పనికిరాదనుకున్న చెక్కను పసిడిలా మార్చాడు !

ఓల్డ్ వుడ్ న్యూ యూజ్ పాజిటివ్ చేంజ్చెక్కలతో అంతర్జాతీయ స్థాయి వ్యాపారంఉష్ణమండల అడవుల పరిరక్షణలోనూ భాగస్వామ్యం

పనికిరాదనుకున్న చెక్కను పసిడిలా మార్చాడు !

Wednesday July 15, 2015,

5 min Read

ఆయన పేరు ''మిష్టర్ గార్బేజ్ ఉడ్''. అంటే పనికిరాని చెక్క అని అర్ధం. చెత్తబుట్టలో పడేసిన కొన్ని వస్తువులను అత్యంత విలువైనవిగా పరిగణించటం వల్లే ఆయనకు ఆ పేరు వచ్చింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. మరింతగా, మరింతగా ఆ చెక్కల చెత్తను పోగుచేశారు. చివరికి దాన్నుంచే ప్రపంచ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు. అది చెత్త కాదని... బంగారమని నిరూపిస్తున్నారు. ఒకనాడు ఆయన్ను గార్బేజ్ ఉడ్ అన్నవారే చివరకు ఆయన బంగారాన్ని పోగుచేస్తున్నారని నమ్మారు. ఆయనే టిమ్ ఒ బ్రీన్. ఆయన స్థాపించన చెక్కల వ్యాపారమే ప్రపంచ పేరెన్నిక గన్న ట్రాపికల్ సాల్వేజ్.

1997లో డిగ్రీ చదువు పూర్తిచేసుకున్న టిమ్ ఒ బ్రీన్....సరదాగా ఇండోనేషియాలోని లామ్ బాక్ దీవికి వెళ్లటం ఆయన జీవితాన్నే మార్చివేసింది. ఆ దీవుల అందం బ్రీన్‌ను కట్టిపడేసినప్పటికీ....ఆయన అక్కడే స్థిరపడేలా చేసిన కారణం మాత్రం పనికిరాని చెక్కలుగా స్థానికులు భావించిన అద్భుత కళాఖండాలే. ప్రకృతిని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న ఆయన దృష్టికి స్థానికులు చేస్తున్న ఓ పని విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసింది. అందమైన, అద్భుతమైన చెక్కతో తయారయి కళాత్మకంగా ఉన్న స్తంభాలను తీసివేసి వాటి స్థానంలో కొత్తగా కాంక్రీటువి నిర్మించుకుంటున్నారు స్థానికులు. ఆ చెక్క నిర్మాణాలను ఎందుకూ పనికిరానివిగా భావించి పారవెయ్యటమో లేదంటే తగలబెట్టటమే చేస్తున్నారు.

ఏం చేయాలో తెలియకుండానే చెక్కను కొన్నారు

అత్యంత నాణ్యమయిన ఆ చెక్కను, అంత పెద్ద ఎత్తున స్థానికులు ధ్వంసం చేయటాన్ని, వృథాగా పారవేయటాన్ని టిమ్ తట్టుకోలేకపోయారు. 18 అడుగుల వ్యాసం, ఐదు అడుగుల పొడవుతో కళాఖండాలుగా తీర్చిదిద్ది ఉన్న ఆ చెక్కలను ఏం చేయాలో ఆ క్షణం ఆయనకు తెలియకపోయినప్పటికీ...అభిరుచి ఉన్న విలక్షణమైన వ్యాపారవేత్తలా తక్షణమే రంగంలోకి దిగారు. వేర్ హౌస్ ఒకటి అద్దెకు తీసుకుని స్థానికుల నుంచి ఆ చెక్కను కొనటం మొదలుపెట్టారు.

కొన్ని రోజులకే చెక్క నిల్వలు పేరుకుపోయాయి. అప్పటికి తన వెంచర్‌ను ఎక్కడ ప్రారంభించాలనేదానిపై ఆయనకు కాస్త స్పష్టత వచ్చింది. స్థానిక కార్పెంటర్లను పనిలోకి తీసుకుని తాను చేయదలచుకున్నది వాళ్లకు వివరించారు టిమ్. అత్యంత విలువైన ఆ చెక్కను అపురూపమైన కళాకృతులుగా తీర్చిదిద్దటం, లేదా ఫర్నీచర్‌గా మార్చి తిరిగి అమ్మకానికి పెట్టటం ఆయన ఉద్దేశం.

కార్పెంటర్లూ చీదరించుకున్నారు

ఆ చెక్కను ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో టిమ్ కార్పెంటర్లకు ఎంతో వివరంగా చెప్పినప్పటికీ....ఒక నెల గడిచేటప్పటికీ ఆయన దగ్గర పనిచేస్తున్న స్థానిక కార్పెంటర్లు అందరూ ఆయన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. పనికిరాని చెత్తగా తాము భావించిన ఆ చెక్కల కోసం తమ వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించటం స్థానిక కార్పెంటర్లు అవమానంగా భావించారు. ఇదే మాట ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులంతా ఆయన్ను తమ భాషలో 'పాక్ కయూ సాంపా' అని పిలవటం మొదలుపెట్టారు. అంటే దానర్థం మిష్టర్ గార్బేజ్ ఉడ్ అని.

