డిస్కౌంట్ ఆఫర్లతో ఊపేస్తున్న వూపీ

డిస్కౌంట్ ఆఫర్లతో ఊపేస్తున్న వూపీ

Monday July 20, 2015,

3 min Read

డిస్కౌంట్ల సమాచారం అందించే యాప్.

మొబైల్ లో యాప్ ఉంటే డిస్కౌంట్ మీకే.

కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్న మొబైల్ యాప్.

షాపింగ్‌కు వెళ్తే ఏ కస్టమర్ అయినా ముందుగా అడిగేది డిస్కౌంట్ ఉందా అని. ఇలా డిస్కౌంట్ల గురించి ఎన్ని షాపులని తిరుగుతాం. ఎంతమందినని అడుగుతాం. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా ఓ యాప్‌ను రూపొందించారు ఇద్దరు యువకులు. అదే whoopiee. అసలు డిస్కౌంట్ ఎక్కడుందో ముందుగానే తెలుసుకొని నేరుగా అక్కడికే వెళ్లేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అసలు ఈ యాప్ పుట్టుపూర్వోత్తరాలంటే చూద్దాం రండి.

యెల్లో పేజెస్ ఫర్ ఆఫర్స్

హర్సిమర్బీర్ సింగ్... డ్యూక్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. స్టార్టప్స్‌తో మాయాజాలం చేయడంలో ఇతనికి ఉన్న అనుభవం అంతా ఇంతా కాదు. అప్పటికే రెండు స్టార్టప్స్‌ని సక్సెస్ బాటలో నడిపించిన సత్తా ఉంది. ఫాస్ట్‌ఫుడ్ ఔట్‌లెట్ ను ఎక్కడ ప్రారంభిస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు లొకేషన్ బేల్డ్ ఆల్గారిథమ్‌ను డెవలప్ చేసి ప్రశంసలు పొందాడు. అప్పుడే ఓ విషయం అర్థమైంది. హోటల్ ఫుడ్ తినే కస్టమర్లు డిస్కౌంట్లు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ ఉంటారని తెలుసుకున్నాడు.

"ఆన్ లైన్ లావాదేవీలు చేసేవాళ్లకు ఓ సమస్య ఉంటుంది. 20-30 రూపాయల డిస్కౌంట్ కోసం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయాల్సి వచ్చేది. క్రెడిట్ కార్డు లేని వారికి డిస్కౌంట్లు వచ్చేవి కావు. కానీ డిస్కౌంట్లు ఎవరికైనా ఒకేలా ఉండాలి అన్నది నా ఆలోచన. అప్పుడే ఆఫర్ల కోసం యెల్లో పేజెస్ లాంటిది తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఐడియా వచ్చింది" అంటారు whoopiee యాప్ సృష్టికర్త హర్సిమర్బీర్ సింగ్.

ఐడియా వచ్చిన వెంటనే తన స్నేహితుడు గౌరవ్ బగ్గాతో కలిసి వూపీ టెక్నాలజీస్‌కు రిబ్బన్ కట్ చేశారు. టెక్నాలజీ వ్యవహారాలను గౌరవ్ చూసుకునేవాడు. తమ నగరంలో లభించే ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి కావాల్సిన సమాచారాన్ని అందించేలా whoopiee యాప్‌ను రూపొందించడం మొదలుపెట్టారు. దేశరాజధానికి చెందిన పదకొండు మంది సభ్యులు ఏడాది పాటు కృషిచేసి యాప్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. లుధియానాలోని 20 రెస్టారెంట్ల ఆఫర్లు, డిస్కౌంట్లతో జూన్ 2013లో ప్రారంభమైంది whoopiee యాప్. తొలి ఏడాదిలోనే 20 వేల డౌన్ లోడ్స్ జరిగాయి. ఇప్పటి వరకూ 90వేలకు పైగా డౌన్‌లోడ్స్ అయినట్టు కంపెనీ చెబ్తోంది.

image


మొబైల్‌లో యాప్ ఉంటే డిస్కౌంట్

ఏ స్టార్టప్ కైనా ఒక దశకు చేరుకునేసరికి పెట్టుబడులు చాలా అవసరం. ఈ స్టార్టప్‌కు ఢిల్లీకి చెందిన వ్యాపారి నుంచి పెట్టుబడులు లభించాయి. ఆర్థిక ప్రోత్సాహం లభించిన తర్వాత వేర్వేరు పద్ధతుల్లో మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టారు.

