20 ఏళ్ల వయసులోనే ఆరున్నర లక్షల డాలర్లు సమీకరించిన సుచీ పాండ్యా

20 ఏళ్ల వయసులోనే ఆరున్నర లక్షల డాలర్లు సమీకరించిన సుచీ పాండ్యా

Thursday October 22, 2015,

4 min Read

భారత దేశంలో 20ల్లో వయసు ఉన్న యువతి ఎవరైనా సరే.. ఓ వెంచర్ కోసం నిధులు సమీకరించడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే.. అలాంటి మహిళలకు సాధారణంగా ఒకే ప్రశ్న ఎదురవుతుంది. 'నీకు పెళ్లయ్యాకో, పిల్లలు పుట్టాకో.. ఈ వ్యాపారం పరిస్థితి ఏంటి ? '.

"ఇన్వెస్టర్లు నావైపు కాదు.. నా బిజినెస్ పైనే దృష్టి పెడతారనే విషయం నాకు అప్పుడే అర్ధమైంది. నా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాననే నమ్మకాన్ని నాపై ఉంచిన పెట్టుబడిదారులను సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిసింది "అంటారు పిపా ప్లస్ బెల్లా వ్యవస్థాపకురాలు సుచీ పాండ్యా. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లయన్ రాక్ కేపిటల్, రాజేష్ సహానే, రూపానాథ్‌ల నుంచి తాజాగా 6.5 లక్షల యూఎస్ డాలర్లను సుచీ సమీకరించగలిగారు. పిపా+బెల్లా సలహాదారుల్లో ప్రస్తుతం జీఎస్ఎఫ్ ఇండియా వ్యవస్థాపకుడు రాజేష్ సాహ్‌నే, ఫ్లీకల్టర్.కాం మాజీ సీఈఓ సుజల్‌ షా కూడా ఉన్నారు.

సుచీ పాండ్యా

సుచీ పాండ్యా


మహిళల ఫ్యాషన్ జ్యూవెలరీకి సంబంధించిన కలెక్షన్స్‌ను సరసమైన ధరలో అందించడం పిపా+బెల్లా ప్రత్యేకత. ఈ పేరుకు వినూత్నంగా ఉండడమే కాదు.. దీనికి చాలా అంతరార్ధం కూడా ఉంది. స్పానిష్ భాషలో విస్తృతంగా ఉపయోగించే పదం పిపా. అంటే సాహసాలు చేసే వ్యక్తిత్వం అని అర్ధం . బెల్లా అనేది ఇటాలియన్ పదం. దీనికి ప్రాచీనమైన, సుందరమైన అని అర్ధం. మహిళలు ఈ రెండింటిలో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ చెందినవారు మాత్రమే ఉంటారు. ఈ రెండు రకాలను బ్యాలెన్స్ చేసేలా తమ జ్యూవెలరీ కలెక్షన్ ఉండాలని భావించడంతో పిపా+బెల్లా అనే బ్రాండ్ నేమ్ ఎంచుకున్నానంటారు సుచీ.

తాజాగా సమీకరించిన నిధులతో.. విస్తరణ ప్రణాళికలు చేపట్టబోతున్నారు సుచీ పాండ్యా. నియమకాలు, టెక్నాలజీ ప్లాట్‌ఫాం ఏర్పాటు, కస్టమర్ల పెంపు వంటి కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నారు.

ఈ స్టార్టప్ ముంబైలోనే ప్రారంభమైనా.. ప్రస్తుతం సింగపూర్‌లోనూ సత్తా చాటుతోంది. " ప్రస్తుతం మేం ఇండియాపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. ఇక్కడి మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. అయితే మరికొన్ని దేశాలకూ కార్యకలాపాలు విస్తరించడం ద్వారా అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదగాలన్నది మా ఆలోచన. ఓ ఏడాది వరకూ మాత్రం భారత్‌పైనే ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తాం"అన్నారు సుచీ.

ఆభరణాలకు దారేది ?

జ్యూవెలరీ వ్యాపారం సుచీ రక్తంలోనే ఉంది. అదే ఆమెను ఈ రంగంలోకి తీసుకొచ్చిందని చెప్పాలి. ముంబైకి చెందిన ఆభరణాల వ్యాపారానికి చెందిన కుటుంబంలో జన్మించారామె. రాత్రి భోజన సమయంలో ఎక్కువగా వ్యాపార అభివృద్ధి పైనే చర్చలు నడిచేవి. కొత్త వ్యాపారం, మార్కెట్లపై మాటలు దొర్లేవి. దీంతో ఆమెకు సహజంగానే ఈ రంగంపై మక్కువ పెరిగింది.

