దేశం కోసమైనా హాకీని బతికించండి

16 ఏళ్ల పాటు హాకీతో దేశానికి సేవలు..భారత హాకీ టీమ్‌లో ఒకప్పుడు అత్యద్భుత మిడిల్ ఫీల్డర్..మూడు సార్లు ఒలింపిక్స్‌లో ఆడిన అరుదైన గౌరవం..80 అంతర్జాతీయ గోల్స్ సాధించిన ముకేష్..హాకీ అకాడమీ ఏర్పాటుకు పదేళ్లుగా ఎడతెగని పోరాటం..హాకీ అకాడమీ కోసం ఇంటినీ అమ్ముకున్న వైనం..ఆటకు పడిపోతున్న ప్రాభవంపై విచారం..యువర్ స్టోరీకి ప్రత్యేక ఇంటర్వ్యూ..

దేశం కోసమైనా హాకీని బతికించండి

Thursday May 14, 2015,

5 min Read

హాకీ... ఒకప్పుడు ఈ క్రీడపై దేశంలో ఎనలేనంత మక్కువ. ఇంకా చెప్పాలంటే కొంత మందికి ఇదో వ్యసనంలా మారింది. అంతగా అప్పటి రోజుల్లో హాకీ ఇక్కడి ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయింది. ప్రపంచంలోనే హాకీకి పేరెన్నికగల దేశంలా భారత్ వెలిగిపోయింది. మన ఆటగాళ్లను ఎలా ప్రలోభపెట్టి ఆటను తమవైపునకు ఎలా తిప్పుకోవాలో వివిధ దేశాలు లెక్కలు వేసుకునేవి. అదీ ఒకప్పటి పూర్వవైభవం. కానీ మెల్లిమెల్లిగా ఆ ప్రభ తగ్గుతూ వచ్చింది. ఆధునిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకోకపోవడంతో మనం వెనుకపడిపోయాం. ఇప్పుడు మళ్లీ ఆ హాకీని పునరుత్తేజితం చేసి జవజీవాలు పోయాలని తాపత్రయపడ్తున్నారు ఒలంపియాడ్ ముకేష్ కుమార్. ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి అయినా సరే హాకీకి ఏదైనా ప్రయోజనకరమైంది చేయాలని తెగ ఆరాట పడ్తున్నారు. హైదరాబాద్‌లో అకాడమీ ఏర్పాటుకు పదేళ్లుగా తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నా.. ఇంచి కూడా ముందుకు కదలని వైనం. చివరకు ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చినా.. ఇప్పటికీ ఆశ చావక.. ఏదో ఒకటి చేయాలనే తపనే.. ఆయనను ముందుకు నడిపిస్తోంది.

యువర్ స్టోరీ టీమ్ ముకేష్ కుమార్‌ను కలిసి అనేక విషయాలను చర్చించింది. కెరీర్ ఎలా ప్రారంభమైంది మొదలు.. ఈ దుస్థితి ఎందుకు దాపురించింది అనే విషయాల వరకూ ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. పదహారేళ్ల పాటు హాకీ క్రీడతో సేవలు చేసి చివరకు ఆయనకు సంబంధం లేని పనిచేస్తున్నందుకు లోలోపల బాధపడ్తూనే బయటకు మాత్రం ఇప్పటికీ హాకీనే నా ప్రాణమంటున్న ముకేష్ ప్రస్థానం.. ఆయన మాటల్లోనే..

image


హాకీ కేవలం ఆట కాదు.. నా జీవితం !

''మాది మధ్యతరగతి పేద కుటుంబం. 1970 ఏప్రిల్ 16వ తేదీన జన్మించాను. మా కుటుంబ సభ్యులందరికీ హాకీ అంటే చాలా ఇష్టం. సికింద్రాబాద్‌లోని మా ఏరియాలో చాలా మంది హాకీ ఆడేవారు. అలా వాళ్లతో ఆడుతూ.. ఆడుతూ నాకూ తెలియకుండానే హాకీపై ఇష్టం పెరిగిపోయింది. మా సమయంలో క్రికెట్ ఇంకా ఆ స్థాయిలో పాపులర్ కాలేదు. సామాన్యులకు అందుబాటులో ఉన్న ఆటల్లో హాకీ ఒక్కటే. ఇక నా చదువు విషయానికి వస్తే మహబూబ్ కాలేజీలో చదివాను. అక్కడ క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలిసే చేరాను. స్కూల్లో చదువుతూనే ఆటలకు ఎక్కువ సమయం కేటాయించాను. అయినా నేను ఈ స్థాయికి ఎదుగుతానని నేనూ అనుకోలేదు. మా కుటుంబ సభ్యులకూ పెద్ద నమ్మకాలేవీ లేవు.

