టీ-20 విశ్వవిజేత అంధుల క్రికెట్ జట్టుకు జయహో  

0

ప్రకాశ్ జయరామయ్య అద్భుతమైన బ్యాటింగ్, అజయ్ కుమార్ రెడ్డి స్టాండింగ్ వెరసి అంధుల క్రికెట్ లో మరోసారి విశ్వవిజేతగా నిలిచింది భారత్. ట్వంటీ 20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా రెండోసారి టైటిల్ నిలబెట్టుకుంది. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సగర్వంగా పైకెత్తింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 198 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. పాక్ ఆటగాళ్లలో బాదర్ మునీర్ ఒక్కడే ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ జమీల్ తో కలిసి 58 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జమీల్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అమీర్ ఇష్ఫాక్ 20 పరుగులు చేశాడు. వాళ్లు మినహా లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు పెద్దగా రాణించకపోవడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టాలనికి 197 పరుగులు చేసింది.

అనంతరం బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ జయరామయ్య దూకుడు ముందు పాకిస్తాన్ విలవిల్లాడింది. మరోవైపు అజయ్ కుమార్ రెడ్డి అండగా నిలిచాడు. 43 పరుగులు చేసిన అజయ్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కేతన్ పటేల్ 26 పరుగులు చేసి రిటైర్ హర్ట్ అయి వెనుదిరిగాడు. తక్కువ టైంలోనే ఇద్దరు పెవిలియన్ బాటపట్టినా జయరామయ్య దూకుడు కించిత్ తగ్గించలేదు. దున్న వెంకటేశ్ తో కలిసి 17.4 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేశాడు.

లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో ఓటమికి స్వీట్ రివెంజ్ తీర్చుకుంది టీమిండియా. పొయినసారి కూడా ఇదే పాకిస్తాన్ టీంను ఓడించి వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచిన భారత్.. ఈసారి కూడా అదే పోరాటపటిమను కనబరిచి తమకు ఎదురులేదని నిరూపించింది. టోర్నీలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఎనిమిదిట్లో గెలిచారు.

వరల్డ్ కప్ అందుకున్న అంధుల జట్టుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. వారి గెలుపు స్ఫూర్తినింపిందని ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడాశాఖామంత్రి విజయ్ గోయెల్ కూడా ఆటగాళ్లను అభినందించారు. భారత క్రీడా చరిత్రలో ఈ గెలుపు మరో అధ్యాయాన్ని లిఖించిందని విజయ్ గోయెల్ అన్నారు. 

Related Stories

Stories by team ys telugu