ప్రయత్నమే గెలుపునకు మొదటి అడుగు.. ఇదే స్టార్టప్ సక్సెస్ మంత్ర

ప్రయత్నమే గెలుపునకు మొదటి అడుగు.. ఇదే స్టార్టప్ సక్సెస్ మంత్ర

Friday March 11, 2016,

4 min Read


"మనం ఏ పనిచేసినా కొందరు ఎగతాళి చేస్తారు. కొంతకాలం వ్యతిరేకిస్తారు. చివరగా నిన్ను అంగీకరిస్తారు..." ఇది వివేకానందని సూక్తి

కానీ ఈ ప్రాసెస్ లో మొదటి అడుగు- ప్రయత్నం. అది చేయకపోతే యుద్ధానికి వెళ్లకుండానే ఓడిపోయినట్లు. ఆ...మనవల్ల అవుతుందా..? చాలా మంది ఉన్నారు...? పెద్ద పెద్ద వాళ్లే చేతులెత్తేశారు..? మనమెంత అనకుంటే ఓటమికి బ్రాండ్ అంబాసిడర్ గానే మిగిలిపోతాం. అట్లీస్ట్ ప్రయత్నం చేసి ఓడిపోతే.. కనీసం అనుభవమైనా వస్తుంది.

స్టార్టప్ ప్రపంచంలో అనుభవానికి ఇంకా ప్రాధాన్యం ఉంది. సరైన సమయంలో పని ప్రారంభిస్తే తిరుగే ఉండదు. రేపు మాపు అంటూ వాయిదా వేసుకుంటే ఇంకెవరో దాన్ని ప్రారంభించేసి ఉంటారు. అప్పుడు తీరిగ్గా అయ్యో నేను చేద్దామనుకున్నానే అని నాలుక్కరుచుకోవాలి. అప్పుడు తీరిగ్గా బాధపడినా టైం వేస్టు తప్ప ప్రయోజనం ఉండదు. చాలా మందికి ఉత్సాహం ఉన్నా.. మంచి కెరీర్ ను వదిలేసి ఇప్పుడు స్టార్టప్ వెంట పరుగెత్తడం అవసరం అనుకుంటారు.

ఇలాంటి డొలాయమానాలపై "లింక్ స్ట్రీట్" ఫౌండర్ అరుణ్ ముత్తు కుమార్ తన అనుభవాలను, ఆలోచనలను, స్టార్టప్ ప్రపంచంలో పరిస్థితులను.. యువర్ స్టోరీతో ప్రత్యేకంగా పంచుకున్నారు.. 

ఎడ్యుకేషన్ స్టార్టప్ "లింక్ స్ట్రీట్" సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలకు సేవలు అందిస్తోంది.

image


సరైన సమయం అంటే ఎప్పుడు ...?

ఆలోచనలను ఆచరణలోకి పెట్టడానికి సరైన సమయం ఎప్పుడు..? ఇది ప్రతి ఒక్క ఔత్సాహికునికి వచ్చే ప్రశ్న. దీనికి అరుణ్ సమాధానం. "నిన్న.. .అయితే ఈరోజు.. అంతకు మించిన మంచి రోజు". ఏదైనా చేద్దాం.. అని మనసులో తట్టిన తర్వాత రోజూ ఎన్నో ఆలోచనలు వస్తూంటాయి. అయితే ఏదో ఒక రోజు.. "నా ఈ ఆలోచన అమల్లో పెడితే ప్రపంచాన్ని మార్చొచ్చు" అని గట్టిగా అనిపిస్తుంది. అప్పుడే ఇంకేం ఆలోచించకూడదు. కార్యాచరణలోకి దిగిపోవాలి. మంచి రోజులు, ముహుర్తాలంటూ సమయం వృధా చేసుకోవద్దు. పని ప్రారంభించిన సమయమే మంచి ముహుర్తం. అప్పట్నుంచే స్టార్టప్ సముద్రంలో ఈది అంట్రప్రెన్యూర్ గా బయటకు రావడానికి సర్వశక్తులు ఒడ్డడానికి సిద్ధపడాలి.

సమస్యలను అధిగమించడం..!

ఒక స్టార్టప్ ప్రారంభించాలనుకున్నప్పుడు మన మనసు దేనిపైన ఉన్నది అన్నది గుర్తించగలగడం ప్రధానాంశం. చిన్న సమస్య పెద్ద కల్లోలాన్ని సృష్టించగలదు. కానీ సమస్యనే అవకాశాలుగా మార్చుకుంటే విజయం వెతుక్కుంటూ వస్తుంది. "లింక్ స్ట్రీట్" ప్రారంభించిన కొత్తలో ఎడ్యుకేషన్ రంగంలో టెక్నాలజీని పరిచయం చేయాలనేది మా ప్లాన్. అందుకు మొదటగా మేం స్కూళ్లనే టార్గెట్ గా పెట్టుకున్నాం. మేము రెడీ చేసిన సేవలు అన్నీ స్కూళ్లకు కరెక్ట్ గా సరిపోతాయి. కానీ ఆయా స్కూళ్లకు తగినంతగా పే చేసే సామర్థ్యం లేదు. పర్వాలేదని సేవలు కొనసాగిస్తే నష్టాల్లోకూరుకుపోతాం. అప్పుడు వెంటనే మా బృందం అంతా పెద్ద కాలేజీల్నీ, ఉన్నత విద్యాసంస్థలకు తగ్గట్లుగా సేవలను మార్పు చేశాం. నిర్ణయం తీసుకోవడంలోనే అంతా ఉంది. ముందుగా మీరు బిజినెస్ చేస్తున్నారనే విషయాన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. మీ సేవకు తగ్గ ప్రతిఫలం కచ్చితంగా ఆశించండి.