న్యూయార్క్‌కు యూనివర్సిటీకి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మార్కెటింగ్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నపుడు సుచీ నేర్చుకున్న పాఠాలు.. వ్యాపారంలో ఎంతో కీలకంగా ఉపయోగపడ్డాయి.

అక్కడి నుంచి ముంబై తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారంలోకే దిగారు సుచీ. “ ప్రోడక్ట్ ఆధారిత విక్రయాలకు సంబంధించిన వ్యాపారంలో సప్లై వ్యవస్థ, ధరల నిర్ణయం వంటి అంశాలను ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశం ఇక్కడే లభించింద”ని చెప్పారు సుచీ.

2010లో ఎంబిఏ విద్యాభ్యాసం కోసం వార్టన్ స్కూల్‌లో చేరారు సుచీ. “పిపా+బెల్లాకు ఆలోచనను ఇక్కడే పదును పెట్టాను. నవతరం టెక్నాలజీ ఆధారిత వ్యాపార ప్రారంభం, నిర్వహణపై ఇక్కడే ఆలోచన ప్రారంభించానం”టున్నారు సుచీ. వార్టన్ స్కూల్‌లో ఉండగానే.. 8వారాల్లో వ్యాపార ప్రణాళిక రూపకల్పన, ప్రారంభం (ఐడియా, ఎగ్జిక్యూషన్) అనే 8వారాల క్లాస్‌కు అటెండ్ అయ్యారామె. దీనికి సంబంధించిన సమాచారం మరింతగా తెలుసుకునేందుకు ఫైనాన్స్, అకౌంటింగ్ క్లాసులకు ప్రత్యేకంగా హాజరు కావాల్సి వచ్చింది. వీటితోపాటు కోడింగ్ కూడా అటెండ్ అయ్యారు. 

తనకు పరిచయం, అనుభవం ఉన్న రంగాలే కాకుండా... ఈ విభాగాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు విస్తృత అవకాశాలున్నాయని భావించారు సుచీ. “ ఆభరణాలను చూడడంతోనే కొనుగోలు చేయాలని మనసు లాగుతుంది. ట్రయల్ చూసుకోవడానికి, అప్పటికప్పుడే ధరించడానికి అనుకూలంగా ఉండడమే ఇందుకు కారణం. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యాషన్‌ జ్యూవెలరీకి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం యువత లేటెస్ట్ డిజైన్లు, ప్రత్యేకంగా కనిపించే మోడల్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మంచి నాణ్యతతో అందుబాటు ధరలో ఉండేవాటికి మొగ్గు చూపుతున్నారు. బంగారం, వజ్రాల మాదిరిగా ధరల ఆధారంగా డిమాండ్ మారే పరిస్థితి వీటికి లేదు"అంటున్నారు సుచీ పాండ్యా.

వినూత్నతే ఆయుధం

ఈ రంగంలో అనేక కంపెనీలు ఇప్పటికే ఉన్నా.. వినూత్నమైనన డిజైన్లు తమ అభివృద్ధికి తోడ్పడతాయంటారు సుచీ. “ప్రతీ వారం 100కి పైగా కొత్త డిజైన్లను జత చేస్తున్నాం. కోరుకున్న డిజైన్లను అందించే సెక్షన్‌ను విస్తృతపరచుతున్నాం. దీనిద్వారా తమకు కావాల్సిన, నచ్చిన డిజైన్లను కస్టమర్లు కోరుకుని పొందచ్చు”.


image


12మంది టీం ఉన్న పిపా+బెల్లా.. ఆవిష్కరణలపై ఆధారపడ్డ బిజినెస్ మోడల్. టెక్నాలజీ ఆధారిత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉన్న ఈ కంపెనీ.. కస్టమర్లు కోరుకున్న మోడల్‌ను 21 రోజుల్లో డెలివరీ చేయగలిగే సామర్ధ్యం ఉంది.

“బ్రాండింగ్‌ ప్రకారం కాకుండా.. కోరుకున్న మోడల్ అందించే విధానంలో కస్టమర్ల నమ్మకం సాధించడం చాలా క్లిష్టమైన విషయం. అలాగే సరసమైన ధరల్లోనే ప్రోడక్టులు, డిజైన్లు అందిస్తూ.. మాకంటూ సొంత బ్రాండ్ నేమ్ సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. నాణ్యత, తక్కువ ధర ఈ రెండూ ఒకదానితో ఒకటి కలవడం చాలా కష్టమైన విషయం. అయితే అదృష్టవశాత్తూ జ్యూవెలరీ, డిజైన్ల తయారీలో నాకున్న అనుభవం ఇందుకు సహాయపడింది. సప్లయ్ చెయిన్ పెరిగేందుకు తోడ్పడింది. మేం అందించే ఉత్పత్తులు మంచి క్వాలిటీ, నాణ్యత ఉంటాయని విక్రేతలు విశ్వసించారు” అంటూ తాను ఎదుర్కున్న సవాళ్లను వివరించారు సుచీ.

