నాడు గుమస్తా..! నేడు లక్షాధికారి..!! 

మంచితనంతో మిలియనీర్ అయిన శ్యాంకుమార్

0

అదృష్టవంతుడిని ఎవరూ పాడుచేయలేరు.. దురదృష్టవంతుడిని ఎవరూ బాగుచేయలేరంటారు. ఈ కథలో శ్యామ్ కుమార్ మొదటికోవకు చెందినవాడు. ఒకప్పుడు ఒక్కపూట తిండికే నోచుకోలేదు. కాలం కలిసొచ్చి లక్షల రూపాయల ఇంటికి నడిచొచ్చాయి. దానికి ఒకే ఒక కారణం- విధేయత. మంచితనమే అతడిని మిలియనీర్ ని చేసింది. ఆ కథేంటో మీరే చదవండి.

2010 నాటి సంగతి. శ్యామ్ కుమార్ కు ఉద్యోగం లేదు. పేదరికం మూలంగా చదువుకోలేదు. తమ్ముడు ఒక సీనియర్ బ్యాంక్ ఉద్యోగి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మీ బాస్ ని అడిగి ఏదైనా ఉద్యోగం వుంటే చూడమని తమ్ముడిని అడిగాడు. అతను తన బాస్ కి పరిస్థితి వివరించాడు. ఆయన తన ఫ్రెండ్ సిట్రస్ పే ఫౌండర్ జితేంద్ర గుప్తాతో మాట్లాడాడు. మీ కంపెనీలో ఏదైనా గుమస్తా ఉద్యోగం ఉంటే చూడమని సిఫారసు చేశాడు. స్నేహితుడి మాట తీసిపారేయలేక, కుమార్ కి గుమస్తా ఉద్యోగం ఇచ్చాడు. నెలకు 8వేలు జీతం.

అవి ఈ కామర్స్ పుంజుకుంటున్న రోజులు. అదే టైంలో జితేంద్ర గుప్తా సిట్రస్ పే స్థాపించాడు. శ్యాంకుమార్ సంస్థలో చేరాడు కానీ, దాని కార్యకలాపాల గురించి అస్సలు తెలియదు. ఒకరోజు జితేంద్ర వివరించాలని చూశాడు. ఎంప్లాయ్ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ (ఈఎస్వోపీ) గురించి చెప్పి చూశాడు. ఈక్విటీ బేస్డ్ కంపన్సేషన్ ప్లాన్ గురించి ఎంత చెప్పినా శ్యాం కుమార్ బుర్రకు ఎక్కలేదు.

శ్యాం కుమార్ వుండేది ఒక చిన్న ఇరుకింట్లో. ముంబైలోని స్లమ్ ఏరియాలో ఇల్లు. అంత చిన్న ఇంట్లోనే పదిమంది దాకా ఉండేవారు. అమ్మానాన్న, భార్యాపిల్లలు, తమ్ముడి ఫ్యామిలీ.. ఇలా అంతమంది 10×10 రూంలోనే సర్దుకునేవాళ్లు.

కొన్నాళ్ల తర్వాత సిట్రస్ పే సంస్థకు కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి సిరీస్ ఆఫ్ ఫండింగ్ వచ్చింది. పెద్ద పెద్ద సంస్థలు క్లయింట్లయ్యాయి. అతి తక్కువ సమయంలోనే కంపెనీ లాభాల బాట పట్టింది. ఆ సమయంలోనే పేయూ అనే కంపెనీ 2016లో సిట్రస్ ను 130 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కంపెనీని అమ్మేసినందుకు లాభాల్లో ఉద్యోగులకు కొంత వాటా దక్కింది. అందులో భాగంగా శ్యామ్ కుమార్ కు రూ. 50లక్షలు ఇచ్చారు. కంపెనీలో పనిచేసినందుకు, విధేయుడిగా ఉన్నందుకు నీకు ఇంత సొమ్ము ఇస్తున్నాను అని జితేంద్ర అన్నప్పుడు.. శ్యాం కుమార్ కు నమ్మశక్యం కాలేదు. ఇదంతా కలా నిజమా అని గుడ్లు తేలేశాడు. ఇంట్లో వాళ్లు కూడా నమ్మలేదు. బ్యాంక్ అకౌంట్లో అక్షరాలా 50 లక్షలు చూసి షాకయ్యారు.

కేవలం వినయ విధేయతలే శ్యాం కుమార్ ని లక్షాధికారిని చేశాయి. ప్రస్తుతం సింగిల్ బెడ్రూం ఇంట్లో ఉంటున్న శ్యాం.. త్వరలో ముంబై శివార్లలో ఒక మంచి ఇల్లు కొనాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఫ్యామిలీతో కలిసి జాలీగా గోవా వెళ్లాలనుకుంటున్నాడు. హెల్త్ ఇన్ష్యూరెన్స్ కూడా చేయించాడు. చూశారుగా.. అదృష్టవంతుడిని ఎవరూ పాడుచేయలేరు.. దురదృష్టవంతుడిని ఎవరూ బాగుచేయలేరు. కాలం కలిసిరావాలంతే..

Related Stories

Stories by team ys telugu