తనకు వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదని 9,400 కి.మీ. తిరిగాడు..

తనకు వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదని 9,400 కి.మీ. తిరిగాడు..

Tuesday August 22, 2017,

2 min Read

ఇండియాలో ప్రతీ పదిమందిలో ఒకరు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. దీనిక్కారణం.. దాతలు లేకపోడం ఒకటైతే.. దానం ఇవ్వాలని ఉన్నా సరైన అవగాహన లేకపోవడం మరో రీజన్. కిడ్నీ ఒక్కటనే కాదు.. అవయవదానంపై చాలామందికి చాలా అపోహలున్నాయి. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ విజయ్ అనే ప్రముఖ డాన్సర్ పల్లెపల్లెనూ చుట్టివచ్చాడు.

image


తనదాకా వస్తేగానీ సాధకబాధకాలేంటో తెలియవు. విజయ్ అనుభవం కూడా అలాంటిదే. 2013లో తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు. మూడేళ్లపాటు డయాలసిస్. అదృష్టం కొద్దీ 2016లో దాత దొరికాడు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగింది. ఆ మూడేళ్లు ఎంత నరకం అనుభవించాడో తనకి మాత్రమే తెలుసు. డాక్టర్లు చేతులెత్తేసే టైంలో లక్కీగా డోనర్ దొరికాడు.

తనకి వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదని భావించాడు విజయ్. తను డాన్సులో గిన్నిస్ రికార్డు హోల్డర్ అయినప్పటికీ కిడ్నీ దాత దొరక్క యాతన అనుభవించాడు. అలాంటిది సామాన్యుల పరిస్థితి ఏంటని ఆలోచించాడు?

అందుకే విజయ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అవయవం ఏదైనా కానీ, దాతలకున్న సందేహాలు తీర్చడమే కర్తవ్యంగా పెట్టుకున్నాడు. దేశమంతా అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టాడు. అందులో భాగంగా తమిళనాడు నుంచి లడఖ్ దాకా మొత్తం 9,400 కిలోమీటర్లు ప్రయాణించాడు. కోటి మందిని చైతన్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని బయల్దేరాడు. ఆగిన ప్రతీచోటా తను ఎదుర్కొన్న కష్టాలను వివరించాడు. వారితో పంచుకున్నాడు. ఉత్తరాది కంటే దక్షిణాదిన ఎక్కువ చైతన్యం ఉందని తన ప్రయాణంలో గమనించాడు.

హోప్ అనే ఫౌండేషన్ ద్వారా 13 నగరాలను చుట్టివచ్చాడు. 17 పట్టణాలు, 18 గ్రామాల్లో 40 రోజులపాటు తిరిగాడు. విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, కార్పొరేట్, ప్రభుత్వ సంస్థల్లో ఎక్కువ శాతం జనాలను కలిశాడు. విజయ్ మాటలు ప్రతీచోటా మంత్రంలా పనిచేశాయి. ఎవరికి వారు స్వచ్ఛందంగా అవయవదానంపై ప్రతిన బూనారు.

మూడేళ్లు కిడ్నీ సమస్యతో నరకం చూసి, తను అనుభవించిన కష్టం మరెవరికీ రాకూడదని విజయ్ చేసిన ప్రయత్నానికి అంతటా మంచి మద్దతు దొరికింది. తను చేస్తున్న ప్రయత్నానికి మంచి నమ్మకం దొరికందని విజయ్ అంటున్నాడు.