గడ్డు పరిస్థితులకు సిద్ధం కండి..!

స్టార్టప్ ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడి రావాలి. "లింక్ స్ట్రీట్" స్టార్టప్ కొన్నాళ్ల పాటు తీవ్ర సంక్షోభంలో నడిచింది. అందరం మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొన్నాం. ఆశావాహ దృక్పథంతో పనిచేశాం. మెల్లగా పెట్టుబడులు వచ్చాయి. మరిన్ని సర్వీసులు పెంచాం. ఆదాయం రెండింతలు అయింది. క్లైంట్ బేస్ పెరిగింది. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సి ఏమిటంటే.. ఏం జరిగినా మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. ఎలాంటి ఒత్తిడిలోనూ కుటుంబ జీవితంపై దాని ప్రభావం పడనీయకూడదు. అంట్రపెన్యూర్ గా మారాలనుకున్నప్పుడే కుటుంబాన్ని కూడా అక్కడ ఉండే పరిస్థితులకు అనుగుణంగా మార్చే ప్రయత్నం చేయాలి.

అంచనాలు వర్సెస్ వాస్తవాలు

మంచి కెరీర్ ను మధ్యలో వదిలిపెట్టి కొత్త ఐడియాతో స్టార్టప్ ప్రారంభిస్తున్నప్పుడు అందరి దృష్టి మనమీదే ఉంటుంది. చాలా అంచనాలు పెరిగిపోతాయి. వ్యాపార ప్రపంచంలో కొత్త రాక్ స్టార్లుగా వెలిగిపోతారు. అయితే అంట్రప్రెన్యూర్ షిప్ అనేది సరదాగా వారాంతాల్లోనో, వేసవి సెలవుల్లో ఆడుకునే జాలీ గేమ్ కాదు. ఇలాంటి మైండ్ తో అసలు స్టార్టప్ రంగంలోకి అడుగు పెట్టకూడదు. వేగంగా డబ్బులు సంపాదించాలనో... నా సహజ సిద్దంగా నేను పనిచేసుకుంటాననో అనుకుంటే మొదటికే మోసం రావచ్చు. ఇక్కడ నిలబడటానికి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అనేక అంశాలను డీల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎవరెస్ట్ అంత ఎదుగుతాం.. కానీ ఆ క్షణమే పాతాళంలోకి పడిపోతాం. గ్యారెంటీ లేదు. అందుకే అంచనాలకు... వాస్తవాలకు మధ్య తేడాను గుర్తించి మసలుకోవాలి.

ప్రయత్నించు.. ఫలితం ఆశించకు..

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు.. ప్రయత్నం చేయడం వరకే నీ పని.. ఫలితం ఆశించకూడదు. వచ్చేదంతా బోనస్ గానే భావించాలి. ఒక్క స్టార్టప్ సక్సెస్ అయిందంటే కొన్ని వందల స్టార్టప్ లు ఫెయిలయి ఉంటాయనే విషయాన్ని మర్చిపోవద్దు. గెలుపు, ఓటములను ఒకే ఒక చిన్న అంశం ప్రభావితం చేస్తుంది. చేయాల్సిన 20 పనుల్లో 19 పర్ ఫెక్ట్ గా చేసి... ఒక్కదాన్ని ...ఆ ఒక్కటే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే మొత్తానికే మోసం రావచ్చు. ఇక్కడ కావాల్సింది చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడమే. ఒకసారి ప్రారంభించిన తర్వాత పరుగెడుతూనే ఉండాలి. వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా రాకపోవచ్చు.

"లింక్ స్ట్ర్టీట్ ప్రారంభించిన తర్వాత ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తిన్నాం. ప్రతిసారీ ఓ జీవితానుభవం ఎదురయింది. మళ్లీ ఓ కొత్త జీవితంలా ప్రారంభించాం. కానీ ఎప్పుడు ఆగిపోవాలని అనుకోలేదు. ఉద్వేగం, బాధ , కోపం, ఆనందం, ఫ్రస్ట్రేషన్ ఇలా అన్నింటినీ నాతో పాటు నా లింక్ స్ట్రీట్ బృందం అంతా చవి చూసింది" అరుణ్ ముత్తుకుమార్ 

ఏదైనా రేసులో పాల్గొంటున్నప్పుడు వందలు, వేలల్లో పోటీదారులు ఉంటారు. అయితే అందులోఒకరే విజేతగా నిలుస్తారు. అయినా అందరూ గెలుస్తామనే నమ్మకంతోనే పరుగు ప్రారంభిస్తారు. వారిలో ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసేవాళ్లూ ఉంటారు.. అప్పటికప్పుడు రెడీ అయి వచ్చేవారూ ఉంటారు. అయితే ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం. అంట్రప్రెన్యూర్ షిప్ అనేది రోజువారీ పోరాటం లాంటిది. సుదీర్ఘంగా, అత్యంత క్లిష్టమైన పోరాటం చేయాల్సి ఉంటుంది. ఫలితం ఎలాంటిదైనా నిబ్బరంగా అంగీకరించగలిగే స్థైర్యంతో అడుగుపెట్టాలి. అంట్రపెన్యూర్ గా మారడం అనేది భయం కలిగించే ధ్రిల్లింగ్ రైడింగ్ లాంటిది. ఒక్కసారి రుచి చూస్తే ఆగరు. మళ్లీ మళ్లీ ట్రై చేయాలనిపిస్తుంది.