చదువుకు పుల్ స్టాప్ -

పెద్ద చదువులు చదవలేదు. ఇంటర్ దాకానే చదివాను. 1992లో హాకీ టీమ్‌లోకి అడుగుపెట్టాను. జూనియర్ వాల్డ్ కప్ ఆఫర్ వచ్చింది. అప్పుడే చదువుకు పుల్ స్టాప్ పెట్టేశాను. హైదరాబాద్ నుంచి నేను ఒక్కడినే ఆ టీమ్‌కు సెలెక్ట్ అయ్యాను. అలాంటప్పుడు రెండింటినీ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అందుకే హాకీపైనే పూర్తిగా దృష్టి సారించాను. డిగ్రీని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదువుతున్నాను.

17 ఏళ్ల పాటు దేశం తరపున ఆడినా మనకు క్రికెట్ స్థాయిలో ఉన్నంత ప్రాముఖ్యత లేదే అని అప్పుడప్పుడూ బాధ అనిపిస్తుంది. కానీ.. వాళ్లకంటే మనం తక్కువ అనే భావన మాత్రం ఎప్పుడూ లేదు. ఇండియాకు ఆడాను అనే తృప్తే.. నాకు చాలు.

  • స్టాండ్ బై.. గోల్డెన్ గోల్

నేను క్యాంప్‌లో స్టాండ్ బై లా ఉండేవాడిని. స్పోర్ట్స్‌లో లక్ చాలా ఎక్కువ పనిచేస్తుంది. ఆటల మధ్య నాకు గాయాలై వెనక్కి తిరిగి వచ్చేశాను. అయినా సరే నెల రోజుల తర్వాత మళ్లీ నాకు కబురు పంపారు. జూనియర్ వాల్డ్ కప్‌లో నేను పాకిస్తాన్ పై చివరి సమయంలో డైవ్ చేసి ఒక గోల్ కొట్టేసరికి నాకు ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. అది డిసైడింగ్ గోల్ కావడంతో మేము పాకిస్తాన్ పై గెలిచాం. ఒక హైదరాబాదీ కుర్రాడు గోల్ కొట్టాడంటూ నా పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత నాకు మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. జూనియర్ నుంచి సీనియర్ జట్టులోకి వెళ్లిపోయాను.

మూడుసార్లు ఒలంపిక్స్.. ఆడడం చాలా గొప్ప విషయం. ఒలంపిక్ విలేజ్ లో అడుగుపెట్టడంతోనే మనలో ఎక్కడలేని టెన్షన్ మొదలవుతుంది. అప్పుడు దూరదర్శన్ రిలే... వేల మంది ఆడియన్స్.. మనల్ని చూస్తున్నారు అనే ఫీల్ తోనే టెన్షన్ మొదలైపోయేది. 1992 నేను గొప్పగా ఆడలేకపోయాను. కానీ ఆ తర్వాతి 1996,2000 లో నేను బాగా ఆడేందుకు ఆస్కారం లభించింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను.

  • రికార్డ్ గోల్

నేను సిడ్నీలో 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో ఒలంపిక్స్ ఆడుతున్న సమయం. మ్యాచ్ ప్రారంభమైంది. ఇంకా అంతా సెటిల్ కూడా కాలేదు. ఈ లోపే నేను గోల్ కొట్టేశాను. అదీ కేవలం 37వ సెకెండ్‌లోనే. అదే ఇప్పటివరకూ ఉన్న రికార్డ్.

  • పద్శశ్రీ టెలిగ్రాం

అది 2002 సంవత్సరం. ఒక రోజు అనుకోకుండా.. కేంద్ర హోం శాఖ నుంచి ఇంటికి టెలిగ్రాం వచ్చింది. తీరా చూస్తే... పద్శశ్రీ అవార్డుల ప్రకటనలో నా పేరుంది. నేను అసలు ఊహించనేలేదు. ఇక ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేదు. ఆ టెలిగ్రాం చేతిలో పడగానే నా శరీరమంతా దూదిపింజలా తేలికైపోయింది. రెండు, మూడు రోజుల పాటు నేను ఎలా ఉన్నానో నాకే అర్థం కాలేదు. ఒక వేళ ఆ టైంలో ఏదైనా మ్యాచ్ ఉంటే.. తప్పనిసరిగా గోల్స్ అన్నీ నేను కొట్టి విజయం సాధించేవాడినేమో అనేంత కాన్ఫిడెన్స్ వచ్చింది.

వాస్తవంగా నేను 2001లోనే పద్శశ్రీ వస్తుందని ఆశించాను. అప్పట్లో రాకపోవడంతో నిరాశ చెందాను. అప్పట్లో నా ఫ్యామిలీ అంతా ఏ గుడికి వెళ్లినా నాకు అవార్డ్ రావాలనే దండం పెట్టుకునే వారు. నా కూతురైతే.. ఏ దేవుడు కనిపించినా.. 'పప్పాకు.. పద్శశ్రీ వచ్చేలా చూడు.. దేవుడా.. 'అంటూ మొక్కేసేది. 2002లో అవార్డు వచ్చిన తర్వాత కూడా గుడికి వెళ్లి మళ్లీ అలానే మొక్కేసేది అంటే.. ఎంతలా మైండ్‌లో ఫిక్సైపోయిందో ఆ మాట ఆలోచించండి.

