కేబీఆర్ పార్క్ హైదరాబాద్ ఆక్సిజన్: పర్యావరణ వేత్తలు

కేబీఆర్ పార్క్ హైదరాబాద్ ఆక్సిజన్: పర్యావరణ వేత్తలు

Friday May 06, 2016,

2 min Read


హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ నగర జీవి సేదను తీరుస్తుందని పర్యావరణ ఉద్యమకారులు అభిప్రాయపడ్డారు. దాదాపు 6 వందల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ పార్కుకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎత్తైన ప్రాంతంలో వ్యాపించిన ఈ పార్క్ వల్ల దిగువ ప్రాంతాలకు నీరు అందుతుందని, భూగర్భ జలాలను కాపాడటానికి సైతం ఇలాంటి పార్కులను మరిన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని నేతలు చెప్పుకొచ్చారు.

ట్రాఫిక్ సమస్యకు పార్క్ ని బలి పెడతారా?

ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్లై ఓవర్ పై అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తున్న నేపధ్యంలో నగరంలోని పర్యవరణవేత్తలు ట్రాఫిక్ కి మరో ఆల్టర్నేట్ చూడాలని అంటున్నారు. నగరం నడిబొడ్డున పచ్చదనానికి ఓ సింబల్ లా ఉన్న పార్క్ జోలికి వెళ్లొద్దని అంటున్నారు.

“పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను మరింత పెంచండి, ట్రాఫిక్ ని నియత్రించండి,” ప్రశాంత్ బాచు

అమెరికా లాంటి దేశాల్లోనే ప్లై ఓవర్ల నిర్మాణంపై పునరాలోచిస్తున్నారు. మనం అడవులను నాశంన చేసి కాంక్రీట్ జంగిల్ ను ఏర్పాటు చేయడం ఎంతవరకూ సమంజసం అని అన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని ప్రభుత్వమే ప్రోత్సహించాల్సి ఉందని చెప్పారాయన. తాము కార్ ఫ్రీ థర్స్ డే లాంటి కార్యక్రమాలతో ముందుకొస్తున్నామని.. దీన్ని అన్ని ప్రదేశాల్లో అమలయ్యేలా ప్రభుత్వం చూడాలని అన్నారాయన. ఢిల్లీలో సరి బేసి సూపర్ సక్సెస్ అయిందని, 30శాతం ట్రాఫిక్ తగ్గిందని చెప్పుకొచ్చారు. ఇలా చేయడం ద్వారా ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేబీఆర్ నగరానికి ఆక్సిజన్

నగరంలో ఇప్పటికే అన్ని పార్కులు కనుమరుగవుతున్నాయని, అలాంటిది మనకు పెట్టని కోటలాగ సహజ సంపద ఉన్నప్పుడు కాపాడుకోవాల్సిన అవసం ఉందని బొంతు నర్సింహారెడ్డి అన్నారు. పార్కుల రక్షణపై తాము గతంలో చాలాసార్లు ప్రభుత్వాలతో పోరాటం చేశామని, కొన్నింటిని కాపాడుకోగలిగామని ఆయన గుర్తు చేశారు.

“కెబిఆర్ పార్క్ రక్షణకు అందరూ కలసి రావాలి” నర్సింహారెడ్డి

ప్రభుత్వం నుంచి ప్రపోజల్స్ మాత్రమే వచ్చాయి. అప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు. సర్కార్ సైతం అందరి అభిప్రాయం తీసుకుని ముందుకు పోతే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో ఉన్న ఏకైక పెద్ద పార్క్ ఇది.. దీన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

నగరం ప్రపంచస్థాయికి ఎదగాలి

కేబీఆర్ పార్క్ పై గతంలో చాలా పోరాటాలు జరిగాయి. నెమళ్లు ఇతర పక్షులతో పాటు వణ్యప్రాణులకు ఆవాసంగా ఉన్న ఈ పార్క్ ఎప్పుడూ చర్చనీయం అవుతుంటుంది. తాజాగా ప్రభుత్వం ప్రదిపాదించిన ఫ్లై ఓవర్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. కనీసం చెమట అనేదే తెలియని సగటు హైదరాబాద్ వాసి.. ఈ రోజు ఉక్కపోతను చూస్తున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమొదవుతున్నాయి. వీటన్నింటి కారణం నగరంలో విచ్చలవిడిగా చెట్లను నరికేయడం వల్లనే.

“నగరం ప్రపంచ స్థాయికి ఎదగాలి, అంటే పదేళ్లు పరిష్కారం చూపగలిగే ఫ్లై ఓవర్ నిర్మాణంతో కాదు” పురుషోత్తం రెడ్డి.
image


చిన్నప్పుడు వేసవిలో హైదరాబాద్ వస్తే ఉపసమనంగా ఉండేది. అసాధారణంగా పెరిగిపోయిన కాంక్రీట్ జంగిల్, ట్రాఫిక్ జామ్ లతో ఇప్పుడు నరకయాతనగా మారిందని, దీనికి పూర్వవైభవం తీసుకురావాలని, అంతా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని, ఎన్జీఓలు దీనికి కలసి రావాలని అన్నారు. కేబీఆర్ పార్క్ పై అంతాకలసి రావడం ఆనందంగా ఉందని అన్నారాయన. మరింత మంది యువత ముందుకు రావాలని, నగరంలో గ్రీనరీపై, పర్యావరణంపై మాట్లాడాలని ముగించారు.