10 లక్షల స్కూళ్లు... కోటి మంది టీచర్లు.. భారీ లక్ష్యం.. ఇతడి జీవితాశయం

10 లక్షల స్కూళ్లు... కోటి మంది టీచర్లు..
భారీ లక్ష్యం.. ఇతడి జీవితాశయం

Tuesday February 02, 2016,

4 min Read

''నా జీవితాశయం ఒక్కటే. 2060 నాటికి భారత దేశంలోని ప్రతీ విద్యార్థీ నాణ్యమైన విద్య అందాలి. ఆ ఆశయమే నన్ను నడిపిస్తోంది, నేను ఈ భూమిపై ఉండేందుకు కారణం కూడా అదే అనిపిస్తుంది. నాణ్యమైన విద్యను అందుకునేందుకు ప్రతీ ఒక్కరికీ అవకాశాన్ని కల్పించడం ద్వారానే ఇది సాకారమవుతుంది. ఉపాధ్యాయులకు పిల్లలకు కేవలం చదువు చెప్పించడం కాదు.. వాళ్లకు అనేక విషయాలు నేర్పించాలి. వాళ్లు స్వతహాగానే చదువుకునేలా తీర్చిదిద్దాలి. స్కూల్ లీడర్లు పిల్లలకు ప్రత్యేకమైన బాటను పరచాలి. తల్లిదండ్రులు ముందుకు వచ్చి పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధం కావాలి. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బంతా పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, వాళ్లు విలువలు నేర్చుకునేందుకు దోహదపడేలా ఉండాలి''.

ఇదీ భానూరి మధుకర్ లక్ష్యం, విజన్ స్టేట్‌మెంట్.

image


అతనికి ఉన్న స్పష్టత వల్లే ఏడేళ్లుగా ఒక్కో అడుగు వేసుకుంటూ లక్ష్యానికి దగ్గరవుతున్నారు. 29 ఏళ్ల మధుకర్ బిట్స్ పిలానీలో చదువుకున్నారు, ఆ తర్వాత ఎల్ అండ్ టిలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆర్థిక సంతృప్తే కానీ.. ఆత్మ సంతృప్తి లేదని అర్థం చేసుకుని ఉద్యోగాన్ని వదిలేసి టీచ్ ఫర్ ఇండియాలో చేరి ఫెలోషిప్ పూర్తయ్యాక అక్కడే ప్రోగ్రాం మేనేజర్‌గా చేరారు. 2015-16 బ్యాచ్‌లో ఆక్యుమెన్ ఫెలో కూడా.

ప్రస్తుతం పుణె సిటీ కనెక్ట్ (పిసిసి) విద్యావిభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో విద్యావ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విభాగమే ఈ పిసిసి. మధుకర్ ఆలోచనలకు దగ్గరకు ఉండడంతో పాటు మార్పునకు శ్రీకారం చుట్టేందుకు పిసిసిని ఎంచుకున్నారు.

జీవితం మారింది

2009లో ఎల్ అండ్ టి ముంబైలో ట్రైనీ ఇంజనీర్‌గా చేరారు మధుకర్. ఆ సమయంలో చూసిన ఓ యాడ్ అతని జీవితాన్ని మార్చేసింది. మార్పు కోరుకునే భారతీయ యువకులకు ఆహ్వానమంటూ ఆ యాడ్ చూసిన అతను.. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అందులోకి దూకేశాడు.

image


జీవితం ఒక్కసారిగా మారిపోయింది

ఎయిర్ మైల్స్ కౌంట్ చేసుకోవడం, సేల్స్ మీటింగ్స్, మార్జిన్స్, ప్రాఫిట్స్ నెంబర్ల నుంచి పిల్లలకు కథల చెప్పాల్సి వచ్చింది. ఏరోప్లేన్స్, జామెట్రీ, పిట్టకథలు చెబ్తూ ఉన్న జీవితాన్ని అతడు ఏనాడూ ఊహించి ఉండడు. అప్పుడే అతనిలో చాలా మార్పు కనిపించింది. ఆ ప్రయాణంలో అతనిలోని వ్యక్తిత్వాన్ని మరింత తీర్చిదిద్దింది.

