పెళ్లి పనులన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చిన 'వెడ్ మంత్ర'

పెళ్లి పనులు చేసే వెండర్లందరినీ ఒకే వేదికపైకి...ఫ్లవర్ డిజైనర్ మొదలు హనీమూన్ ప్యాకేజ్ వరకూ...

పెళ్లి పనులన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చిన 'వెడ్ మంత్ర'

Thursday July 02, 2015,

4 min Read


ఒక ఇంట్లో త్వరలో పెళ్లి జరగబోతోందంటే ఇక వాళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. పెళ్లికి ఐదారు నెలల ముందే ఏదో తెలియని ఆదుర్దా అందరిలోనూ ఉంటుంది. బట్టల షాపింగ్, బంగారం, పెళ్లి కార్డులు, శుభలేఖల పంపిణీ.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో బాధ్యతలు. అన్నింటికంటే ముఖ్యం.. ఈ పెళ్లిని నలుగురూ నాలుగు కాలాల పాటు చెప్పుకునేలా చేయాలనే ఆశ ప్రతీ తల్లిదండ్రికీ ఉంటుంది. ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా అంతా సవ్యంగా సాగాలని పదే పదే ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ కొన్ని నెలల పాటు టెన్షన్‌ పడ్తారు. ఇప్పుడు అలాంటి కష్టాలు లేకుండా ఈవెంట్ మేనేజర్లు వచ్చేశారు. డబ్బు ఖర్చు చేస్తే కూర్చున్న చోటే ఒళ్లు అలవకుండా పనులను పూర్తి చేసేస్తారు. అయితే జీవితంలో ఒకేసారి జరిగే పెళ్లి వేడుకను అంత ఈజీగా ఒకరి చేతిలో పెట్టేయగలమా ? వెనుకా ముందూ చూడకుండా పనులన్నింటినీ ముక్కూ మొహం తెలియని వాళ్లకు అప్పగించలమా ? అయితే ఈ టెన్షన్ లేకుండా చేస్తామంటూ ముందుకొచ్చింది 'వెడ్‌మంత్ర' అనే సంస్థ.

image


దేశంలో ప్రతీ ఏటా కోటిన్నర పెళ్లిళ్లు జరుగుతాయని ఓ అంచనా. వీటిని లెక్కగడితే సుమారు 60 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.3.5 లక్షల కోట్లు) అవుతుంది. అంటే పెళ్లిళ్ల పేరిట ఏటా ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం మనకు తెలియకుండానే జరుగుతోంది. కానీ ఇంత పెద్ద మార్కెట్ అంతా అవ్యవస్థీకృతంగానే ఉంది. పారదర్శకత బాగా తక్కువ. సేవల్లో నాణ్యత ఎంత వరకూ ఉంటుందో మనం వాటిని వినియోగించుకునేంత వరకూ తెలియదు. జీవితంలో ఒకేసారి జరిగే పెళ్లివేడుకను గుడ్డిగా వేరేవాళ్లకు అప్పగించలేం. ఆన్‌లైన్‌లో చౌక బేరానికి సేవలు అందించే సంస్థలు ఎన్నో ఉన్నా వాటిని ఎంత వరకూ నమ్మగలం !

దీన్నే వ్యాపారావకాశంగా మలుచుకుంది వెడ్ మంత్ర సంస్థ. ఈవెంట్ మేనేజ్‌మెంట్లలో పన్నెండు సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న విష్ణువర్ధన్ ఇందూరి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్, సైమా అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్వహించిన అనుభవమే.. ధైర్యంగా ఈ సంస్థ రూపకల్పనకు నాంది పలికింది. సామాజిక సైట్లు జనాలకు పెద్దగా తెలియని రోజుల్లో భారత్ స్టూడెంట్ డాట్ కామ్ పేరుతో ఓ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ప్రారంభించి 2007 సమయంలో వార్తల్లో నిలిచారు విష్ణు. ఇక్కడి విద్యార్థులను విదేశాల్లో చదువుకునే వారితో అనుసంధానం చేసే వేదికగా అప్పట్లో భారత్ స్టూడెంట్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2008లో ఈ సంస్థను నార్త్ గేట్ టెక్నాలజీస్‌ కొనుగోలు చేసింది.

''మేం ఇప్పటి వరకూ ఎన్నో ఈవెంట్స్ చేశాం. దేశవిదేశాల్లో అత్యంత ఘనంగా కార్యక్రమాలను రూపకల్పన చేసి వాటిని అత్యద్భుతంగా సక్సెస్ చేశాం. వీటిని చూసిన కొంత మంది ఫ్రెండ్స్‌ నా సలహా కోరేవారు. పెళ్లిని కూడా అంత గ్రాండ్‌గా చేసివ్వమని అడిగేవారు. అప్పుడే నాకు ఇందులోని మార్కెట్ అవకాశాలు పూర్తిగా తెలిసొచ్చాయి. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఈ వెడ్ మంత్ర'' - విష్ణువర్ధన్

అయితే ఇతర ఈవెంట్ మేనేజర్లు, సైట్లలా కాకుండా ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 3500 మంది వెండార్స్‌ ఈ సైట్లో లిస్ట్ అయ్యారు. బట్టలు, గ్రూమింగ్, క్యాటరర్స్, డెకొరేటర్స్, ఎంటర్‌టైన్‌మెంట్, గిఫ్ట్స్, హోటల్స్, ఇన్విటేషన్స్, జ్యువెలరీ, ఫోటోగ్రఫీ, ట్రావెల్స్, పెళ్లి మండపాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు.. ఇలా పెళ్లికి అవసరమైన వివిధ విభాగాలన్నీ ఇక్కడ ఒకే చోట కొలువుదీరి ఉన్నాయి.