ఇలా అందరూ ఆయన్ను ఎగతాళి చేస్తూ... అపఖ్యాతి పెరిగిపోయినప్పటికీ టిమ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ చెక్కలు చాలా విలువైనవని స్థానిక కార్పెంటర్లవద్ద , హస్తకళానిపుణుల వద్ద నిరూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తన వెంచర్‌కు సంబంధించి ఇతర సవాళ్లను ఎదర్కోవటమూ ప్రారంభించారు.

టిమ్ ఒ బ్రీన్‌

టిమ్ ఒ బ్రీన్‌


చెదను తట్టుకునే చెక్క

ఆయన సేకరించన చెక్కలు అన్నీ ఒకేరకానికి చెందినవి కావు. వాటి తయారీలో అనేక రకాలను ఉపయోగించారు. చెక్క కళాకృతులు అందంగాకనిపించేలా తీర్చిదిద్దేందుకు, ఎక్కువగా అమ్ముడుపోయేలా చేసేందుకు, ఫర్నీచర్‌లా మార్చేందుకు ఎన్నో వనరులు, సృజనాత్మకత కావాలి. అంతేకాకుండా మామిడి, డ్యురయిన్ వంటి వాటిని ఇతర రకాల చెక్కలతో కలిపి తయారుచేసినపుడు...అవి క్రిమికీటకాలకు మరింత నెలవుగా మారతాయి. పొగపెట్టటం ద్వారా చెక్కలను తినివేసే క్రిమికీటకాలను పూర్తిస్థాయిలో నిరోధించగలగటం సాధ్యం కావటం లేదని ఇప్పటికే రుజువయింది.

టిమ్ తన వ్యాపార నైపుణ్యాన్ని ఉపయోగించి...తన బృందంతో కలిసి మరింత ప్రభావవంతంగా పనిచేసే క్రిమిసంహారకాలను తయారుచేశారు. వాటిని ఉపయోగించటం తేలికే కాకుండా....వాటితో ఎలాంటి ప్రమాదం లేదు. దీంతో ఆయనకు తాను చేయదలచుకున్న పనిపై అపారమైన విశ్వాసం కలిగింది. అధిగమించలేని సమస్యగా భావించే దాన్నుంచే తేలిగ్గా బయటపడటంతో తాను అత్యంత నాణ్యమైన ఉత్పత్తిని అందించగలనని టిమ్ తెలుసుకున్నారు. అలా ఆవిర్భవించిందే ట్రాపికల్ సాల్వేజ్. ఓల్డ్ ఉడ్, న్యూ యూజ్, పాజిటివ్ చేంజ్ అన్నది ఈ సంస్థ క్యాప్షన్. పాత చెక్కను కొత్తగా ఉపయోగించి కొంగొత్తగా తయారుచేయటమే ట్రాపికల్ సాల్వేజ్ చేస్తున్న పని.

ట్రాపిక‌ల్ సాల్వేజ్ లోగో

ట్రాపిక‌ల్ సాల్వేజ్ లోగో


భూమిలో కూరుకున్న చెట్లు వందల ఏళ్లు పటిష్టంగా ఎలా ఉంటుంది ?

తాను చేస్తున్న పనిపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ టిమ్ చెక్క సరఫరా గురించి ఆందోళన చెందారు. దీన్ని మంచి వ్యాపారంగా తీర్చిదిద్దాలంటే ఇది సరిపోదని నిర్ణయించుకున్నారు.

వర్షాకాలంలో వచ్చే గాలులు వల్ల కొన్ని చెట్లు వేళ్లతో సహా కొట్టుకుపోయి నదుల్లో పడుతుంటాయి. అనేక సంవత్సరాల క్రితం సంభవించిన రకరకాల ఉత్పాతాల వల్ల ఆ చెట్లన్నీ మరింత లోపలకి కూరుకుపోతాయి. అంతేకాకుండా అనేక ఏళ్ల క్రితం అక్రమంగా కొట్టివేసే చెట్ల దుంగలు కూడా నదీ అడుగు భాగాన పడిపోతాయి.

చెక్క ఇంత సమృద్ధిగా లభించినప్పటికీ...ట్రాపికల్ సాల్వేజ్ స్థాపించటం గురించి ...దాని స్థిరత్వం గురించి టిమ్ ఆందోళన తొలగిపోలేదు. అప్పుడు ఆయనకు వర్షాకాలంలో చేసిన ప్రయాణాలు గుర్తుకువచ్చాయి. తన ప్రయాణాల్లో ఆయనకు తరచుగా పంట పొలాల మధ్యలోనుంచి చెట్ల మొద్దులు పైకి కనిపించటం గుర్తుకువచ్చింది. చెట్ల మొద్దులు అక్కడకు ఎలా వచ్చాయనేది ఆయనకు తెలుసుకోవాలనిపించింది. వాటి గురించి పరిశీలించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా గమనించిన ఆయనకు బురద నేలలు, వాటిలో పూడుకుపోయిన చెక్కలు కనిపించాయి. వందల ఏళ్ల క్రితం సంభవించిన ఉత్పాతాల వల్ల అవి అలా బురదలో భూస్థాపితమయ్యాయి.