కార్పొరేట్ కంపెనీల నుంచి కాలనీలో కరెంట్ కూడా లేని పాఠశాలల్లో విద్యాభోధన చేయడమనే జీవితానికి మారడం అంత సులభం కాదు. అన్నింటికంటే ముఖ్యంగా అతని కుటుంబాన్ని సమాధానపరచడం చాలా కష్టమైంది. వాళ్లు మొదట్లో అతడి నిర్ణయాన్ని ఏ మాత్రం స్వాగతించలేదు.

తాను తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం తప్పుకాదని అతనికి అప్పుడే అనిపించింది.

''ఎలాంటి బెరుకూ లేకుండా నలుగురి ముందు నిలుచుని సుప్రియా రెండు లైన్లు మాట్లాడడం, గుట్కా మానేసిన జుబెయిర్‌ను చూసినప్పుడు, వీక్లీ టెస్టుల్లో 90 శాతానికి తగ్గకుండా మార్కులు తెచ్చుకుంటున్న శశాంక్ ఆత్మస్థైర్యం గుర్తొచ్చినప్పుడు, తండ్రి చనిపోయిన మూడో రోజే బడికి వచ్చి తన స్కాలర్షిప్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న శివానీని చూసినప్పుడు.. తన కష్టమంతా మరిచిపోతానని, ఆ మాటకు వస్తే తాను పడింది అసలు కష్టమేకాదంటారు మధుకర్.

రెండేళ్లలో ఇలాంటి ఎన్నో గాధలు తనలో ఊహించని మార్పును తీసుకువచ్చాయని చెబ్తారు.

విద్యారంగంలో మరింత నేర్చుకునేందుకే అతను టిఎఫ్ఐలో ఉండిపోయారు. ఆ సమయంలోనే పుణెలోని కొంత మంది టీచర్లు, విద్యార్థి సంఘాలు, ప్రభుత్వంతో కలిసిపనిచేశాడు.

image


ఇప్పుడేంటి ?

టిఎఫ్ఐలో శిక్షణ తర్వాత విద్యారంగంలో ఉన్న స్టాటిస్టిక్స్ కంపెనీలో చేరారు. అక్కడుంటే తన లక్ష్యం నెరవేరదని తక్కువ కాలంలో తెలుసుకున్నాడు. వెంటనే పుణె సిటీ కనెక్ట్-పిసిసి (పూర్వం దీన్ని పుణె యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేవారు)లో చేరారు. నగరంలో ఉన్న వివిధ సంస్థల భాగస్వామ్యంతో నడిచే వ్యవస్థ ఇది.

ప్రభుత్వ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని భావించే కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యవస్థలతో కలిసి పనిచేయడం పిసిసిలో మధుకర్ బాధ్యత. ప్రభుత్వంలోని వివిధ అధికారులతో కలిసి పనిచేయడంలో కూడా, ఎన్జీఓలకు అవసరమైన శిక్షణ వంటి బాధ్యతలను కూడా నిర్వర్తిస్తారు మధుకర్. వీళ్లందరి లక్ష్యం ఒక్కటే పూణెలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యానాణ్యతను పెంచడం, అక్కడి విద్యార్థులను తీర్చిదిద్దడం.

ప్రభుత్వం ఏం చేస్తోంది ?

ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నదానికంటే ఎంతో మెరుగ్గా చేసేందుకు అవకాశం ఉంది. ప్రతీ పిల్లాడు స్కూళ్లలో చేరి విద్యను అభ్యసించాలంటే అందుకు రాజకీయ నాయకుల మద్దతు కూడా ఎంతో అవసరం. విద్యా వ్యవస్థ, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మధ్య ఎప్పుడూ మనస్పర్ధలు ఉండడాన్ని నేను ఏడాది కాలంలో గమనించాను. నాయకత్వ మార్పు వల్ల పెద్దగా మార్పు ఉండదు. నాయకులతో పాటు బలమైన వ్యూహాలు, సృజనాత్మకత సిబ్బంది సలహాలు ఉన్నప్పుడే క్షేత్రస్థాయిలో మార్పు కనిపిస్తుందనేది నా భావన.

