ఐదు మహాసముద్రాలను అవలీలగా ఈదిన ధీర వనిత

మంచు కొండలను బద్దలు కొట్టి.. మహా సముద్రాలను ఈది.. చరిత్ర సృష్టించిన‌ భక్తిశర్మ

ఐదు మహాసముద్రాలను అవలీలగా ఈదిన ధీర వనిత

Monday June 29, 2015,

3 min Read

అంటార్కిటికా. ఆ పేరు వింటేనే వొంట్లో నెత్తురు గడ్డకడుతుంది. మరి అక్కడికి వెళ్లడమంటే మానవ మాత్రులకు సాధ్యమయ్యే పనేనా? కానీ రాజస్థాన్ కి చెందిన భక్తిశర్మ చేసి చూపించారు. మంచుకొండలను బద్దలు కొడుతూ శీతలగాలును చీలుస్తూ, మహాసముద్రాలను, అపారజలరాశిని అవలీలగా ఈదుతూ ప్రపంచ రికార్డులను పాదాక్రాంతం చేసుకున్నారు. నాలుగు మహాసముద్రాలను ఈది భారతదేశ కీర్తిప్రతిష్టలను దిగంతాలకు చాటిచెప్పారు.

అలా ఇంట్రస్ట్ ఏర్పడింది

భక్తి శర్మ పుట్టింది ముంబైలో అయినా పెరిగిందంతా రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో పెరిగింది. రెండున్నరేళ్ల వయసులో ఈతమీద ఇంట్రస్ట్ ఏర్పడింది. బుడిబుడి అడుగులు వేసే వయసులో చేప పిల్లలా నీళ్లలో ఈత కొట్టడం మొదలుపెట్టింది. భక్తికి ఈత నేర్పాలని నిర్ణయించిన ఆమె తల్లి లీనాశర్మకూడా జాతీయస్థాయి స్విమ్మరే. స్విమ్మింగ్ పూల్ కంటే ఓపెన్ వాటర్‌లో ఈత నేర్పాలని ఆమె భావించింది.

అన్నిటికీ బ్రేక్

స్విమ్మింగ్ అయితే నేర్చుకోవడం ప్రారంభించింది కానీ.. దాన్ని కంటిన్యూ చేయడానికి భక్తి చాలా కష్టపడింది. సరైన వసతులు లేవు. పైగా అమ్మాయి. వయసు పెరుగుతున్న కొద్దీ యిబ్బందులు ఎదురయ్యాయి. దాంతో ఆమె స్విమ్మింగ్‌‌కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఈత అయితే వదులుకుంది గానీ స్పోర్ట్స్ పై ఉన్న మమకారం చావలేదు. అలా అయితే లాభం లేదని కరాటేలో చేరింది. బ్లాక్ బెల్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా ఎన్నో రోజులు సాగలేదు. కోచ్ వేరే చోటికి వెళ్లడంతో కరాటే కూడా మధ్యలోనే బ్రేక్ పడింది. అలా మనసు పడ్డ రెండు కూడా వదులుకోవాల్సి రావడం భక్తిశర్మ డిప్రెస్ అయింది. కూతురి పరిస్థితి అర్ధం చేసుకున్న లీనా ఆమెను లక్ష్యం దిశగా నడిపించింది.

అటు చదువు అటు స్విమ్మింగ్. ఏకకాలంలో చాలా కష్టమైంది. డైలీ స్విమ్మింగ్ కోసం ఐదు గంటలు కేటాయించాల్సి వచ్చేది. అదొక్కటే అయితే ఎలా? చదవును పట్టించుకోకపోవడం సరైంది కాదు. ఆ ఉద్దేశంతో కష్టపడి చదివాను అని భక్తి గుర్తుచేసుకుంటారు. టెన్త్, ఇంటర్ లలో 84, 87 శాతం మార్కులు సాధించింది. సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.