ఇవే నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని మూడు మధుర ఘట్టాలు. ఇది తలుచుకున్నప్పుడల్లా నాలో ఏదో తెలియని ఆనందం.. ఆవేశం.. వచ్చేస్తాయి.

పద్శశ్రీ అవార్డును అందుకుంటున్న ముకేష్

పద్శశ్రీ అవార్డును అందుకుంటున్న ముకేష్


హాకీని బతికించండి...

నాకంటూ ఒక ఖ్యాతి వచ్చింది.. నేను అనేవాడిని ఒకడు ఉన్నాడని ప్రపంచానికి తెలిసింది కేవలం హాకీ వల్లే. నాకూ.. హాకీకి విడదీయరాని బంధం. 16 ఏళ్ల పాటు హాకీ ఆడ్తూ.. కీలకమైన జీవితమంతా మైదానాల్లో గడిపాను. ఇప్పుడేమో కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడుకుంటూ... సంబంధం లేని పనిచేస్తున్నాం. నాకు వచ్చినంత హాకీనంతా పిల్లలకు నేర్పించాలని అనుకుంటున్నాను. కానీ బోర్డులు, బ్యూరోక్రసీ మాత్రం ఇందుకు మోకాలడ్డుతోంది. కొంత మంది ఏదైనా పదవిలోకి వచ్చిన తర్వాత.. కాలం పూర్తైనా.. వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. వాళ్లో.. వాళ్ల బంధువులనో మళ్లీ ఆ సీట్లలో కూర్చోపెట్టాలని చూస్తున్నారు. ఆటలు తెలియని వాళ్లు, ఆటలతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పాలసీలు తయారు చేస్తారు. దాని వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది. ఎవరికి ఉపయోగం ? ఒలంపిక్ షూటర్ రాజ్యవర్ధన్ రాధోడ్‌కు ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడని వ్యక్తికి స్పోర్ట్స్ శాఖ ఇచ్చారు. ఇది ఎవరిని ఉద్ధరించడానికి ?

టాలెంట్‌ను వాడుకోండి

పర్గత్ సింగ్ - వాల్డ్ బెస్ట్ డిఫెండర్. ఆయనలా డిఫెండింగ్ వచ్చిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ ఆయన సేవలను మనం ఉపయోగించుకోం. మొహ్మద్ షాహిద్ - ఆయన డ్రిబ్లింగ్‌లో ది బెస్ట్. నేను స్ట్రాంగ్ మిడ్ ఫీల్డర్. మా సేవలను ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. మైదానాల్లో ఉండాల్సిన మేము... పొట్టనింపుకోవడం కోసం ఏదో ఒక పనిచేస్తున్నాం.

మన ప్రభుత్వాలు కూడా విచిత్రంగా పనిచేస్తాయి. దేశీయంగా ఇంత టాలెంట్ పెట్టుకుని విదేశీ కోచులకు ఆరు, ఏడు లక్షలు ఇచ్చి తెచ్చుకుంటున్నాయి. మేము అడిగితే ఫ్రీగా వచ్చి చెప్పమంటున్నారు. ఇది ఎంత వరకూ సమంజసం ? మాకూ లక్షలకు లక్షలు ఇవ్వమని అడగడం లేదు. కనీసం నిర్వాహణా ఖర్చులన్నా ఇమ్మన్నా.. వాళ్ల నుంచి స్పందన ఉండదు.

అంతే కాదు స్వయంగా అకాడమీ తెరిచి.. యువతకు శిక్షణ ఇవ్వాలని పదేళ్లుగా నేను కలలుకంటున్నాను. ఇంతవరకూ అది కేవలం కలగానే మిగిలిపోయింది. కానీ ఏదో ఒక రోజు అకాడమీ తెరిచి.. నా శక్తియుక్తులన్నింటినీ తర్వాతి తరాలకు నేర్పాలనే బలమైన సంకల్పం మాత్రం నాలో ఇంకా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోకపోతే.. హాకీ అనే ఆట ఉండేదట.. అని చెప్పుకునే ఘోరమైన స్థితి దాపురిస్తుంది. మా లాంటి వాళ్లకు నిజంగా అది తలకొట్టేసినట్టే అవుతుంది''.

భార్యాపిల్లలతో ముకేష్

భార్యాపిల్లలతో ముకేష్


ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ముకేష్ భార్య నిధి కూడా ఉత్తమ అంతర్జాతీయ ప్లేయరే. తను ఇప్పుడు రైల్వేల్లో పనిచేస్తోంది. ఇంట్లో ఇద్దరు బెస్ట్ క్రీడాకారులన్నా వాళ్ల కూతురు మాత్రం హాకీ స్టిక్ పట్టుకునేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదు. ప్రస్తుతం తను బ్యాడ్మింటన్ నేర్చుకుంటోందంటేనే హాకీ భవిష్యత్తును మనం అర్థం చేసుకోవచ్చు.