స్కూల్ డిజిటలైజేషన్ కోసం స్పెషల్ యాప్ క్రియేట్ చేసిన పాలమూరు కుర్రాళ్లు

6

ప్రతి సమస్యకు నాలుగు పరిష్కారాలు ఉంటాయి. కానీ ఐదో సొల్యూషన్ చెప్పినోడే సంథింగ్ స్పెషల్. అలాంటి టాలెంట్ ఉన్న యువకులే ఈ ఆరుగురు. అందరిదీ తెలంగాణలోని మారుమూల ప్రాంతాలే. ముగ్గురు పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదివారు. మిగతా వారు ఇక్కడే బీటెక్ చేశారు. ఒకరి కింద పనిచేయడం ఇష్టంలేని వీళ్లు.. సొంతంగా కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగారు.

వీరు స్థాపించిన కంపెనీ పేరు ఫిఫ్త్ వే సొల్యూషన్స్. సీఈవో కెన్సారో వీవా. మణికంఠ, వంశీకృష్ణ, విజయ్ రెడ్డి, హర్ష, మురళి- కంపెనీ ఫౌండర్లుగా ఉన్నారు. సీఈవో కెన్సారో వీవాది గద్వాల జిల్లా ఐజ. మురళి, హర్ష, మణికంఠది కూడా గద్వాలే. విజయ్ రెడ్డిది షాద్ నగర్ దగ్గర కొత్తూరు. వంశీకృష్ణది సూర్యాపేట. తొలి ప్రయత్నంగా ఈ కంపెనీ తయారు చేసిన ఐ బోర్డ్ యాప్ స్కూల్ మేనేజ్మెంట్ కి చక్కగా ఉపయోగపడుతోంది.

ఇదివరకు అటెండెన్స్, ఫీజు, మార్కులు తదితర స్టూడెంట్ యాక్టివిటీస్ అన్నీ మాన్యువల్ గా చేసేవాళ్లు. అటెండెన్స్ తీసుకోవడానికి ఒక రిజిస్టర్ బుక్ ఉండేది. ప్రతిరోజూ విద్యార్థుల హాజరు నమోదు చేసుకొని తర్వాత దాన్ని పీసీలో అప్ లోడ్ చేసేవాళ్లు. ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్. కానీ ఐ బోర్డ్ యాప్ తో ఈ తంతంగమంతా ఉండదు. స్కూల్ మేనేజ్ మెంట్ ని పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. వీళ్లు తయారుచేసిన అప్లికేషన్ పేరేంట్స్, టీచర్స్, మేనేజ్ మెంట్ మధ్య వారధిగా పనిచేస్తుంది.

తల్లిదండ్రులు ఇంట్లో నుంచే పిల్లల స్కూల్ యాక్టివిటీని మానిటర్ చేయవచ్చు. ఏ టైమ్ కి కాలేజీకి వెళ్లారు, ఏయే క్లాసెస్ అటెండ్ అయ్యారు, ఏ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయో పేరెంట్స్ జస్ట్ ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు. కాలేజ్ కి బంక్ కొడితే ఇటు తల్లిదండ్రులకు అటు యాజమాన్యానికీ ఈజీగా తెలిసిపోతుంది. అటెండెన్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే పేరెంట్స్ కి మెసెజ్ వెళ్తుంది. అదే సమయంలో యాప్ లో స్టూడెంట్ అటెండెన్స్ అప్ డేట్ అవుతుంది. ప్రోగ్రెస్ కార్డులో మార్కుల్ని దిద్దుకున్నట్టు ఇందులో ఎడిట్ చేయడం కుదరదు. మార్కుల లిస్టు పక్కా ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంటుంది.

ఇకపోతే టీచర్లకు సంబంధించిన డొమెయిన్ లో టీచింగ్ మోడ్ అనే అప్లికేషన్ ఉంటుంది. టీచర్ క్లాస్ రూములోకి వెళ్లగానే ఆటోమేటిగ్గా మొబైల్ ఎయిరోప్లెయిన్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. టీచర్ క్లాస్ కి అటెండ్ అయినట్టు మేనేజ్ మెంట్ కి అలర్ట్ వెళ్తుంది. హాలీడేస్ వచ్చినా, ఫ్యాకల్టీ మీటింగ్స్ ఉన్నా.. ఆటోమేటిగ్గా పుష్ నోటిఫికేషన్స్ పంపుతుంది. అకాడమిక్ టైం టేబుల్, ఆన్ లైన్ ఫీజుల వివరాలు, స్టూడెంట్ ప్రొఫైల్, కాలేజీ ప్రొఫైల్ తదితర వివరాలన్నీ ఇందులో వుంటాయి.

విద్యార్థి దశలోనే కంపెనీ పెట్టిన వీరి ప్రతిభను పది మందీ ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఫిఫ్త్ వే సొల్యూషన్ ద్వారా ప్రజాసమస్యలకు పరిష్కారం కనుగొనడమే లక్ష్యమంటున్నాడు కంపెనీ సీఈవో కెన్సారో వీవా.

ఐ బోర్డ్ యాప్ తో అన్ని సర్కారీ స్కూళ్లను డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యం విజయ తీరాలకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Stories