నిన్నటిదాకా ఆటో నడిపిన కుర్రాడు.. ఇవాళ పైలట్ అయ్యాడు..!!

నిన్నటిదాకా ఆటో నడిపిన కుర్రాడు.. ఇవాళ పైలట్ అయ్యాడు..!!

Monday January 25, 2016,

3 min Read

సాధారణంగా ఆటో నడుపుకుంటూ పొట్టపోసుకునేవారి మైండ్ సెట్ ఎలా వుంటుంది? ఇవాళ వంద రూపాయలొస్తే- ఇంకో వందొస్తే బాగుండు అనుకుంటారు! అంతకు మించి ఆశ పడరు! వేలు, లక్షల గురించి ఆలోచించ లేరు. పరిస్థితులు అలాంటివి. కానీ ఇక్కడ శ్రీకాంత్ జీవితం పూర్తిగా భిన్నం. కింద తిరిగే మూడు చక్రాల వాహనం నుంచి ఏకంగా ఆకాశంలో ఎగిరే మూడు చక్రాల వాహనం మీదకి ఎక్కాడు! సుత్తిలేకుండా సూటిగా చెప్పాలంటే నిన్నటిదాకా ఆటో నడిపిన కుర్రాడు -ఇవాళ పైలట్ అయ్యాడు.

image


కొన్ని కొన్ని వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నమ్మశక్యం కాదు. అలాంటి వాళ్ల కథలు చదువుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. శ్రీకాంత్ స్టోరీ అలాంటిదే. అణువణువూ స్ఫూర్తి నింపే అతడి ప్రయాణంలో ఎన్నో కష్టాలు. దారంతా ముళ్లూ రాళ్లూ. ఆకలి కన్నీళ్లు కలగలిసిన జీవితం.

శ్రీకాంత్ సొంతూరు నాగ్ పూర్ దగ్గర. తండ్రి సెక్యూరిటీ గార్డు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. తండ్రి సంపాదన సరిపోవడం లేదు. అందుకే శ్రీకాంత్ డెలివరీ బోయ్ గా అవతారమెత్తాడు. వేణ్నీళ్లకు తోడు చన్నీళ్లు. కొంతకాలం తర్వాత ఒక ఆటో అద్దెకు తీసుకున్నాడు. ఒకపక్క చదువుతూనే ఇంకోపక్క ఆటో నడిపేవాడు.

ఒకరోజు ఒక పార్శిల్ డెలివరీ కోసం ఎయిర్ పోర్టుకి వెళ్లాడు. వెళ్లిన వేళావిశేషమో ఏమో గానీ- ఆ రోజు అతడి జీవిత గమనాన్నే మార్చేసింది. పార్శిల్ ఎయిర్ పోర్టులో ఆఫీసర్లకు హాండోవర్ చేసిన తర్వాత, ఎందుకో అక్కడే కొద్దిసేపు ఆగిపోయాడు. అక్కడంతా తన వయసున్నవాళ్లు. తనకంటే కొంచెం పెద్దవాళ్లు. వాళ్లంతా క్యాడెట్లు అని తెలుసుకున్నాడు. వాళ్ల యూనిఫాం, టై, మెడలో టాగ్, ఆసక్తి గమనించాడు. దగ్గరగా వెళ్లి మెల్లిగా మాట కలిపాడు. నేను కూడా ఫ్లయిట్ నడపొచ్చా అని సరదాగా అడిగాడు? ఆ మాటకు వాళ్లేం ఎగతాళి చేయలేదు. పైగా ఇతని కాన్ఫిడెన్స్ నచ్చింది వాళ్లకు! ఏం.. ఎందుకు నడపొద్దు.. అన్నారు సీరియస్‌గానే . ఆటో నడిపినంత మాత్రాన విమానం నడపొద్దని రూలేమైనా ఉందా అని మళ్లీ అన్నారు. ఇతను జోక్‌గా అడిగిన ప్రశ్న.. వాళ్లు సీరియస్ గా ఇచ్చిన సమాధానం- మస్కిష్కంలో గింగిరాలు తిరిగాయి.

