పెట్రలో బంకులో పనిచేసే ఈ కుర్రాడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది..!!

పెట్రలో బంకులో పనిచేసే ఈ కుర్రాడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది..!!

Wednesday March 22, 2017,

2 min Read

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి బతుకు వారిది. పక్క ఫ్లాట్ లో వ్యక్తి గుండెపోటు వచ్చి కుప్పకూలినా పట్టించుకోని రోజులివి. రోడ్డుమీద నెత్తురోడుతూ కనిపించినా మనకెందుకులే అని వదిలేసే కాలమిది. ఇలాంటి స్వార్ధపూరిత సమాజంలో పరుల మంచికోసమే బతికేవాళ్లు చాలా అరుదుగా వుంటారు. అలాంటి వారిలో ఒకరు కిరణ్ అనే యువకుడు. సంపాదించాలి.. ఆస్తులు కూడబెట్టాలి.. కార్లు బంగళాలు కొనాలి.. బంగారం కూడబెట్టాలి అని మాత్రమే ఆలోచించే మ నుషులున్న నేటి సమాజంలో అవేవీ కాకుండా నలుగురు బాగుంటే అదే పదివేలు అని భావించే మంచి మనసున్న యువకుడు.

కిరణ్ పెట్రోల్ పంపులో పని చేస్తాడు. స్వార్ధం అన్న మాటలకు తన డిక్షనరీలో చోటు లేదు. మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకు అనేది అతను నమ్మిన సిద్ధాంతం. తన చుట్టూ వున్న వాళ్లు సంతోషంగా వుండాలనే మనస్తత్వం అతనిది.

image


కిరణ్ సొంతూరు కర్నాటకలోని మాంధ్య డిస్ట్రిక్ట్, అనెగోల అనే చిన్న గ్రామం. తండ్రి వ్యవసాయం చేస్తాడు. ఏపీఎస్ ఈవినింగ్ కాలేజీ లో బీకామ్ చదివిన కిరణ్... పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు. నెలకు పదివేలు సాలరీ. చేయాలనుకున్న ప్రతీ పని తన జీతం డబ్బులతోనే చేసేవాడు. ఎవరికీ ఫలానా దానికి సాయం చేయండి అచి చేయిచాచేవాడు కాదు.

కిరణ్ లో ఈ సేవాగుణం ఎలా నాటుకుందంటే.. తన పనిచేసే పెట్రోల్ బంకు దగ్గర విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతుండేవి. రోజూ ఏదో ఒకటి అయ్యేది. కళ్లముందే ఘోరం జరిగిపోయేది. ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాధితులకు సాయపడేవాడు. బండి డ్యామేజీ అయితే షెడ్డుకి తీసుకెళ్లేవాడు. మనుషులకు దెబ్బలు బాగా తాకితే ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. మామూలుగా తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేసేవాడు.

సరిగ్గా అక్కడే యాక్సిడెంట్లు కావడానికి కారణం సరైన సైన్ బోర్డుల్లేక. ఆ విషయాన్ని గమనించిన కిరణ్.. ఒకరోజు దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. ఇదీ సంగతి అని వాళ్లకు వివరించాడు. సాక్ష్యం కావాలంటే ఇదిగో చూడండని అనేక యాక్సిడెంట్ల తాలూకు ఫోటోలను వారికి చూపించాడు. మీరు ఏమీ చేయక్కర్లేదు.. సైన్ బోర్డులు నాకివ్వండి.. వాటిని నేను ఏర్పాటు చేసుకుంటాను అని రిక్వెస్ట్ చేశాడు. పోలీసులు కిరణ్ మాటలకు సానుకూలంగా స్పందించారు.

కట్ చేస్తే, నిత్యం యాక్సిడెంట్లు జరిగే టెంపుల్ రోడ్డ్ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. జీరో యాక్సిడెంట్ స్పాట్ గా తయారైంది. అదంతా కిరణ్ చలవే అని జనం నిస్సందేహంగా చెప్తారు. ఒకరోజు రాత్రిపూట భోజనం మానేసి ఈ పనిచేసినందుకు ఎంతోమంది ప్రాణాలు కాపాడినవాడయ్యాడు. కిరణ్ జోక్యం చేసుకోవడం వల్లనే సైన్ బోర్డులు వచ్చాయని చాలామంది వచ్చి థాంక్స్ చెప్పారు. అధికారులు చేయలేని పని నువ్వు చేశామని మెచ్చుకున్నారు.

తనతో పాటు పనిచేసే మరో ఆరుగురితో కలిసి మంచి పనులకు నడుం బిగించాడు. రోడ్డు ఎక్కడ పాడైనా వెంటనే అక్కడ వాలిపోయి ప్రమాద సంకేతాలు పెడతాడు. మలుపుల దగ్గర, స్పీడ్ బ్రేకర్ల దగ్గర సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తాడు. వీధిదీపాలు వెలగకపోయినా, మున్సిపాలిటీ వాళ్లకోసం వేచి చూడకుండా తనవంతు బాధ్యతగా చేస్తాడు. తెరిచి వున్న మ్యాన్ హోల్స్ విషయంలో అయితే చాలా సీరియస్ గా వుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మనం మన స్వార్ధం కోసం బతుకుతుంటే, కిరణ్ మాత్రం పరుల కోసం బతుకుతున్నాడు.

కిరణ్ నిస్వార్ధ సేవ ఆనోటా ఈనోటా బెంగళూరు అంతా తెలిసింది. అందరి నుంచి ప్రశసంలు వెల్లువలా వచ్చాయి. గత ఏడాది రైజింగ్ స్టార్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.