బ్యాంకింగ్ రంగాన్ని శాసిస్తున్న పవర్‌ఫుల్‌ లేడీస్

-బ్యాంకర్లుగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన భారతీయ వనితలు-ప్రతిష్టాత్మక బ్యాంకుల్లో కీలక స్థానాల్లో మహిళా మణులు-తమకెవరూ సాటిరారనేలా విస్తృత సేవలందిస్తున్న మగువలు -ఎన్నో అవార్డులు, మరెన్నో అత్యుత్తమ పురస్కారాలు

బ్యాంకింగ్ రంగాన్ని శాసిస్తున్న పవర్‌ఫుల్‌ లేడీస్

Wednesday July 22, 2015,

6 min Read

సంసారం సవ్యంగా సాగాలంటే అందులో ఆడవారి పాత్రే ఎక్కువ. ఒక్కరూపాయి ఖర్చు పెట్టాలన్నా.. అదే రూపాయిని పొదుపు చేయాలన్నా.. అది మగువకు తెలిసినంతగా మగవారికి తెలీదు. అందుకే పొదుపుమంత్రం, బడ్జెట్ తంత్రం, కుటుంబ నిర్వహణ బాధ్యతల్ని భారతీయ స్త్రీలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఇవే సూత్రాలను వ్యాపార నిర్వహణలోనూ పాటిస్తున్నారు. అలా బ్యాంకర్లుగా మగవారికంటే మేటిగా...అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు మన భారతీయ వనితలు. ఇంతకీ వాళ్లెవరు..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే....


అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ చైర్ పర్సన్

(ఫోటోలో... అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ చైర్ పర్సన్  )

(ఫోటోలో... అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ చైర్ పర్సన్ )


అరుంధతి భట్టాచార్య దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గా వున్న భారతీయ స్టేట్ బ్యాంక్ కి తొలి మహిళా చైర్ పర్సన్. 1977 లో అరుంధతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ప్రొబిషనరీ ఆఫీసర్ (PO) గా చేరారు. ఆ తర్వాత ఎన్నో కీలకమైన స్థాయిలను అందుకున్నారు. బ్యాంక్ తో ఆమెకు 36 ఏళ్ల సుదీర్ఘ అనుబంధముంది. ఎస్బీఐలో ప్రధాన కార్యదర్శిగా, వ్యాపార బ్యాంకింగ్ విభాగం, ఎస్బీఐ పెట్టుబడుల వ్యాపారం లాంటి ఎన్నో కీలక బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించారామె. చీఫ్ జనరల్ మేనేజర్ గా వుంటూ ఎన్నో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. న్యూయార్క్ లోని కార్యాలయంలోనూ తన సేవలందించారామె. ఎస్బీఐ సాధారణ బీమా, ఎస్బీఐ నిర్బంధ సేవలు, ఎస్బీఐ మౌలిక సదుపాయాల నిధలు లాంటి ఎన్నో కొత్త వ్యాపారాలను ప్రారంభించారు. చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ గా, ప్రధాన ఆర్థిక అధికారిగా పనిచేశారు.


చందా కొచ్చర్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో.. ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్

(ఫోటోలో... చందా కొచ్చర్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో.. ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ )

(ఫోటోలో... చందా కొచ్చర్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో.. ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ )


భారతదేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ గా, ప్రైవేట్ రంగంలోనే పెద్ద బ్యాంక్ గా వున్న ఐసీఐసీఐ గ్రూప్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చందా కొచ్చర్. రిటైల్ బ్యాంకింగ్ కు కొత్త రూపునివ్వడంలో చందా కొచ్చర్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ గుర్తింపును సంపాదించారు. ఆమె నాయకత్వంలో ఐసీఐసీఐ గ్రూప్ ఎన్నో విజయశిఖరాలను అధిరోహించింది. చందా కొచ్చర్ తన వృత్తి జీవితాన్ని 1984 ఐసీఐసీఐ బ్యాంక్ తో ప్రారంభించారు. 2001 లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరుగా వున్నారు. 1990 దశకంలో ఐసీఐసీఐ బ్యాంక్ ను సంస్థాగతంగా విస్తరించడంలో ప్రముఖ పాత్ర పోషించారామె. అప్పుడే ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ వ్యాపారంలో ఐసీఐసీఐ బ్యాంక్ అడుగుపెట్టింది. 2000 ఏడాదిలో నూతనంగా రిటైల్ వ్యాపారాన్ని సవాల్ గా తీసుకుని అభివృద్ది సాధించారు. సాంకేతిక పరిజ్ఞానం, కొత్త పద్ధతులు, యాంత్రికంగా మార్పులు, విస్తరణ, విభజన లాంటి అధునాతన అంశాలు, పద్ధతులపై ప్రధాన దృష్టి పెట్టారు. దీంతో ఇతర బ్యాంకులకంటే మెరుగైన సేవలన్ని ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు అందించగలిగింది. ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ లోనే ఉత్తమమైన నాయకత్వ ప్రతిభను కనబరిచింది. 2006-2007 సంవత్సరాల మధ్య కాలంలో భారతీయ కంపెనీల సహకారంతో కార్పొరేట్ , బ్యాంకింగ్ రంగంలో విజయవంతంగా అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. 2007 నుంచి 2009 సంయుక్త నిర్వాహక సంచాలకురాలిగా( జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ) మరియు ప్రధాన ఆర్థిక అధికారిగా ఆమె కీలక పదవీ బాధ్యతలను నిర్వహించారు. అంతర్జాతీయంగా వేగవంతమైన ఆర్థిక సంస్కరణలు సంతరించుకుంటున్న క్లిష్టతరమైన సమయంలో సమర్థవంతంగా బ్యాంక్ ను విజయతీరాలకు చేర్చారామె. 2009 లో ఐసీఐసీఐ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈవోగా బాధ్యతలు తీసుకుని వైవిధ్యమైన కార్యకలాపాలతో ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయంగా మంచి పేరును తెచ్చుకున్నారు. కంపెనీ బోర్డ్స్ లోనూ కీలక స్థానంలో వుంటూ బ్యాంక్ ప్రధాన సహాయకురాలిగా పనిచేశారు. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ లో దేశీయంగా ప్రధానమైన సాధారణ , జీవిత బీమా కంపెనీలను నెలకొల్పారు. ఐసీఐసీఐ గ్రూప్ లోనే కాకుండా... చందా కొచ్చర్ అదనంగా ... ప్రధానమంత్రి మండలిలో.. వర్తకం మరియు పరిశ్రమలు, వర్తక మండలి, ఆర్థిక మౌలిక సదుపాయాల అత్యున్నత స్థాయి కమిటీ , యూఎస్-ఇండియా సీఈవో ఫోరమ్, యూకే –ఇండియా సీఈవో ఫోరమ్ లలో సభ్యురాలిగా వున్నారు. భారత పరిశోధన, అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల మండలి, జాతీయ వ్యాపార భద్రతా సంస్థ, అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్యసంబంధ సమ్మేళన సంస్థలోనూ సభ్యురాలిగా వున్నారు. ప్రపంచ ఆర్థిక పౌర సభ సహాధ్యక్షురాలిగా 2011 లో వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అదే ఏడాది భారత పౌరులకు లభించే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన ‘పద్మభూషణ్’ కూడా ఆమెను వరించింది.


నైనా లాల్ కిద్వాయ్ , HSBC ఇండియా గ్రూప్ జనరల్ మేనేజర్

( ఫోటోలో...నైనా లాల్ కిద్వాయ్ , హెచ్ఎస్బీసీ  ఇండియా గ్రూప్ జనరల్ మేనేజర్ & ప్రధానాధికారి)

( ఫోటోలో...నైనా లాల్ కిద్వాయ్ , హెచ్ఎస్బీసీ ఇండియా గ్రూప్ జనరల్ మేనేజర్ & ప్రధానాధికారి)