ఆకస్మికంగా భూమిలో సంభవించే విధ్వంసకర మార్పుల వల్ల ఉష్ణమండల అడవుల్లో భారీ వృక్షాలు సైతం ఆశ్చర్యకరమైన మార్పులకు గురవుతాయి. చెట్లు కూలిపోతాయి. దూరంగా పడిపోతాయి. ఆ చెట్లలో కొన్ని కూలిపోయేముందే అత్యంత పురాతనమైనవి, కూలిపోయి వందల ఏళ్లు కావటంతో అవి భూమి లోపలా మరింత పురాతనమైనవి. అలా అనేక చెట్లు భూస్థాపితమయ్యాయి.

తడి ఎక్కువగా ఉండే బురద నేలలో ఆక్సిజన్ వ్యాపించకపోవటం వల్ల ఆ చెట్లు చెక్కుచెదరకుండా ఉండటమే కాదు..బురదలోని లవణాలను పీల్చుకుని అవి మరింత బలంగా, శక్తివంతంగా తయారవుతాయి. తన వ్యాపారాన్ని స్థిరపరచాలనుకుంటున్న టిమ్‌కు ఉష్ణమండల అడవుల వల్ల కలిగే ఉపయోగం అర్ధమయింది. చెట్లు కూరుకుపోయిన బురదనేలలను ఆయన బంగారంగా భావించారు.

అడవుల రక్షణే లక్ష్యం

ఇది జరిగిన 18 సంవత్సరాల తరువాత ఉత్తర అమెరికా, యూరోప్ దేశాలకు టిమ్ అమ్మకాలు జరుపుతున్నారు. సంస్థలో 80 మంది స్థానిక ఉద్యోగులున్నారు. అంటే పనికిరాని చెత్తగా అందరూ భావించిన చెక్కలతో ఆయన ప్రపంచ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు. తను ఈ వ్యాపారం ప్రారంభించటానికి స్ఫూర్తి కలిగించిన ఉష్ణమండల అడవులను పరిరక్షించాలన్న తన లక్ష్యానికి టిమ్ ఇంకా కట్టుబడే ఉన్నారు.

ఇండోనేషియాలో అడవులను పరిరక్షించటం, తిరిగి అడవుల పెంపకం, విద్య వంటి వాటి కోసం టిమ్ తన వ్యాపారంలోని నిధులను వెచ్చించి జెపారా ఫారెస్ట్ కన్జర్వెన్సీ అనే సంస్థలో భాగస్వామి అయ్యారు. అడవుల పరిరక్షణ, పెంపకం ఇప్పటికే మొదలయింది. స్థానిక అడవుల్లో ఆయా ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన అనేక రకాల మొక్కలు నాటారు. ఇప్పటిదాకా 35 రకాలకు చెందిన 500లకు పైగా మొక్కలు నాటారు.

ఉష్ణమండల అడవుల పరిరక్షణ తక్షణావశ్యకత గురించి అనేకమందిలో అవగాహన పెరుగుతున్నప్పటికీ...మరికొంత అవగాహన కావాలని టిమ్ భావిస్తున్నారు. ఇందుకోసమే ఇటీవల ఆయన www.switzerlandtropicalforest.com చాలెంజ్ మొదలుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల అడవులు దట్టంగా విస్తరించి ఉన్న 75 దేశాల్లో జీవ వైవిధ్యానికి సానుకూల పరిస్థితులు ఉండేలా లాభదాయాక మార్గాలను ఈ చాలెంజ్ అన్వేషిస్తుంది.

స్థానిక జాతుల్లో అవగాహన కలిగించటానికి ఇలాంటి చర్యలు అద్భుతంగా పనిచేస్తాయని. దీనివల్ల కొన్ని వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని టిమ్ చెప్పారు.

ఈ సవాలును స్వీకరించిన వ్యక్తిగా టిమ్ దీనిగురంచి ఎంతో ఆతృత చెందారు. ట్రాపికల్ సాల్వేజ్‌తో ఆయన బహుశా వందలు, వేలల్లో చెట్లను రక్షించారు. ఉష్ణమండల అడవులను పరిరక్షించటాన్ని లాభదాయక వ్యాపారంగా మార్చుకునే ఇతర పారిశ్రామికవేత్తలకు సహాయం చేయటంలోనూ లాభం ఉంటుందని టిమ్ కు తెలుసు.

ఉష్ణమండల అడవుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ...ఎంతో ఆశతో ప్రతిరోజూ నిద్రలేస్తానన్నటిమ్ తన కార్యాచరణ ద్వారా తన ఆశయాన్ని మరింత దృఢపరుచుకుంటానని చెప్పారు.

పనికిరాని చెత్తగా భావించిన చెక్కలతో అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన టిమ్ అంతటితో ఆగకుండా అడవుల పరిరక్షణ అనే సామాజిక బాధ్యతనూ ఓ దీక్షగా నెరవేరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.