భారత డయాబెటిస్ పేషెంట్లలో భరోసా నింపుతున్న బోస్టన్ సంస్థ 'క్యామ్‌టెక్'

0

దేశంలో టెక్నాలజీ వినియోగదార్లతో పాటు ఇక్కడి జనాల్లో సామాజిక కోణంలో ఆలోచించేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువేనంటున్నారు క్యామ్‌టెక్ డైరెక్టర్ ఎలిజబెత్ బెయిలీ. క్యామ్‌టెక్ ఇండియా చాప్టర్‌లో భాగంగా మూడు రోజుల పాటు అనేక సదస్సులను నిర్వహించింది బోస్టన్‌కు చెందిన ఈ కంపెనీ. డయాబెటిస్‌పై అవగాహన పెంచుతూనే.. మార్పులు తీసుకురావాలని చూస్తోంది. ఆఫ్రికాలోని ఉగాండాలో గత నెల ఈవెంట్లు పూర్తి చేసుకొని హైదరాబాద్‌లో అడుగు పెట్టిన ఈ సంస్థకు ఇక్కడి టెకీలంతా ఘనమైన స్వాగతమే పలికారు.

“మేం అనుకున్న లక్ష్యం అంత సులువుగా నెరవేరేదైతే కాదు. కానీ భారత్‌కు టెక్నాలజీ అందిపుచ్చుకునే సామర్థ్యం ఉంది. హైదరాబాద్‌లో మేం ఏర్పాటు చేసిన హ్యాకథాన్‌కు వచ్చిన అనూహ్య స్పందనే మాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది” - ఎలిజబెత్ బెయిలీ.

ఎల్వీ ప్రసాద్ భాగస్వామ్యం

దేశంలో ప్రతిష్టాత్మక కంటి ఆసుపత్రుల్లో ఒకటైన ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ క్యామ్‌టెక్‌తో కలసి పనిచేస్తోంది. ప్రధానంగా కంటి సమస్య ఉన్నవారికి డయాబెటిస్ వస్తే.. ఆపరేషన్ సమయంలో అనేక సమస్యలొస్తాయి. సాధారణంగా అయితే షుగర్ సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ ఆపరేషన్ చేయరు. దేశంలో ఎక్కువ ఆపరేషన్లు చేస్తున్న హాస్పిటల్స్‌లో ఎల్వీప్రసాద్‌ ఒకటిగా చెప్పుకోవచ్చు. దీంతో టెక్నాలజీ సాయంతో డయాబెటిస్ నయం చేసే ప్రక్రియను క్యామ్ టెక్ నిర్వహిస్తోంది.

“మా సంస్థ ద్వారా కోట్లమందికి కంటి చూపు తెప్పించాం. మా పనికి టెక్నాలజీ సాయపడితే మరింత మంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. ఇదే ఉద్దేశంతో క్యామ్‌టెక్‌తో కలసి పనిచేస్తున్నాం” అంటారు ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ చైర్మన్ గుల్లపల్లి ఎన్ రావు.
గుల్ల పల్లి ఎన్ రావు
గుల్ల పల్లి ఎన్ రావు

డయాబెటిక్ పేషెంట్లకు సాయం అందించే ఉద్దేశంతో ఇండియా వచ్చిన మాకు ఎల్వీప్రసాద్ ఆసుపత్రి ఇస్తోన్న మద్దతుతో మరింత ముందుకు పోవడానికి అవకాశాలున్నాయని ఎలిజిబెత్ అభిప్రాయపడ్డారు.

ఐఎస్‌బిలో హ్యాకథాన్

గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో క్యామ్ టెక్ నిర్వహించిన హ్యాకథాన్‌కు అనూహ్య స్పందన రావడంతో సంస్థ మరిన్ని ఈవెంట్లు చేపట్టాలని చూస్తోంది. హైదరాబాద్‌లో మానవ వనరులకు కొదవ లేదనే వాళ్లు అర్థం చేసుకున్నారు. హ్యాకథాన్‌లో పదిహేనేళ్ల నుంచి అరవై ఏళ్ల దాకా పార్టిసిపెంట్స్ పోటీపడటం చూసి చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు చెబ్తున్నారు.


క్యామ్ టెక్ గురించి

బోస్టన్ కేంద్రంగా ప్రారంభమైన ఈ సోషల్ ఆంట్రప్రెన్యూర్‌ స్టార్టప్.. డయాబెటిక్‌కు టెక్నాలజీతో పరిష్కారం లభిస్తుందని బలంగా నమ్ముతోంది. అయితే ఇందుకోసం అనేక రకాలైన క్లినికల్ అవకాశాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. భాగస్వాములు, పెట్టుబడిదారులు, నిపుణులతో వనరులను కూడా పెంచుకోవడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ సామాజిక సేవకు అమెరికాలో ఇన్వెస్టర్లు దొరికే అవకాశం ఉన్నా .. వనరులు, నిపుణుల కొరతే బాధిస్తోందని క్యామ్‌టెక్ వివరిస్తోంది. దీంతో వీరు భారత్ లాంటి దేశాల్లో సేవలను ప్రారంభించారు. ప్రపంచంలో డయాబెటిక్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ఆఫ్రికాలోని ఉగాండాలో మొదటగా టెక్నాలజీని ఉపయోగించారు. అయితే భారత్‌లో కూడా డయాబెటిక్ సమస్య ఉండటంతో ఇక్కడ కూడా సేవలను ప్రారంభించారు. ఇండియాలో టెక్నాలజీ కోసం ప్రాణం పెట్టే యువత కనిపించడంతో ఈ సంస్థ చేపట్టే వాలంటరీ ట్రెయినింగ్‌కు ఇక్కడి మానవ వనరులను వినియోగించుకోడానికి సంస్థ ఆసక్తి చూపిస్తోంది.

భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలు

ప్రపంచంలో డయాబెటిక్ సమస్యకు పరిష్కారం ఒక్క రోజులో తీరేది కాదు. దీనికోసం టెక్నాలజీని కూడా మనకు సరిపోయేట్టు మార్చుకోవాలి. అందుకు తగ్గట్టు మానవ వనరులనూ సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ సంస్థ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే హ్యాకథాన్ లాంటి ఈవెంట్లను ఆర్గనైజ్ చేస్తోంది. భారత్‌లో ఎల్వీప్రసాద్‌తో పాటు మరికొన్ని సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటూ ఒక్కో అడుగూ ముందుకు వేస్తోంది.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik