దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ఎస్సై

దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ఎస్సై

Monday April 03, 2017,

1 min Read

ప్రీతిక యాషిని. తమిళనాట ఈ పేరొక సంచలనం. మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ఎస్సైగా చరిత్ర సృష్టించిన ప్రీతిక.. ఖాకీ డ్రెస్సు వెనుక రాజీలేని పోరాటం ఉంది. ఏ సమాజమైతే ఆడామగా కాదని వెక్కిరించిందో.. అదే సమాజాన్ని ధిక్కరించి, ఖబడ్దార్ అని కరకు గొంతుతో హెచ్చరించింది. ఆమెతో పాటు మరో 21 మంది థర్డ్ జెండర్స్ పోలీస్ శాఖలోని వివిధ పోస్టుల్లో చేరారు.

ఇటీవలే థర్డ్ జెండర్ కమ్యూనిటీకి చెందిన వాళ్లంతా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు స్వీకరించారు. అందులో 25 ఏళ్ల ప్రీతిక ఒక్కరే ఎస్సైగా చార్జ్ తీసుకుని, తమిళనాట చరిత్ర సృష్టించారు.

image


దేహం చూస్తే మగ, మనసు చూస్తే ఆడ. అంతులేని మానసిక సంఘర్షణ. ఏం చేయాలో అర్ధంకాని స్థితి. ఆ సమస్య నుంచి బయటపడేందుకు 2011లో పూర్తిగా లింగమార్పిడి చేయించుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రీతికకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంటర్వ్యూకి వెళ్లిన ప్రతీచోటా అవహేళన చేశారు. అవమానపరిచారు. కొన్ని సందర్భాల్లో బయటకి గెంటేశారు. ఒకదశలో పూర్తిగా నైరాశ్యం కమ్మేసింది. ఈ లోకంలో తనలాంటి వాళ్లు బతకడానికి చోటు లేదా అని ఆవేదన చెందింది.

పోలీస్ శాఖలోనూ అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. థర్డ్ జెండర్ కమ్యూనిటీ అప్లికేషన్ తీసుకోం అని డిపార్టుమెంట్ ఖరాకండిగా తేల్చి చెప్పింది. తర్వాత మద్రాసు హైకోర్టుని ఆశ్రయిస్తే అనుకూలంగా తీర్పొచ్చింది. మూడో కేటగిరీని కూడా పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం తమిళనాడు యూనిఫాం సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కు ఆదేశాలు జారీచేసింది.

ఐపీఎస్ అధికారి కావాలన్నది నా కల. నాలాంటి ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పోరాడాలి. వాళ్లకు న్యాయం జరగాలి. విద్య, ఉపాధిలో ట్రాన్స్ జెండర్లకు సరైన న్యాయం జరగాలి. అదే నా ఆశయం. చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడం తక్షణం నాముందున్న కర్తవ్యం అంటారు ప్రీతిక.