాప్ కూడా వీళ్ళు రూపొందించారు. స్కూలు చదువులతోనే ఆపేసిన యువతులకు శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించటానికి కేర్ ఎట్ మై హోమ్ ఏర్పాట్లు చేసింది. సామాజికంగా, ఆర్థికంగా దిగువన ఉన్న ఇలాంటి యువతులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీళ్లకు మూడు నెలలపాటు గట్టి శిక్షణ ఇస్తారు. మానవ దేహ నిర్మాణం, పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్త, కమ్యూనికేషన్ తదితర అంశాలమీద ఈ శిక్షణ సాగుతుంది. అది పూర్తయిందంటే వాళ్ళు హెల్త్ అటెండెంట్లుగా మారతారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 20 విజయగాథల్ని చూసిన కేర్ ఎట్ మై హోమ్ ఇప్పుడు మూడో బాచ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.

ఇది కాకుండా 60 ఏళ్లు పైబడినవాళ్ళకోసం ఆరోగ్యం, ఫిట్నెస్, ఎక్సర్‌సైజ్ లాంటి విషయాలమీద ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.

image


స్ఫూర్తినిచ్చిన ఒక వ్యక్తిగత గాథ

అనారోగ్యంతో, వృద్ధాప్యంతో ఉన్న ప్రజలు కోలుకోవాలనే కోరికకు స్ఫూర్తి అంతా వ్యక్తిగత అనుభవాలనుంచి వచ్చినదే. డాక్టర్ సింగ్ మిత్రుడొకరు.. తండ్రిని కోల్పోయారు. ఛాతి నొప్పి తరువాత ముద్ద మింగటం కష్టమై పోయింది. దీంతో ట్యూబ్ ద్వారా ఆహారం పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటి దగ్గర ఆహారం ఎక్కించేటప్పుడు రోగిని కనీసం 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా లేపి ఉంచాలని ఆస్పత్రి వాళ్ళెవరూ చెప్పలేదు. దాంతో ఇంటిదగ్గర మామూలుగానే పడికోబెట్టి ఆహారం అందించారు. అలా ఆహారం కొంత ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి ఇన్ఫెక్షన్ కి దారితీసింది. ఆ సంగతి గుర్తు చేసుకుంటున్నప్పుడు డాక్టర్ సింగ్‌లో పట్టరాని కోపం కనిపిస్తుంది. డిశ్చార్జ్ చేసే పద్ధతి సరిగా లేకపోవటం వలన ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో, ఎలా ప్రాణాలు పోతున్నాయో చెప్పటానికి ఇదో ఉదాహరణ. 

ఇలాంటి ఘటనలే కేర్ ఎట్ మై హోమ్ స్థాపనకు దారితీశాయి. సర్జరీలు విజయవంతమైనప్పటికీ ఇంటికొచ్చిన తరువాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలియక ఆరోగ్యం క్షీణించి చనిపోతున్నారని తెలియటం షిర్కే ను ఈ దిశలో ప్రేరేపించింది. అందుకే ఆమె కేర్ ఎట్ మై హోమ్‌లో భాగస్వామి అయ్యారు.

ఓ పేషెంట్‌కు సంబంధంచిన ప్లాన్

ఓ పేషెంట్‌కు సంబంధంచిన ప్లాన్


పెద్ద సమస్యలతో పెద్ద సవాళ్ళు

డబ్బు వ్యవహారాలు చక్కబెట్టుకోవటం డాక్టర్ సింగ్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. ఖర్చులు తట్టుకోవటం కోసం మరో వైపు తన పార్ట్ టైమ్ ఫిజియోథెరపీ కూడా కొనసాగిస్తూనే వచ్చారాయన. భార్య తొలి ప్రసవానికి సిద్ధమవుతుండగా, మంచి ఉద్యోగాన్ని పక్కనబెట్టి ఈ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టటం నిజంగానే ఎంతో రిస్క్ తో కూడుకున్న పని. హెల్త్ కేర్ పరిశ్రమలో స్టార్టప్స్ మీద పెద్దగా అవగాహన లేకపోవటం కూడా ఒక సమస్యగా మారింది. అయితే, అవసరమే అన్ని అనుమానాలకూ సమాధానమైంది.

ఒకవైపు కేర్ ఎట్ మై హోమ్ వ్యవహారాలు చూసుకుంటూ, ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేస్తూ మా పాప అనీషాను కూడా చూసుకోవటం పెద్ద సవాలుగా మారిందంటారు డాక్టర్ సింగ్. మరో వైపు షిర్కే “ విశాల దృక్పథంతో ఆలోచిస్తూ ఒక్కో వ్యూహాత్మక ఆలోచన మధ్య ఊగిసలాడుతూ, చిన్న చిన్న అంశాలమీద కూడా అవసరమైన ప్రత్యేక దృష్టి మిస్సవకుండా వ్యూహాలు అమలుచేస్తూ వెళ్ళటం నిజంగా ఒక సవాలే. ఈ ప్రయాణం చాలా ఉత్సాహంగా కూడా ఉంది. మంచి జీతమొచ్చే ఉద్యోగం వదిలేసి నేను నమ్మినదాని కోసం రావటం నేను తీసుకున్న అతిపెద్ద రిస్క్. పైగా, ఆరోగ్యరంగం నాకెంతమాత్రమూ పరిచయం లేనిది. అంటే మొత్తంగా ఈ వ్యవస్థ గురించి చాలా ఎక్కువగా, తక్కువ సమయంలో నేర్చుకోవాల్సి వచ్చింది. స్ఫూర్తిదాయకమైన అనుభూతి అని ఒక్కమాటలో చెప్పటం బహుశా తక్కువచేసి చెప్పటమే అవుతుంది” అంటారు.

website