ఈమె రోజూ ముఖానికి నల్లరంగు ఎందుకు పులుముకుంటుందో తెలుసా..?

కుల, వర్ణ వివక్షపై వినూత్న నిరసన తెలుపుతున్న కేరళ ఆర్టిస్ట్

0


కేరళ, కొచ్చి నగర శివార్లలోని త్రిపునితుర పట్టణం.

శరీరం అంతా నల్లటి పెయింటింగ్ వేసుకున్న యువతి ఓ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. కాసేపు నడిచింది. తర్వాత ఆటో ఎక్కింది. తర్వాత బస్ ఎక్కింది. చివరకు తను చేరాల్సిన గమ్యం చేరింది.

ఈ కొద్దిసేపు ప్రయాణంలోనూ ఆమెను వింతగా చూడనివారు లేరు. కొంతమంది అసహ్యంగా.. మరికొంత మంది ఆసక్తిగా.. మరికొంత మంది ఉత్సుకతతో చూశారు. వీరిలో చాలా మంది ఇదేం పని అని ప్రశ్నించారరు..

ఇది జరిగింది జనవరి 26న...రిపబ్లిక్ డే రోజున.

ఇప్పటికి ఎనభై రోజులు దాటింది. ఇప్పటికీ రోజూ ఆ యువతి శరీరమంతా నల్లటి పెయింటింగ్ వేసుకునే బయటకు వస్తోంది. ఎప్పట్లాగే వింతగా చూసేవాళ్లు చూస్తున్నారు.. అసహ్యించుకునేవాళ్లు అసహ్యించుకుంటున్నారు.. ప్రశ్నించేవాళ్లు ప్రశ్నిస్తున్నారు..!

కానీ చిరునవ్వు ఆమె సమాధానం కావడం లేదు. ఆమె తన "బ్లాక్" కు కారణం చెప్పడం ప్రారంభించింది. ప్రత్యేకంగా కొన్ని చోట్ల నిలబడి మరీ అడిగినా.. అడగకపోయినా కుల, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తాను చేపడుతున్న నిరనస గురించి అందరికీ వివరించడం ప్రారంభించింది. చెప్పిందంతా విని మొదట్లో అందరూ ఏ భావం లేకుండా వెళ్లిపోయినా రాను రాను... అభినందించేవారి సంఖ్య పెరిగింది. రెండు నెలల తర్వాత మీడియా దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడామె "బ్లాక్" నిరసన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

కళాత్మక నిరసన

ఫేస్ కు నల్ల రంగు వేసుకుని నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ యువతి పేరు పి.ఎస్. జయ. త్రిపునితర పట్టణంలో టీచర్, పెయింటర్, పెర్ఫార్మింగ్ ఆర్టిస్టుగా పని చేస్తుంటుంది. సామాజిక అంశాలపై ఎక్కువ అవగాహన ఉన్న జయ- వివక్షపై ఎలాంటి అవకాశం దొరికినా వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ క్రమంలో నల్లగా ఉన్నవారిపై చూపిస్తున్న వివక్ష ఆమె మనసుని చివుక్కుమనిపించింది. రంగులో ఏముందని ఆమె ప్రశ్నించేది. అలా హేళన చేసినవారిపై వ్రశ్నల వర్షం కురిపించేది. 

కుల, వర్ణ వివక్షకు గురయ్యేవారు దాదాపు 70శాతం మంది ఉంటారు. దీనిపై తన పరిధిలో నిరసన వ్యక్తం చేయాలనే భావన ఆమెకు ఉండేది. నల్లగా ఉండటం, దళితులుగా పుట్టడం వారి చేసిన తప్పు కాదని ఎలుగెత్తి చాటాలనుకునేది. ఈ సమయంలోనే జనవరి పదిహేడో తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు. కుల వివక్షే రోహిత్ ఆత్మహత్యకు కారణమైందని గట్టిగా నమ్మిన జయ.. తన నిరసనకు ఇదే సమయం అనుకున్నారు. ఏమి చేయాలో ఆలోచించుకున్నారు. నిరసన ప్రారంభించారు. దానికి జనవరి 26వ తేదీ సరైన సమయంగా గుర్తించారు. కార్యాచరణలోకి దిగారు. దేశం మొత్తం రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటూండగా... వివక్షకు గురవుతున్న దళితులు, నల్లగా ఉన్నవారి తరపున పోరాటం ప్రారంభించారు. ఆ రోజు నుంచి శరీరం మొత్తం నల్లటి పెయింటింగ్ వేసుకుని బయటకు రావడం ప్రారంభించారు.

వంద రోజుల నిరసన ప్రణాళిక

ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసిన పి.ఎస్.జయ తన నిరసనను పెర్ఫార్మింగ్ ఆర్టిస్టుగా ఓ ప్రదర్శనగా భావిస్తారు. ఆర్టిస్టు అనగానే ఓ ఆర్ట్ వర్క్ గా అనుకుంటారు. కానీ తన అది కాదు. బాడీనే తన భావాలను వ్యక్తం చేయడానికి సరైన మీడియంగా నమ్మారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన తన పెర్ఫార్మెన్స్ కు స్పందనగా భావిస్తూంటారు. జనవరి ఇరవై ఆరున ఈ బ్లాక్ నిరసన ప్రారంభించిన జయ... వందో రోజున ముగించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ తరహా నిరనసలకు "కళకాక్షి" అని పేరు పెట్టుకున్నారు జయ. అమె తరచూ సామాజిక కార్యకర్తలు, కో ఆర్టిస్టులు, రచయితలు, సాధారణ ప్రజలతో ఇంటరాక్టివ్ సెషన్స్ ఏర్పాటు చేసి డిస్క్రిమినేషన్ పై చర్చిస్తూ ఉంటారు. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత కూడా కళకాక్షి తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు దేశంలో మనిషిని ఓ ఓటుగా, ఓ నెంబర్ గా, ఓ వస్తువుగా చూస్తున్నారని జయ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