మహారాష్ట్రలో పది నెలల పాటు గడపడం ఎంతో అనుభవాన్ని ఇచ్చిందని మధుకర్ చెబ్తారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యాశాఖతో కలిసి స్కూళ్లలో నాణ్యతను పెంచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్న విధానాన్ని గుర్తుచేసుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధానాలు... కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పాలసీలను ప్రతిబింబిస్తాయి. అందుకే రాజకీయ జోక్యం, మతబేధాలు, ఆర్థిక వ్యవస్థతో సంబంధంలేని బలమైన విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు.

image


సవాళ్లు

ఇప్పటికీ విద్యారంగంలో ఉన్నతికి చాలా సంస్థలు పనిచేస్తున్నా వాటి ప్రయోజనం మాత్రం పెద్దగా కనిపించడంలేదు. ''పుణెలో నాలుగైదు సంస్థలు టీచర్ ట్రైనింగ్ పై పనిచేస్తున్నాయి. తక్కువ ఆదాయం వస్తున్న ఓ ప్రైవేట్‌ స్కూలుతో కలిసి మూడు సంస్థలు పనిచేస్తున్నాయి. వాటిలో నలుగురు ప్రోగ్రాం మేనేజర్లు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఏ ఒక్కరి మధ్య సమన్వయం లేదు. ఎవరు ఏం చేస్తున్నారో అవతలి వాళ్లకు తెలియదు. దీని వల్ల అటు పాఠశాలకు, ఇటు విద్యార్థులకు ఎవరికీ ప్రయోజనం లేకుండా పోతోంది అంటారు మధుకర్.

ప్రాధమిక విద్య నుంచి పదో తరగతి వరకూ ప్రతీ విద్యార్థి నాణ్యమైన విద్యను అందుకునేందుకు ఓ మార్గం ఉండాలి, అదే తక్షణ సవాలుగా భావిస్తున్నట్టు చెబ్తారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ స్థితిని అధిగమించాలంటే కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు మధుకర్.

ప్రభుత్వ - ప్రైవేట్ స్కూళ్ల మధ్య తేడా గురించి మాట్లాడుతూ.. వివిధ వ్యవస్థలకు తగ్గట్టు రెండు రకాల స్కూళ్లూ ఉండాల్సిన అవసరం ఉందని మధుకర్ అంటారు. ప్రభుత్వం మొదట ప్రణాళికను రూపొందించి ఆ తర్వాత సౌకర్యాల కల్పనపై దృష్టికేంద్రీకరించాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. అలా కాకుండా ప్రైవేట్ స్కూళ్లను నిందించడం సరికాదు. గత రెండు దశాబ్దాలుగా దేశంలో అక్షరాస్యత పెరగడంతో ప్రైవేట్ స్కూళ్లు కీలకపాత్ర పోషించాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే వాళ్లను కూడా విధాన రూపకల్పనలో భాగం చేయాలి.

image


లక్ష్యం చేరుకోగలమా ?

నా జీవిత గమనాన్ని మార్చుకున్న తర్వాత, ఏడేళ్లుగా లక్ష్యం కోసం తపిస్తున్నా. నా జీవితాశయాన్ని చేరుకోవడానికి ఎలాంటి మార్పులు అవసరమో తెలుసుకుంటూనే ఉన్నాను.

సుదీర్ఘమైన లక్ష్యాలను ఏర్పర్చుకున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే విషయాన్ని మధకుర్ ఎప్పుడో గుర్తించారు. ''గమ్యం మరింత కఠినంగా మారినప్పుడు నేను నా కుటుంబంపైనే ఆధారపడతాను. నా బలమంతా మా శ్రీమతే. మా నాన్నే నా హీరో అంటూ ముగించారు మధుకర్.

మధుకర్ భానూరికి సుదీర్ఘమైన లక్ష్యాలు, బలమైన ఆకాంక్ష ఉందని మనకు అర్థమవుతోంది. కేవలం కలలు మాత్రమే కనేవాళ్లకూ.. వాటిని సాకారం చేసుకోవాలని తపన పడే వాళ్లకూ ఇదే తేడా. అతని జీవితాశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం.

విష్ హిమ్ ఆల్ ది బెస్ట్.