హర్ ఏక్ మాల్ అడ్డా.. హైదరాబాద్ నుమాయిష్!!  

వాణిజ్య స్వావలంబనకు పట్టుగొమ్మలా నాంపల్లి ఎగ్జిబిషన్

0

ఏటా 45 రోజులపాటు పలకరించే అతిపెద్ద అంగడి.. హైదరాబాద్ నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మొదలైంది. 77వ ఏట అడుగు పెట్టిన నుమాయిష్ ను మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల కోసం స్టాల్ హోల్డర్లు స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి తోడు పలు బ్యాంకులకు చెందిన ఏటీఎంలను కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు.

గత యేడాది దాదాపు 20 లక్షలకు పై చిలుకు సందర్శకులు వచ్చారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య పెరిగే అవకాశముంది. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలు, అంతర్గత భద్రత కోసం సెక్యూరిటీ గార్డులు, వలంటీర్లు, వాచ్ అండ్ వార్డ్ సిబ్బంది, మెటల్ డిటెక్టర్‌లు, హ్యాండ్ డిటెక్టర్‌లతో తనిఖీలు చేపడుతున్నారు.

ఈసారి పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎగ్జిబిషన్ మైదానం పరిసర ప్రాంతాలలో ఉన్న పలు హౌజింగ్ బోర్డు భవన సముదాయాలలో ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఏ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ స్థలం ఖాళీగా ఉందని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ను సిద్దం చేశారు. సందర్శకులకు మంచినీటి వసతిని కల్పించడంతో పాటు మోడరన్ టాయిలెట్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.

దేశం నలుమూలల నుంచి వచ్చే కళాకారుల పనితనం నుమాయిష్‌ లో కనిపిస్తుంది. కాశ్మీరీల హస్తకళలు, రాజస్థానీ హాండ్ వర్క్స్, ఉత్తర్ ప్రదేశ్ అత్తరు వంటివి ఎగ్జిబిషన్‌ లో ప్రతీసారి హైలైట్ గా నిలుస్తాయి. ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌, బట్టలూ , బొమ్మలూ, పింగాణీ వస్తువుల , ప్లాస్టిక్ సామాను, కట్లరీ ఐటెమ్స్, ఫర్నిచర్, లాడ్ బజారుని మరిపించే గాజులు- ఇలా ఒకటేమిటి. బ్యాగుల దగ్గర్నుంచి బైకుల వరకు. రకరకాల మెటీరియల్స్. ఎన్నడూ చూడనివి.. ఎప్పుడూ వాడనివి.. మన మనసుకు తగ్గట్టుగా.. మన పర్సుకు తగ్గట్టుగా ఉంటాయి. కొనకపోయినా ఫరవాలేదు. కొత్త డిజైన్లు చూడ్డానికైనా వెళ్లాలి. చిన్నపిల్లల కోసమైనా పోయిరావాలి.

పిల్లలకోసం బోలెడన్ని రైడ్స్. టోరటోర, రంగుల రాట్నం, హెలికాప్టర్, రోలింగ్ కప్ సాసర్, రోలింగ్ టవర్, ఫ్రిజ్బీ, రేంజర్‌ పాటు మోటారు బైకులపై విన్యాసాలు, సర్కస్ ఫీట్లు- ఇలా చూసినా కొద్దీ భలే ముచ్చటేస్తుంది. భూమ్మీద నడిచే రైలైతే వండర్. ఎన్నిసార్లు ఆగి ఆగి చూస్తామో!

నుమాయిష్! ఒక్కమాటలో చెప్పాలంటే జాతీయ సమైక్యతకు చిహ్నం. జనవరి ఒకటో తేదీ ప్రపంచానికి ఆంగ్ల సంవత్సరాది. కానీ, హైదరాబాదుకు మాత్రం అది అచ్చంగా నుమాయిషే. ఏమీ కొనకపోయినా, ఓ 500 నోటు విడిపిస్తే చాలు. అదో తృప్తి. 46 రోజులపాటు సాగే వేడుక. 77 ఏళ్లుగా హైదరాబాదీలతో అనుబంధాన్ని పెనవేసుకున్న అపురూపమైన అంగడి. ఏడాదికోసారి వచ్చే ఆనందాల సింగిడి.

పారిశ్రామిక ప్రగతికి తోడ్పడిన నుమాయిష్ ఏటికేడు ప్రతిష్టను పెంచుకుంటూ మున్ముందుకు సాగుతోంది. అంతర్జాతీయస్థాయి ఖ్యాతిని ఆర్జించిన ఈ ఎగ్జిబిషన్ వాణిజ్య స్వావలంబనకు పట్టుగొమ్మలా నిలిచింది. దేశానికే గర్వకారణమైన హైదరాబాద్ నుమాయిష్.. ఏటా ఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ కి దీటుగా ఎదుగుతోందనడంలో సందేహం లేదు. 

Related Stories