ఎక్కడ ఆటో- ఎక్కడ ఫ్లయిట్! ఏమన్నా సంబంధం ఉందా? విమానం ఎంత పెద్దగా ఉంటుందో కూడా తెలియదు. ఎప్పుడూ పైన చూడటమే. పైగా కుటుంబ నేపథ్యమేంటి.. ఆశపడే ఉద్యోగమేంటి? మనసులో ఒక మూల నైరాశ్యం. ఇంకో మూల తెలియని ఆత్మవిశ్వాసం. చిన్నపాటి మానసిక సంఘర్షణ.

ఎస్. నేను పైలట్ అవుతాను. శ్రీకాంత్ ఫైనల్ తీర్మానం ఇదే. ఛలో.. ఆటోవాలా టు ఫ్లయిట్ వాలా అనిపించుకోవాలనుకున్నాడు! సాధించాలన్న కసి పెరిగింది. తపన రగిలింది. గంజి తాగేవాడు బెంజిలో తిరగాలని కలలు కనొద్దా..? ఆ కలల్ని సాకారం చేసుకోవద్దా..?

ఒక కొత్త లక్ష్యం మనసులో నాటుకుంది. ఇంటర్ పరీక్షలకు గట్టిగా ప్రిపేరయ్యాడు. విమానం. కాక్‌ పిట్. రన్ వే. ఆకాశం. నక్షత్రాలు. ఎప్పుడు కలొచ్చినా ఇవే వస్తున్నాయి. డీజీసీఏ ఇచ్చే పైలెట్ స్కాలర్‌షిప్ గురించి తెలుసుకున్నాడు. ఈలోగా ఇంటర్ రిజల్ట్ వచ్చింది. పాసయ్యాడు. వెంటనే వెళ్లి మధ్యప్రదేశ్‌ లో పైలెట్ కోచింగ్ సెంటర్‌లో జాయినయ్యాడు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ- మనోడు ఇంగ్లీషులో వీక్. కానీ మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఇతని ఆరాటం వాళ్లకూ నచ్చింది. సహకరించారు. మెల్లిగా భాష కమ్యూనికేట్ చేయడం నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ పై పట్టుసాధించాడు. కమర్శియల్ పైలెట్ లైసెన్స్ చేతిలో పట్టుకుని బయటకి వస్తూనే రంగుల ప్రపంచంలో తేలిపోయాడు.

సంతోషం ఎంతోసేపు నిలవలేదు. గ్లోబల్ రెసిషన్ దెబ్బకొట్టింది. ఇటు ఏవియేషన్ మార్కెట్ కూడా నెమ్మదించింది. ఉసూరుమన్నాడు. కొద్దిరోజులు గ్యాప్. ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకని.. ఓ కార్పొరేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా చేరిపోయాడు.

సరిగ్గా రెండు నెలల తర్వాత – శ్రీకాంత్ చేతికి ఒక లెటర్ వచ్చింది. ఇండిగో ఎయిర్ లైన్స్ నుంచి. ఫస్ట్ ఆఫీసర్ పోస్టు. వచ్చి జాయిన్ అవమని దాని సారాంశం. చదువుతున్నంత సేపు ధారగా కన్నీళ్లు. సంతోషంతో గొంతు మూగబోయింది. మాటలు రావడం లేదు. ఆటో చక్రాలు ఎగిరెళ్లి ఒక్కసారిగా విమానానికి అతుక్కున్నాయి.

నిన్నటిదాకా మూడు చక్రాల వాహనం మీద కూర్చుని పేదరికాన్ని ఎలా జయించాలా అని మథనపడ్డాడు. ఇప్పుడు కూడా అవే మూడు చక్రాల వాహనం మీద కూచుని ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారుగా. శ్రీకాంత్ చేసిందదే.

థింక్ చేంజ్ ఇండియా శ్రీకాంత్‌ని మనస్పూర్తిగా అభినందిస్తోంది. ఇంకా అతను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తోంది.