image


యల్లో పేజెస్‌లా కేవలం పేర్లను, ఫోన్ నెంబర్లను మాత్రమే ఇందులో ఇస్తే ప్రయోజనం లేదని గుర్తించారు. తమ దగ్గర డబ్బులు కట్టి లిస్టింగ్ చేసుకున్న వాళ్లను నేరుగా కలిసి వాళ్ల పనితీరును పూర్తిగా తెలుసుకుంటారు. అప్పుడే వెడ్ మంత్ర వెండార్లను సర్టిఫై చేస్తుంది. అయితే ఇదంతా లగ్జరీ క్లాస్ వాళ్లకు అనుకోవడానికి లేదు. మన బడ్జెట్‌ను బట్టి పనిచేసేందుకు వివిధ స్థాయిల వెండార్స్ అన్ని రంగాల్లో ఉన్నారు. 3 లక్షల నుంచి మూడు కోట్ల వరకూ పెళ్లి బడ్జెట్‌ అడిగిన వారు ఉన్నారని విష్ణు చెబ్తారు.

విష్ణువర్ధన్, బృందా ప్రసాద్ - వెడ్ మంత్ర వ్యవస్థాపకులు

విష్ణువర్ధన్, బృందా ప్రసాద్ - వెడ్ మంత్ర వ్యవస్థాపకులు


బిడ్డింగ్ ఇక్కడి ప్రత్యేకత

ఇక్కడ మనకో డెకొరేటరో లేకపోతే క్యాటరరో అవసరమనుకుందాం. మన బడ్జెట్ చెప్పి బిడ్డింగ్ పిలుస్తాం. అందుకు ఎంత మంది సిద్ధపడ్తారో వాళ్లు ఎంత బెస్ట్ ప్రైజ్‌కు ఆ సేవలు అందిస్తారో తెలియజేస్తూ బిడ్లు దాఖలు చేస్తారు. అందులోని బెస్ట్‌ డీల్‌ను పిక్ చేసుకుని మనం సదరు వెండార్‌లో సేవలు పొందొచ్చు. ఇలాంటి వినూత్న తరహా బిడ్డింగ్ ప్రక్రియ ఏ సైట్లోనూ లేదని, అదే తమ యుఎస్‌పి అంటారు విష్ణువర్ధన్. కంటెంట్ క్రియేటర్లు, వెడ్డింగ్ డైరెక్టరీల నుంచి పోటీ ఉన్నా తమకున్న ప్రత్యేకతలే కస్టమర్లను దగ్గరకు చేరుస్తున్నాయని చెబ్తారు. సీజన్‌తో సంబంధం లేకుండా రోజుకు కనీసం 5 నుంచి 10 ఎంక్వైరీలు వస్తూ ఉంటాయని వివరించారు.

ఒక ఫంక్షన్‌కు సుమారు ఎంత ఖర్చువుతుందో  లెక్కేసి చెప్పే బడ్జెటర్

ఒక ఫంక్షన్‌కు సుమారు ఎంత ఖర్చువుతుందో లెక్కేసి చెప్పే బడ్జెటర్


''సైమా, సిసిఎల్ వంటి కార్యక్రమాలు నిర్వాహణ సమయంలో వందల మంది వెండర్స్‌తో నిత్యం సంప్రదింపులు జరపాల్సి వచ్చేది. ఎవరు ఎందులో నిష్ణాతులో మాకు తెలిసేది. పెద్ద ఈవెంట్స్ కావడం వల్ల పెద్ద సంఖ్యలో వెండార్స్ పనికోసం మా దగ్గరకు వచ్చేవారు. వాళ్లతో తరచూ బేరమాడి పనులు చేయించుకోవడంతో మాకు విశేషమైన అనుభవం ఈ రంగంలో దక్కింది'' - విష్ణు

రెవెన్యూ మోడల్

రెండేళ్లుగా నడుస్తున్న వెడ్‌మంత్రపై ఇప్పటి వరకూ రూ.3 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టినట్టు ప్రమోటర్లు చెబ్తున్నారు. అవన్నీ అంతర్గత నిధుల నుంచే సమీకరించుకున్నారు. వెండార్స్ లిస్టింగ్‌ కోసం ఫీజ్ కలెక్ట్ చేస్తారు. పెళ్లి బడ్జెట్‌ను బట్టి కస్టమర్‌ నుంచి 5 శాతం వరకూ ఫిక్స్‌డ్ ఫీజ్‌ను తీసుకుంటారు.

భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం హైదరాబాద్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరించిన వెడ్‌మంత్ర ఏడాదిన్నరలో 50 నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఉంది. మూడేళ్లలో దేశవ్యాప్తంగా 100 నగరాలకు తమ సేవలను అందించాలని చూస్తోంది. విస్తరణకు అవసరమైన నిధులను సమీకరించేందుకు దశలవారీగా సంప్రదింపులు జరపుతామని వెల్లడించింది. సినీస్టార్లతో తరచూ కార్యక్రమాలు చేయడం వల్ల తమకు బ్రాండ్ ఎంబాసిడర్ సమస్య ఉండబోదని, అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ దిశగా ఆలోచిస్తామని ముగించారు విష్ణువర్ధన్.