ఉద్యోగుల నియామకం కూడా ఒక సవాల్‌గానే చెబ్తున్నారామె. మంచి ప్రతిభ ఉండి, చేసే పనిపై ప్యాషన్ ఉండి, కష్టించి పని చేసేవాళ్లు దొరకడం చాలా కష్టమంటారు సుచీ. కంపెనీపై ఇంతగా దృష్టి పెట్టి, అభివృద్ధి పథంలో నడవడానికి తన టీం ఇచ్చిన ప్రేరణగానే చెబ్తారామె. శక్తివంతమైన, సృజనాత్మకమైన, కష్టించే తత్వం కలిగిన, ఏ సవాల్‌నైనా ఎదుర్కోవాలనే తపన ఉన్న టీంతో పని చేయగలగడం.. చాలా సులభం అంటారామె.

త్వరలో మొబైల్ యాప్‌ను లాంఛ్ చేయడంతోపాటు.. ప్రొడక్టుల సంఖ్యను కూడా పెంచబోతున్నారు. కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభిస్తున్నారు. ఒకేసారి అనేక విషయాలపై దృష్టి పెడితే.. దేనినీ సరిగా పూర్తి చేయడం కుదరదనే విషయం తనకు స్పష్టంగా తెలుసంటారామె. తనకు జీవితం, అనుభవం నేర్పిన పాఠాలుగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. “ఎవరైనా సరే.. తమకు ఏది కీలకమో.. దానిమీదే దృష్టి కేంద్రీకరించి.. బలపడేందుకు ప్రయత్నించాలి. అదే విషయంలో వినూత్నతకు ప్రయత్నించాలి.”- సుచీ పాండ్యా

నిధులపై సలహా

తాజాగా నిధులు సమీకరించిన సుచీ.. ఇదే విషయంపై ఔత్సాహిక స్టార్టప్‌ నిర్వాహకులకు కీలక సూచనలు చేస్తున్నారు.

  • “ మొదట త్వరగా ప్రారంభించాలి. కొన్ని విషయాల్లో అంచనా వేసిన దాని కంటే ఎక్కువ సమయం పడుతుంది. మదుపర్లతో చర్చలతోనే కాలయాపన చేసేకొద్దీ.. చేతిలో డబ్బులు లేని పరిస్థితికి వచ్చే ప్రమాదముంది.”
  • “ రెండవది.. వ్యాపారంలో ఎదురవుతున్న, ఎదురుకానున్న సవాళ్లపై ఇన్వెస్టర్లతో నిజాయితీగా చర్చించాలి. సమస్యలకు మసి పూసి మారేడుకాయ చేసి, వాటిని కనిపించకుండా చేసే బదులు.. వాస్తవాన్ని చెప్పడమే కరెక్ట్. ఏదో ఒక సమయంలో ఇన్వెస్టర్లకే ఆ విషయాలు తెలిస్తే.. వారి నమ్మకాన్ని కోల్పోతాం”
  • “మూడవది.. వాల్యుయేషన్ కంటే నిబంధనలు ఎక్కువ ముఖ్యం. వ్యాపారాన్ని ప్రతీ రోజూ ఎలా నిర్వహిస్తున్నాం ? భవిష్యత్తులో పరిస్థితేంటి ? సంతోషాన్ని సాధించగలమా.. పోగొట్టుకుంటామా? అన్న విషయాలను సిద్ధాంతాలు, నిబంధనలే నిర్ణయిస్తాయి. ఇందుకోసం మంచి లాయర్‌ని సంప్రదించాల్సిందే ”
  • “ నాలుగవది.. ఎందుకు నిధుల సమీకరణ చేయబోతున్నాం ? వాటిని ఎలా ఖర్చు చేయనున్నాం.. అనే అంశాలపైనా స్పష్టత ఉండాలి”
  • “ఐదవది.. నిధులు అందించేందుకు ముందుకొచ్చిన మదుపర్లు అందరూ మంచివాళ్లు కానవసరం లేదు. వారి గురించి కొన్ని రిఫరెన్స్‌లను పరిశీలించాలి. ఆ ఇన్వెస్టర్‌తో పని చేయడంలో అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.”

వెబ్‌సైట్