" మన సమాజంలో నలుపు రంగుని మంచిదిగా భావించరు. క్యాస్ట్ సిస్టమ్ ఇప్పటికీ కొనసాగుతోంది. రోహిత్ వేముల విషయంలో ఏం జరిగిందో అందరం చూశాం. ఈ సమయంలో సమాజం ఎదుట కొన్ని ప్రశ్నలు ఉంచాలనుకున్నాను. ఆర్టిస్టును కాబట్టి.. ఆర్టిస్టిక్ నా నిరసన, ప్రశ్నలను ప్రజల ముందుంచుతున్నా" పి.ఎస్.జయ.
సోదరితో జయ
సోదరితో జయ

మార్పు కోసం కళ

వళ్లంతా బ్లాక్ పెయింటింగ్ తో తను వ్యక్తం చేస్తున్న నిరసనను ఓ ప్రదర్శనగా భావిస్తున్న జయ.. దీనిపై ప్రజల్లో విస్త్రతమైన స్పందన రావాలని భావిస్తారు. అందుకే తన నిరసన పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపించినా వారితో చర్చించడానికి సిద్ధమైపోతారు. వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. వారిలో కుల, వర్ణ వివక్షపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తారు.

" నేను మొదటిసారి బయటకు వచ్చినప్పుడు పూర్తి కాన్ఫిడెంట్ గా లేను. బయట నన్ను చాలా మంది నన్ను ప్రశ్నించారు. కొంత మంది ప్రశంసించారు. కొంత మంది విమర్శించారు. అయితే నా అభిప్రాయాలన్నీ వారితో పంచుకున్నాను. నేను డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న స్కూల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే అందరితోనూ నా కాన్సెప్ట్ సవివరంగా చెప్పాను. కుల, వర్ణ వివక్ష వల్ల సమాజంలో ఎదురవుతున్న పరిస్థితులను వివరించాను" పి.ఎస్.జయ 

జయ ఈ నిరసన ప్రారంభించిన 42వ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఆ రోజున పూర్తిగా డార్క్ కలర్ పెయింటింగ్ ఉన్న శరీరానికి చిన్న చిన్న ఎల్ఈడీ లైట్లు ధరించి కోచి వీధుల్లో ప్రదర్శ ఇచ్చింది. వాక్ ఆఫ్ షేమ్ అని దానికి పేరు పెట్టింది. క్లాసికల్ డాన్స్ లో ప్రవేశం ఉన్న జయ.. ఆ మేకప్ తోనే రోడ్డుపై ప్రదర్శన కూడా ఇచ్చింది.

కళతో నిరసన కంటిన్యూ

మే 5వ తేదీతో ఆమె ప్రయాణానికి వందరోజులు పూర్తవుతుంది. ఆ తర్వాత నల్లటి పెయింటింగ్ ను వంటికి పూసుకోవడం ఆపేసినా... నిరసన మాత్రం కొనసాగిస్తానని జయ చెబుతున్నారు. ఈ వంద రోజుల "బ్లాక్" కాలంలో తన అనుభవాలు, ఫోటోలు, అభిప్రాయాలు, వ్యక్తం చేసిన మనుషుల వీడియోలు.. ఇలా ప్రతీ అంశంతో ఓ పబ్లిక్ టాక్ ను ఆర్గనైజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో పాటు ఓ పుస్తకం రాయాలని డిసైడ్ అయ్యారు. తర్వాత కొంతమంది దళిత ఉద్యమకారులతో కలిసి కుల, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పనిచేయాలని భావిస్తున్నారు.

" నా నిరసన ద్వారా సమాజంలో, గవర్నమెంటులో ఉన్నపళంగా మార్పు తెస్తానని నేను భావించడం లేదు. అయితే నేను కొన్ని ప్రశ్నలు లెవనెత్తాలనుకుంటున్నాను. క్యాస్ట్ సిస్టమ్ పై ప్రజల మైండ్ సెట్ మారాలని కోరుకుంటున్నాను. నాకు సోషల్ మీడియాలో వస్తున్న మద్దతు చూస్తూంటే పునాది గట్టిగానే వేశాననిపిస్తోంది" పి.ఎస్.జయ

ఆర్టిస్టుగా తనదైన పద్దతిలో కుల, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జయ చేస్తున్న నిరనస దాదాపు రెండు నెలల తర్వాత ప్రజల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించింది. ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది. పెకిలిచలేని విధంగా సమాజంలో పాతుకుపోయి కుల, వర్ణ వివక్షపై నేను సైతం అంటూ పోరాటాన్ని ప్రారంభించింది. తన నిరసనపై సమాజంలో చర్చ ప్రారంభమైతే.. కొంతలో కొంతైనా మార్పు ప్రారంభమవుతుందని జయ ఆశాభావంతో ఉన్నారు. 

As an IT engineering graduate... i am passionate to know about new and innovative ideas and explore them.....

Related Stories

Stories by SOWJANYA RAJ