కంటిచూపు లేకపోయినా సంకల్ప బలంతో జీవితాన్ని గెలిచిన అమ్మాయి కథ  

0

బ్రహ్మ తనకు తోచినట్టుగా అందరి తలరాత రాస్తాడు. ఆ రాతను మనకు నచ్చినట్టుగా రాసుకోవడమే అసలైన సంకల్పం. విధిని ధిక్కరించి నిలబడితే, దిక్కులు పిక్కటిల్లేలా గెలుపు పిలుపు వినిపిస్తుంది. అలాంటి పిలుపుని అందిపుచ్చుకుని చరిత్ర తిరగరాసిన అమ్మాయి కథ ఇది.

పరిధి వర్మకు చాలా అరుదైన వ్యాధి సంక్రమించింది. మాక్యులర్ డిజనరేషన్. అంటే మచ్చల క్షీణత. క్రమంగా చూపుకోల్పోడం దాని లక్షణం. అలాగని పూర్తి అంధత్వం కాదు. పదిశాతం కనిపిస్తుంది. 90 శాతం మసకగా ఉంటుంది. చుట్టూ విజన్ ఉంటుంది.. మధ్యలో అంతా బ్లర్. ప్రతీ ఏడు లక్షల మందిలో ఒకరికి వచ్చే రేర్ డిసీజ్.

ఐదో క్లాస్ వరకు చదువులో ముందుండేది. క్రమంగా వెనుకబడిపోయింది. కారణం అర్ధం కాలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. కంటి సమస్య మూలంగా సరిగా చదవలేకపోతోందని చెప్పారు. కళ్లజోడు వాడమని సలహా ఇచ్చారు. కానీ అవి ఉపయోగపడలేదు. తర్వాత చాలా టెస్టులు చేశారు. ఫైనల్ గా మాక్యులర్ డిసీజ్ అని తేలింది.

అమ్మానాన్నల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక్కగానొక్క కూతురికి ఇలా అయిందేంటని నిద్రలేని రాత్రులు గడిపారు. ఇక ఆమె భవిష్యత్ అంధకారమేనా అని ఆవేదన చెందారు. కానీ పరిధి వర్మ తల్లిదండ్రులకే ధైర్యం చెప్పింది. ఆమె మనోసంకల్పం ముందు విధిరాత చిన్నబోయింది.

అలా ఒక్కో కష్టాన్ని అధిగమిస్తూ ఐసీజీ జైపూర్ నుంచి బీబీఏ చేసింది. మాస్ కమ్యూనికేష్స్ నుంచి డిప్లొమా కూడా పూర్తి చేసింది. మొదట్లో సివిల్స్ కి సాధించాలని భావించింది. కానీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (క్యాట్)కి ప్రిపేర్ చేయమని స్నేహితులు సలహా ఇవ్వడంతో ఆ ఆలోచన విరమించుకుంది.

అలా రెండున్నర నెలల్లోనే క్యాట్ లో ర్యాంక్ సాధించింది. తర్వాత ఐఐఎం లక్నోలో సీటు. ఫైనల్ ఇయర్ లో ఉండగానే క్యాంపస్ సెలెక్షన్ జరిగింది. ఒక పేరున్న మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ పరిధి వర్మను సెలెక్ట్ చేసింది. కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ గా ఆఫర్ వచ్చింది. టాప్ బిజినెస్ స్కూల్ నుంచి అత్యంత పిన్న వయసులో పేరున్న సంస్థలో ఉద్యోగ అవకాశం సంపాదించిన ఘనత సొంతం చేసుకుంది.

మొదట్లో చదవడం రాయడం ఇబ్బందిగా ఉండేది. ప్రిపరేషన్ టైంలో పేరెంట్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. అది ఇంకా బాధించింది. అయినా అధైర్యపడలేదు. ఫ్రెండ్స్ సపోర్టుగా నిలిచారు. సీనియర్ల మద్దతు దొరికింది. అలా ఒక్కో ఛాలెంజ్ ని అధిగమించింది.

సాధారణంగా ఎవరి ఎగ్జామ్స్ వాళ్లే రాస్తారు. ఎవరి భవిష్యత్ వాళ్ల చేతుల్లోనే ఉంది. కానీ పరిధి వర్మ విషయంలో అలా జరగేలేదు. ఆమె చదివిన చదువుకి ఎగ్జామ్ వేరేవాళ్లు రాశారు. ఎంత కష్టపడి చదవినా, రాసేవాళ్ల చేతుల్లో ఫ్యూచర్ ఉండటం ఆమెను కొంచెం కలవరపెట్టింది. లక్కీ ఏంటంటే.. ఆమెకు తోడుగా నిలిచిన వాళ్లంతా శ్రేయోభిలాషుకే కావడం.

చదువు ఒక్కటే కాదు. చూపులేకపోయినా ఆటపాటల్లోనూ పరిధి వర్మ ముందుంది. అండర్ 18 ఫుట్ బాల్ జట్టులో ప్లేయర్. ఛాంపియన్ కూడా. కాలేజీ రోజుల్లో గిటార్ నేర్చుకుంది. కొన్ని లైవ్ కన్సర్ట్స్ కూడా ఇచ్చింది. కాలేజీ ఫెస్టివల్లో జరిగిన ర్యాంప్ వాక్ లో తళుక్కున మెరిసింది. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఫైనల్ ఇయర్లో రాజస్థాన్ ప్రభుత్వం ఆమెకు విమెన్ ఆఫ్ ద ఫ్యూచర్ అవార్డు అందజేసింది. డాటర్స్ డే నాడు నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్ధి చేతుల మీదుగా ఆమె తల్లిదండ్రులు అవార్డు అందుకున్నారు.  

Related Stories