రూ.13వేలతో మొదలైన ఇతని వ్యాపారం నేడు వేల కోట్లకు చేరింది!!

రూ.13వేలతో మొదలైన ఇతని వ్యాపారం నేడు వేల కోట్లకు చేరింది!!

Wednesday April 19, 2017,

2 min Read

సాధారణంగా వేలకోట్ల రూపాయల కంపెనీల అధిపతుల్ని చూడగానే మనకు కలిగే ఫీలింగ్ ఏంటి? ఆయనకేంటి..? బడా వ్యాపారి.. జీవితం పూలపాన్పు.. వడ్డించిన విస్తరి.. అని రకరకాల విశేషణాలతో కూడిన అభిప్రాయానికి వచ్చేస్తాం. అయితే ఇది అందరికీ వర్తించదు. కొందరి జీవితం బంగారు స్పూన్ కావొచ్చు. కానీ కొందరు మాత్రం రక్తాన్ని చెమటగా చిందిస్తారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో వందల, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతులుగా నిలుస్తారు. అలాంటి కోవలోకే వస్తారు అరుణ్ ఐస్ క్రీమ్ అధినేత ఆర్జీ చంద్రమోగన్. 13,000 రూపాయలతో ప్రయాణం మొదలుపెట్టి నేడు 8వేల కోట్ల రూపాయల కంపెనీలకు అధినేత అయ్యాడు.

image


చెన్నయ్ లోని హాస్టన్ బిల్డింగ్. లోపలికి వెళ్లగానే గదిలో మలయమారుతాలు పలకరిస్తాయి. ఆ గాలి నేరుగా హిమాలయాల నుంచే వస్తోందా అన్నట్టుగా ఉంటుంది. ఒక తీయని వాసన అదేపనిగా ముక్కుపుటాలను తాకుతూ ఉంటుంది. మనకు తెలియకుండా గొంతులోకి చల్లగా గుటకలు పోతుంటాయి. 67 ఏళ్ల చంద్రమోగన్ ని పలకరించడానికి ఎవరు వెళ్లినా ఇదే అనుభూతికి లోనవుతారు. నిజంగా ఇతని జీవితం మొదటినుంచీ ఇంత చల్లగా ఉందా అనిపిస్తుంది. కానీ పలకరించినా కొద్దీ వేడిసెగల పోరాటం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. హాస్టన్ అగ్రో ప్రాడక్ట్ అనే కంపెనీ ఇండియాలో అతిపెద్ద ప్రైవేటు డెయిరీగా మారడం వెనుక మానసిక, ఆర్ధిక సంఘర్షణ ఎంతో ఉంది.

తమిళనాడు విరుధునగర్ జిల్లా తిరుతంగళ్ అనే గ్రామం నుంచి చంద్రమోగన్ జర్నీ మొదలైంది. అప్పుడ అతని వయసు 21 సంవత్సరాలు. కుటుంబం ఆర్ధిక చిక్కుల్లో పడింది. ఫలితంగా చంద్రమోగన్ చదువు ఆగిపోయింది. ఆస్తిపాస్తులు అమ్మడం మినహా వేరే మార్గం కనిపించలేదు. అవి అమ్మగా వచ్చిన డబ్బులతో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నారు. 1970లో ఒక చిన్నపాటి గది అద్దెకు తీసుకున్నారు. ఐస్ క్రీమ్ తయారు చేసే కంపెనీ. మొదట ముగ్గురు ఉద్యోగులతో వ్యాపారం మొదలైంది. కస్టమర్లను ఆకట్టుకోడానికి పదేళ్లు పట్టింది. పాండ్యన్, రాజేంద్రన్, పరమశివన్ అనే ముగ్గురు కంపెనీకి మొదట్నుంచీ చేదోడు వాదోడుగా ఉన్నారు. మొదట తోపుడు బళ్లమీద ఐస్ క్రీమ్ అమ్మేవారు. అలా పదేళ్లు బండిమీదనే నడిచింది. మొదటి యేడు కంపెనీ టర్నోవర్ లక్షా యాభై వేలు. ఆ లాభం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఎక్కడో చిన్న ఆశ. ఇక దీన్ని వదిలే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్నారు. 1986లో హాస్టన్ అగ్రో ప్రాడక్ట్ పేరుతో కంపెనీకి ఒక బ్రాండ్ నేమ్ ఏర్పడింది. రైతులకు మధ్యవర్తుల బెడద లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు.

ప్రస్తుతం 3 మిలియన్ల స్క్వేర్ ఫీట్ల వైశాల్యంలో కంపెనీ నడుస్తోంది. దాదాపు 8,000 మంది సంస్థలో పనిచేస్తున్నారు. తమిళనాడు, కర్నాటక, ఏపీ, గోవాలో ఆరోక్య, గోమాత అనే రెండు పాల ఉత్పత్తి కేంద్రాలు నడుస్తున్నాయి. కాంచీపురం, సేలంలో డెయిరీ యూనిట్స్ ఉన్నాయి. అరుణ్ ఐస్ క్రీమ్ పేరుతో దక్షిణ భారత దేశంలో పాపులర్ అయ్యారు. దానికి సంబంధించి వెయ్యికి పైగా ఐస్ క్రీమ్ పార్లర్లున్నాయి. అందులో 670 తమిళనాడులోనే ఉన్నాయి. కర్నాటలో 148, మిగిలినవి కేరళ, ఏపీలో బిజినెస్ చేస్తున్నాయి. ఏడేళ్ల క్రితం ఐబాకో అనే మరో వెంచర్ ని లాంఛ్ చేశారు. 80 చోట్ల ఔట్ లెట్స్ పెట్టారు. చంద్రమోగన్ తనయుడు సత్యం హస్టన్ అగ్రో కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చూసుకుంటున్నారు.

ఒకప్పుడు 13వేల రూపాయలతో ప్రయాణం మొదలుపెట్టి నేడు 8వేల కోట్ల రూపాయల కంపెనీలకు అధినేత అయిన చంద్రమోగన్ -ఇండియాలోని 41 మంది బిలియనీర్లలో ఒకరంటే ఆశ్చర్యం కలుగుతుంది.