నైనా లాల్ కిద్వానీ హెచ్ఎస్బీసీ (HSBC) భారతదేశ విభాగానికి ప్రధానాధికారిగా వున్నారు. బోర్డ్ లోనూ ప్రధాన సంచాలక అధికారిగా వున్నారామె. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ చేసిన నైనా లాల్ కిద్వానీ నాయకత్వ విషయంలో దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ కూడా వ్యాపారానికి సంబంధించి ఎన్నో అవార్డులను, గుర్తింపును సంపాదించుకున్నారు. అంతర్జాతీయ దిగ్గజ వ్యాపారవేత్తల జాబితాలో ఉన్నత స్థానాన్ని ఎప్పుడూ ఆక్రమిస్తూ వుంటారామె. 2002 లో అంతర్జాతీయంగా ప్రభావశీలురైన 15 మంది మహిళా వ్యాపార, ఆర్థిక వేత్తల జాబితాను వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ విడుదల చేసింది. అందులోనూ టైమ్స్ మేగజైన్ జాబితాలోనూ ఉత్తమమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారామె. నైనా లాల్ కిద్వాయ్ వర్తక, వాణిజ్య పరిశ్రమల విభాగంలో అందించిన సేవలు, భాగస్వామ్యానికి గానూ భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారాన్నీ అందుకున్నారు. లండన్ లోని భారత సలహా సంఘంలోనూ, అంతర్జాతీయ సలహాదారుగానూ, హార్వర్డ బిజినెస్ స్కూల్ లో భారతదేశ సలహా సంఘం బోర్డ్ అధ్యక్షురాలిగానూ వున్నారు. నైనా కిద్వాయ్ చిన్న మొత్తాల పొదుపుపై వున్న ఆసక్తి తో గ్రామీణ మహిళలకు ఎంతో తోడ్పాటునందించారు. ఫిక్కీ (FICCI) అధ్యక్షురాలిగా కూడా పనిచేసిన అనుభవం ఆమె సొంతం.


రేణు సూద్ కర్నాడ్, HDFC మేనేజింగ్ డైరెక్టర్

(ఫోటోలో ... రేణు సూద్ కర్నాడ్, హెచ్డీఎఫ్సీ (HDFC) మేనేజింగ్ డైరెక్టర్ )

(ఫోటోలో ... రేణు సూద్ కర్నాడ్, హెచ్డీఎఫ్సీ (HDFC) మేనేజింగ్ డైరెక్టర్ )


హెచ్డ్ఎఫ్సీ (HDFC) బ్యాక్ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నారు రేణుసూద్ కర్నాడ్ . ఆమె న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ పట్టాను ముంబై యూనివర్సిటీ నుంచి పొందారు. అర్థ శాస్త్రంలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. పర్విన్ ఫెలో- వుడ్ రో విల్సన్ స్కూల్ అంతర్జాతీయ వ్యవహారాలను అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ లో చేశారు. 1978 నుంచి కార్పొరేషన్ లో ఉద్యోగిగా పనిచేశారామె. 2000 ఏడాదిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, 2007లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. జనవరి 1, 2010 నుంచి కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టగా పనిచేసిన రేణు సూద్ కర్నాడ్... అందులో కీలక వ్యవహారాలు, మానవ వనరులు, సమాచార సంబంధ కార్యకలాపాల్లో చురుగ్గా బాధ్యతలు నిర్వర్తించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ లో అత్యుత్తమ 10 మంది మహిళల్లో ఆసియా నుంచి స్థానం (ర్యాంక్) పొంది భారతీయుల సత్తా చాటారు రేణు సూద్ కర్నాడ్.


శిఖా శర్మ, యాక్సిస్ బ్యాంక్ సీఈవో, ఎండి

(ఫోటోలో... శిఖా శర్మ,  యాక్సిస్ బ్యాంక్ సీఈవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ )

(ఫోటోలో... శిఖా శర్మ, యాక్సిస్ బ్యాంక్ సీఈవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ )


శిఖా శర్మ 2009 నుంచి యాక్సిస్ బ్యాంక్(Axis Bank) మేనేజింగ్ డైరెక్టర్ గా, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐసీఐసీఐ గ్రూప్ లో ప్రాజెక్ట్ ఫైనాన్స్, రిటైల్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ ఇలా... వివిధ స్థాయిల్లో ఉద్యోగ ప్రస్థానాన్ని ఆరంభించారు శిఖా శర్మ. చివరగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా, సీఈవో గా పనిచేశారు. ఇది దేశంలోనే ప్రైవేట్ సెక్టార్ లో ఉత్తమమైన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా పేరు తెచ్చుకుంది. నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడంలో మంచి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్నారు శిఖా శర్మ. ఆమె బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో అందించిన సేవలకు గానూ 2012 లో ‘ ట్రాన్స్ ఫర్మేషనల్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్’ పేరుతో ఏఐఎమ్ఏ(AIMA) మేనేజింగ్ ఇండియా అవార్డ్ ను అందుకున్నారు. అదే ఏడాది బ్లూమ్ బెర్గ్-యూటీవీ ఫైనాన్షియల్ లీడర్ షిప్ అవార్డ్, 2012 బిజినెస్ వరల్డ్స్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. 2012 ఫోర్బ్స్ ఆసియాకు చెందిన 50 మంది శక్తివంతమైన మహిళా వ్యాపార వేత్తల్లో ఒకరుగా స్థానం పొందారు. అదే ఏడాది ఇండియన్ ఎక్స్ ప్రెస్ అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలోనూ.. 2012 ఇండియా టుడే ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన 25 మంది మహిళల్లోనూ ఒకరుగా నిలిచారు.


శుభలక్ష్మి పన్సే, అలహాబాద్ బ్యాంక్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్

(ఫోటోలో... శుభలక్ష్మి పన్సే, అలహాబాద్ బ్యాంక్ చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్)

(ఫోటోలో... శుభలక్ష్మి పన్సే, అలహాబాద్ బ్యాంక్ చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్)


శుభలక్ష్మీ పన్సే 2012 జనవరి లో అలహాబాద్ బ్యాంక్ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు విజయా బ్యాంక్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా 2009 నుంచి పనిచేశారామె.

పరిపాలనా వ్యవహారాలు, వ్యాపారాభివృద్ధికి చెందిన పలు స్థాయిల్లో బ్యాంక్ బాధ్యతలు, కార్యకలాపాలను నిర్వహించారు శుభలక్ష్మి. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో ప్రొబషనరీ అధికారిగా 1976 లో ఉద్యోగంలో చేరి తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారామె. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర లో... క్రెడిట్ మేనేజ్ మెంట్, రికవరీ, ట్రెజరీ మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఇలా రకరకాల స్థాయిల్లో , పలు ప్రాంతాల వారీగా వైవిధ్యమైన శిక్షణ ఇవ్వడంలో మంచి పేరును, అనుభవాన్ని సంపాదించారు శుభలక్ష్మి. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా, పుదిచ్చేరి ఇలా దక్షిణాది పరిధిలో బ్యాంక్ ప్రధానాధికారిగా పనిచేశారామె. పుణే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్ మెంట్.. ఎన్ఐబీఎమ్(NIBM), హైదరాబాద్ లోని ఆస్కీ అండ్ జేఎన్ఐడీబీఐ(ASCII & JNIDBI), గుర్ గావ్ ఎమ్డీఐ(MDI), ముంబైలోని బీటీసీ & ఆర్బీఐ (BTC&RBI) , లండన్, యూకే, ప్యారిస్ అండ్ ఫ్రాన్స్ లలో యూరోపియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్ , బాస్లే, స్విట్జర్లాండ్.. బహ్రేన్ ఎంఈఎఫ్టీఈసీ (MEFTEC) ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో బ్యాంకింగ్ కు సంబంధించిన కోర్సుల్లో శిక్షణనిచ్చారు శుభలక్ష్మి పన్సే.

ఆమె బ్యాంకింగ్ రంగానికి అందించిన సేవలకు 2000 లో పుణె మున్సిపల్ కార్పొరేషన్ అభినందించింది. ముంబై విసిటెక్స్ ఫౌండేషన్స్ (Wisitex Foundation’s) నుంచి 2005 బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును, బ్యాంకింగ్ రంగంలో ఐటీ సేవలను విస్తృతం చేసినందుకు గాను 2008 మే లో ఒడిశా ప్రభుత్వం నుంచి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డ్ ను అందుకున్నారు. దీన్ని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చేతుల మీదుగా తీసుకున్నారు శుభలక్ష్మి పన్నే. బ్యాంకింగ్ లో ఐటీ సేవల భాగస్వామ్యానికి సంబంధించి పుణె ఎంఈఎస్ సొసైటీ(MES Society) 2008 జూన్ లో నారీ చేతన అవార్డును పొందారు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో విశేష సేవలందించింనందుకు 2011 ఏడాదిన సూర్యదత్త జాతీయ పురస్కారాన్ని పొందారు. శుభలక్ష్మి మార్కెట్ కు అనుగుణమైన పరిపాలన, నాయకత్వ లక్షణాలతో తన బృందాన్ని బలోపేతం చేస్తూ అత్యుత్తమ బ్యాంకర్ గా ఎదిగారు.

ఇప్పుడు చెప్పండి.. వంటింట్లో గరిటె తిప్పుతూ సంసార భారాన్ని మోయడంలోనే కాదు.. ఆర్థిక రంగంలో తమ పదునైన వ్యూహాలతో అద్భుతమైన బ్యాంకర్లుగానూ మన దేశ మగువలు ఎదిగారని ఒప్పుకుంటారా... లేదా..? కచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే....