కోరిన సేవలన్నీ కాళ్ల దగ్గరికే తెచ్చే 'ఇండిక్రూ'

కోరిన సేవలన్నీ కాళ్ల దగ్గరికే తెచ్చే 'ఇండిక్రూ'

Tuesday December 01, 2015,

3 min Read

స్కూలు నుంచి పిల్లలను పిక్ చేసుకుని రావాలి, ఎక్కడి నుంచో మందులు పట్టుకురావాలి. లేకపోతే ఇంటి క్లీనింగ్, సెక్యూరిటీ సేవలు, డ్రైవర్, ట్యూటర్. ఇలా ఎన్నో సేవలు. అన్నీ అందించేది మాత్రం ఒకటే సంస్థ. అదే సర్వీసెస్ మార్కెట్ ప్లేస్. ఈ మధ్య ఇలాంటి స్టార్టప్స్‌కు అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. ఈ రంగంలో ఉన్న అవకాశాలను చూసి.. ఓ బడా కంపెనీలో ఉన్నతోద్యోగం కూడా వదిలేసి వచ్చారు టెక్ సావీ. అందరికంటే తాము భిన్నమని చెబ్తున్న భాస్కర్ సయ్యపరాజు, వాళ్ల కంపెనీ ఇండిక్రూ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

image


మార్కెట్ సర్వీస్ ప్లేస్.. ఇప్పుడు ఎన్నో అవకాశాల గని. మెట్రో నగరాల్లోని జనాలు తీరికలేని.. ప్రతీ చిన్నాచితకా సర్వీసుకూ ఎవరో ఒకరిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇంట్లో పైపు లీకైతే.. ప్లంబర్‌ను పిలుచుకుని రిపేర్ చేయించుకునే తీరికలేక అలా రోజులు, వారాల తరబడి ఆ సమస్య కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ మధ్య ఇలాంటి సేవలన్నీ ఒక్క ఫోన్ కాల్, లేకపోతే యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ వీళ్లను నమ్మడం ఎలా ? ఎవరో ముక్కూమొహం తెలియని వాళ్లకు ఫోన్ చేసి.. ఇంటి పనులను అంత ఈజీగా ఎలా అప్పగించేస్తాం? అని అనుమానపడి వెనక్కితగ్గేవాళ్లూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం మా దగ్గర ఉంది అంటున్నారు భాస్కర్ రాజు అండ్ ఇండిక్రూ టీం.

హైదరాబాద్ ముఫకంజా కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి, ఎంఎస్ కోసం అమెరికా వెళ్లి అక్కడ 1987 నుంచి 2006 వరకూ వివిధ ఉద్యోగాలు చేశారు భాస్కర్. ఎన్విడియా, హ్యాండ్‌స్ప్రింగ్ వంటి కంపెనీల్లో ఐటి మేనేజ్‌మెంట్‌లో కీలక బాధ్యతలు పోషించారు. ఆ తర్వాత ఇండియా తిరిగి వచ్చి సిఫీ టెక్నాలజీస్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు. కన్స్యూమర్, ఎంటర్‌ప్రైజ్ విభాగంలో ఇంటర్నేషనల్ విభాగానికి అధిపతిగా మరో ఏడేళ్ల అనుభవం ఉంది. అయితే ఇన్ని ఉద్యోగాలు చేసి ఇంత అనుభవం సంపాదించినప్పటికీ.. ఏదో తెలియని వెలితి ఆయనను ఇబ్బందిపెట్టేది. ఇంత అనుభవం సంపాదించి.. ఎవరికో సేవ చేయడం కంటే.. మనమే స్టార్టప్ మొదలుపెట్టొచ్చు కదా అనుకున్నారు. అలా అప్పుడు పడిన బీజమే ఇప్పుడు ఇండిక్రూ ఏర్పాటుకు దారితీసింది. వర్మ రుద్రరాజు, చక్రధర్ మల్కపల్లితో కలిసి ఎయిజంట్ ఆన్‌లైన్ సర్వీసెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ పేరెంట్ గ్రూప్ కంపెనీ నుంచి వచ్చిందే ఇండిక్రూ. 2015 జూలైలో యాప్ రూపంలో ఇండిక్రూ బయటకు వచ్చింది.

image


ఏంటి వీళ్ల స్పెషాలిటీ ?

ఇప్పటికే మార్కెట్ సర్వీస్ ప్లేస్‌లో అనేక కంపెనీలు సేవలు అందిస్తూనే ఉన్నాయి. అయితే వీళ్లలో అధిక శాతం మంది ఔట్‌సోర్సింగ్ వాళ్లపైనే ఆధారపడ్డారు. సేవలు అందించే వాళ్ల ఫోన్ నెంబర్లను వాళ్ల దగ్గర ఉంచుకుని, కస్టమర్లకు అవసరమైనప్పుడు వాళ్లను కనెక్ట్ చేసే బాధ్యతకే పరిమితమవుతున్నారు. దీనివల్ల కొన్నిసార్లు సర్వీస్‌ అందించే వాళ్లు కస్టమర్లతో వ్యవహరించే తీరుతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇండిక్రూ సంస్థ ఏకంగా వివిధ సర్వీసులు అందించే ఉద్యోగులనే తమ దగ్గర నియమించుకున్నారు. దీనివల్ల ఉద్యోగిగా బాధ్యత ఉండడంతో పాటు జవాబుదారీతనం పెరిగి కస్టమర్‌కు మెరుగైన సేవలు అందించేందుకు ఆస్కారం ఉంటుంది అంటారు భాస్కర్ రాజు. అంతేకాదు వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం వల్ల కస్టమర్ నుంచి మంచి మార్కులే పడే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతానికి ఇండిక్రూ హోం కేర్ సెగ్మెంట్‌లో హోం క్లీనింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, కార్పెంట్రీ, పెయింగ్, ఇంటీరియర్ - పర్సనల్ కేర్‌లో పర్సనర్ ట్రైనర్, ఫిజికల్ థెరపిస్ట్, లాండ్రీ, కుక్, డ్రైవర్ వంటి సేవలను అందిస్తున్నారు. త్వరలో గ్రాసరీ పికప్, మెడిసిన్ పికప్, గిఫ్ట్ పికప్ వంటి సేవలనూ అందించబోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ సేవలను త్వరలో ఇతర ప్రాంతాలకూ విస్తరించబోతున్నారు.

త్వరలో ఆటోకేర్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, బిజినెస్ సర్వీసెస్ వంటి సేవలను కూడా అందించాలని చూస్తున్నారు.

ఇండిక్రూ దగ్గర ప్రస్తుతం టెక్, ఆపరేషన్స్, కాల్ సెంటర్ సహా వివిధ సర్వీసులు అందించేందుకు పేరోల్‌పై 50 మంది వరకూ ఫుల్ టైం ఉద్యోగులు ఉన్నారు. వీళ్లతో పాటు 300 మంది సర్వీస్ అసోసియేట్స్ కూడా పనిచేస్తున్నట్టు ఇండిక్రూ మేనేజ్‌మెంట్ చెప్తోంది.

image


కాంపిటీటర్స్

ఈ సెగ్మెంట్లో ఇప్పటికే అనేక మంది జనాలకు సేవలందిస్తూ దగ్గరవుతున్నారు. హౌస్ జాయ్, ఎస్ బ్రిక్స్, అర్బన్ క్లాప్, లోకల్ ఓయ్, క్విక్, టాస్క్ బాబ్ వంటి సంస్థలు ఉన్నాయి.

రెవెన్యూ మోడల్

ప్రస్తుతం తమ దగ్గర 2500 మంది కస్టమర్ బేస్ ఉన్నట్టు ఇండిక్రూ చెబ్తోంది. నెలకు 10 లక్షల (గ్రాస్ రెవెన్యూ) రన్ రేట్ సాధిస్తున్నట్టు భాస్కర్ వివరించారు. తాము అందించే ఒక్కో సేవకు సుమారు గంటకు 100-150 రూపాయల వరకూ ఛార్జ్ చేస్తున్నారు. అవసరం, డిమాండ్‌ను బట్టి ఇది గంటకు రూ.600 వరకూ కూడా వెళ్లొచ్చు. వృద్ధి కూడా నెలకు 100 శాతం వరకూ ఉందంటున్నారు.

ప్రస్తుతం ఇండిక్రూను సొంత నిధులతో రన్ చేస్తున్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో బెంగళూరుకు తప్పకుండా విస్తరిస్తామని టీం దీమాగా చెప్తోంది. ఆ తర్వాత చెన్నై, ముంబై విస్తరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

website