భక్తి శర్మ

భక్తి శర్మ


ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు

భక్తికి స్విమ్మింగ్ లో ఎదురే లేదు. పాల్గొన్న ప్రతి పోటీలోనూ ఆమెదే గెలుపు. టోర్నీ ఏదైనా పాల్గొన్న చిన్న వయస్కురాలు భక్తినే. పద్నాలుగేళ్ల వయసులో తొలి ఓపెన్ వాటర్ స్విమ్‌ను ప్రారంభించారు భక్తి. ఉరాన్ పోర్టు నుంచి గేట్ వే ఆఫ్ ముంబై వరకు ఈదీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. టెంపరేచర్ అయిదు ఆరు డిగ్రీలున్నా సరే భక్తి భయపడదు. ఆగ‌కుండా నాలుగు నుంచి ఐదు గంటల వరకు ప్రాక్టీస్ చేసేదాన్ని అని భక్తి గుర్తుచేసుకున్నారు. స్విమ్మింగ్ లాంటి స్పోర్ట్స్‌లో ప్రొఫెషనల్ ప్రాపర్ ట్రైనింగ్ లేకపోతే ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. మనకు మనమే స్ఫూర్తిగా నిల‌వాలి. భక్తికి కూడా ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో వైఫల్యాలు. అయినా వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది.

ఐదు మహా సముద్రాలు

ఒక స‌ముద్రాన్ని ఈద‌డం అంటేనే గ‌గ‌నం. అలాంటిది ఐదు స‌ముద్రాలంటే మాట‌లా? హిందు, పసిఫిక్, ఆర్కిటిక్, అంటార్కిటికా, అట్లాంటిక్ మహాసముద్రాలలో అతి తక్కువ సమయంలో ఈది రికార్డు సృష్టించింది. అంటార్కిటా సముద్రంలో అయితే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటుంది. అంత కోల్డ్ వాట‌ర్‌లోనూ ఈది అతి తక్కువ వయస్సున్న యువతిగా, తొలి ఆసియా మహిళగా రికార్డు సొంతం చేసుకుంది. ఇవి కాక ఆమె ప్రపంచంలోని సప్త సముద్రాలను, ఇంగ్లీష్ ఛానల్, జ్యూరిచ్ లేక్‌లలో నిర్వహించిన పోటీల్లోనూ పాల్గొని రికార్డులు సాధించింది. అంటార్కిటికా మహాసముద్రంలో ఈదిన ముగ్గురు చిన్నవయస్కుల్లో భక్తి కూడా ఒకరు.

ఇంగ్లిష్ చానల్ ఈదిన చిన్నారి

భక్తి, ఆమె తల్లి లీనాలకు ఓ అరుదైన రికార్డు ఉంది. ఇంగ్లిష్ చానల్‌ను కలిసి ఈదిన తల్లికూతుళ్లు వీరిద్దరే కావడం విశేషం. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా ఇంగ్లిష్ చానల్ ను ఒంటరిగా ఈదిన భక్తి ఆ తర్వాత కూడా ఆ ఘనతను మరోసారి సాధిచింది. భక్తి సాధించిన ఘనతలకు గానూ ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. 2012లో భక్తికి టెన్సింగ్ నార్కే అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి టెన్సింగ్ నార్కే అవార్డు అందుకుంటున్న భక్తి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి టెన్సింగ్ నార్కే అవార్డు అందుకుంటున్న భక్తి


మంచులో స్విమ్మింగ్

ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించిన భక్తి.. ఇటీవలే మరో ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అతిశీతల వాతావరణం ఉండే అంటార్కిటిక్ సముద్రంలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రతలో 1.4-52 నిమిషాల్లో ఈది కొత్త రికార్డు సృష్టించింది. బ్రిటన్ స్విమ్మర్ లూయిస్ పౌవ్, అమెరికా స్విమ్మర్ లెనె కాక్స్ ల రికార్డులను తుడిచిపెట్టింది. మంచు ఖండంలో స్విమ్ చేసిన అతి చిన్నవయస్కురాలిగా, తొలి ఆసియా బాలికగా చరిత్ర లిఖించింది.

ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ కు మరింత ఆదరణ దక్కాలనన్నదే భక్తి కల. ‘నేను సరస్సులో ఉన్నా సముద్రంలో న్నా.. కనీసం పదిమంది బాలికలు నాతో పాటు స్విమ్మింగ్ చేస్తుండాలి. వారు స్విమ్ చేస్తున్న వాటర్ పై తేలియాడుతూ ఉండాలి’ అని భక్తి తన కోరికను వెల్లడించింది. మరి ఆమె స్వప్నం సాకారమవ్వాలని, స్విమ్మింగ్ స్పోర్ట్స్ లోకి మరింత మంది బాలికలు రావాలని కోరుకుందాం.