"యాప్ ప్రారంభించిన తొలినాళ్లలో నిర్వహణ చాలా కష్టంగా ఉండేది. డిసెంబర్ వరకు మాకు కేవలం నాలుగు వేల డౌన్ లోడ్స్ మాత్రమే జరిగాయి. ఆ తర్వాత మేము ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో మార్కెటింగ్ చేశాం. జనవరి నాటికి కాస్త పుంజుకుంది" అంటారు హర్సిమర్బీర్.

ఆ తర్వాత ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, గుర్గావ్, నొయిడా, చండీగఢ్, పంచ్‌కులా, మొహాలీ తదితర ప్రాంతాలకు విస్తరించింది. వూపీ యాప్ ద్వారా రెస్టారెంట్స్, జిమ్స్, సెలూన్స్, స్పా, మిగతా ఆన్ లైన్ ఆఫర్స్ వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 1500 మందికి పైగా పార్ట్‌నర్లతో ఐదు వేలకు పైగా ఆఫర్లను అందిస్తోంది ఈ యాప్. ఆఫర్ కావాలనుకున్న కస్టమర్లు వూపీ యాప్‌ను సంబంధిత స్టోర్ లో చూపిస్తే చాలు డిస్కౌంట్ లభిస్తుంది. అంతకుముందైతే డిస్కౌంట్ కూపన్లు తీసుకెళ్లాల్సి ఉండేది. లేదా ఇ-మెయిల్ ప్రింట్ ఔట్, ఎస్ఎంఎస్ లు చూపిస్తే తప్ప ఆఫర్లు లభించేవి కావు. అలాంటివేమీ లేకుండా ఆఫర్ పొందే అవకాశం కల్పిస్తోంది. మొదటి వర్షన్ చాలా మామూలుగా ఉండేదని హర్సిమర్బీర్ ఇప్పటికీ అంగీకరిస్తారు. కానీ ఆ తర్వాతే చాలా మార్పులు చేసి యాప్‌ను తీర్చిదిద్దారు. ఇప్పటికీ ఈ యాప్ డిజైన్ లో మరింత మార్పు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్ డౌన్ లోడ్స్ సంఖ్య లక్ష దాటింది. ప్రతీ రోజూ 350కి పైగా డౌన్ లోడ్స్ జరుగుతున్నాయి.

ఏ బిజినెస్ కైనా కాంపిటీషన్ మామూలే. వూపీకి కూడా Hoppr, DelighCircle, Groupon లాంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఉంది. CouponRani, Coupon Dunia లాంటివి ఆన్ లైన్ రీటైలర్స్ తో పార్ట్ నర్ షిప్ కుదుర్చుకున్నాయి. శ్రీజన్ క్యాపిటల్ ఫౌండర్ అయిన రవి త్రివేది కూపన్ రాణికి ఇన్వెస్ట్ చేశారు. "ఆన్ లైన్ లో లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఈ సంస్థలు లాభాల బాట పడుతుంటాయి. అంతే కాదు... వేగంగా ఎదుగుతాయి కూడా. ఆన్ లైన్, ఆఫ్ లైన్ వ్యాపారులకు కస్టమర్లను ఆకర్షించడం చాలా ముఖ్యం. ఈ సంస్థలు అందుకు కావాల్సిన సహకారాన్ని అందిస్తుంటాయి" అంటారు రవి త్రివేది.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే Coupons.com, Retailmenot లాంటి సంస్థలకు మంచి డిమాండ్ ఉంది. ఈ సంస్థలు ఏటేటా వంద మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం పొందుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. వూపీ కూడా అదే టార్గెట్ తో విస్తరిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో విస్తరించిన వూపీ... మరిన్ని నగరాల్లో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకు కావాల్సిన నిధులు సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.