అతడు నుంచి ఆమెగా మారిన షిలోక్ ఆవేదనా తరంగం

అతడు నుంచి ఆమెగా మారిన షిలోక్ ఆవేదనా తరంగం

Wednesday March 08, 2017,

3 min Read

నచ్చినట్టు బతకాడానికి వీల్లేదు. అవమానిస్తే తలవంచుకోవాలి. ఛీత్కరింస్తే దులుపుకుని వెళ్లాలి. అటుఇటు కాని వారి జీవితాలను సమాజం చూసే కోణం వేరు. సాటి మనుషులుగా గుర్తించని మనుషుల మధ్య నిత్యం చస్తూ బతకాలి. హక్కు అనే పదానికి అందనంత దూరంగా వుంటారు. ఆత్మగౌరవం అనే మాటకు అర్ధం మరిచిపోయారు. హిజ్రాల జీవితంలో కన్నీళ్ల గానీ చిరునవ్వు కానరాదు. సంఘంతో నిత్యం సంఘర్షణ. వారి వెలివెతలను దూరం చేసేందుకు నడుం కట్టి, సమాజాన్ని ఆలోచింపజేస్తోంది కర్నాటకకు చెందిన షిలోక్ ముక్కాటి. 22 ఏళ్ల షిలోక్ హిజ్రాల హక్కుల కోసం కలం ఝళిపించి పోరాడుతోంది. రచయితగా, సామాజిక కార్యకర్తగా, రేడియో జాకీగా హిజ్రాల గుండె గొంతుకగా మారింది. మాటల తూటాలు, ఆవేదనా తరంగాలు షిలోక్ ని జాతీయ స్థాయిలో నిలబెట్టాయి.

image


కదనగరంలోకి దిగాక యుద్ధమే అల్టిమేట్. విజయమో వీర మరణమో తేల్చుకోవాలి షిలోక్ ఎంచుకున్న దారి అలాంటిదే. ముళ్లూ రాళ్లతో కూడుకున్న ఆమె ప్రయాణంలో ఎన్నెన్నో అవాంతరాలు.

కర్నాటక రాష్ట్రం కూర్గ్ లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది షిలోక్. అమ్మ స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. సోదరుడి ఆత్మహత్య కుటుంబాన్ని కుంగదీసింది. మా అందరి జీవితాలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఒకవైపు తమ్ముడి మరణం.. మరోవైపు మనసులో చెలరేగుతున్నజెండర్ క్రైసిస్. ఏం చేయాలో అర్ధంకాని మానసిక సంఘర్షణ. అంతర్ బహిర్ వేదన. అమ్మానాన్నల పెంపకంలో ఏం తేడాలేదు. వాళ్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పాజిటివ్ గా స్పందిస్తారు. అయినా ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.

షిలోక్ అప్పుడు పదో తరగతి. ఒకరోజు క్లాసురూంలో ఘోరమైన అవమానం జరిగింది. టీచర్ ఒక పోయెం చెప్పమని అడిగాడు. మామూలుగా అడిగితే ఫరవాలేదు. కానీ నపుంసకుడిలా నటిస్తూ వెక్కిరించాడు. క్లాసులో దాదాపు 80 మంది విద్యార్ధులున్నారు. మాస్టారు మాటలకు వాళ్లంతా పగలబడి నవ్వారు. షిలోక్ మనసు కకావికలమైంది. ఆరోజే ఒక లెటర్ రాసిపెట్టి చనిపోదామని డిసైడ్ అయింది. కానీ ఆ ఆలోచన విరమించుకుంది.

image


తనువేమో మగ.. మనసేమో ఆడ. విచిత్రమైన మానసిక సంఘర్షణ. చదవలేక పోతున్నాడు. మనసు లగ్నం చేయలేకపోతున్నాడు. అవహేళన ఎక్కువైంది. అందుకే బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాలనుకున్నాడు. అక్కడ సైకాలజీలో జెండర్ కమ్యూనిటీ మీద స్టడీ చేయాలనేది కోరిక. ఈ విషయం అమ్మానాన్నకు చెప్పడానికి ధైర్యం సరిపోలేదు.

ఒకరోజు రేవతి రాసిన ట్రూథ్ అబౌట్ మి అనే పుస్తకం చదువుతున్నాడు. అందులో ఒక హిజ్రా సమాజం నుంచి ఎదుర్కొన్న ఛీత్కారాలు, చీదరింపులు, వేర్వేరు సంఘటలను ఇంట్రస్టింగ్ ఉన్నాయి. పుస్తకం గురించి తల్లికి వివరించాడు. నేను కూడా అలాగే మానసికంగా చిత్రవధ అనుభవిస్తున్నాను అని అప్రయత్నంగా అనేశాడు. తల్లి నిర్ఘాంతపోయింది. చివాలున పైకి లేచి.. ఈ పుస్తకం నీకెవరిచ్చారు.. అందులోని సంఘటనలన్నీ నువ్వెందుకు ఆపాదించుకుంటున్నావు.. అసలు నీకేమైంది.. ఇలా ఒక్కో విషయాన్ని ఆరా తీసింది. సమాధానం లేదు. షిలోక్ మౌనం దాల్చింది.

ఇలా అయితే లాభం లేదని షిలోక్ ని సెక్సాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ పరిశీలించి సమస్య అతడిది కాదు.. మీదే అన్నాడు. అతడెలా మారాలనుకుంటున్నాడో దాన్ని అంగీకరించండి. అంతకంటే చేసేదేంలేదని సలహా ఇచ్చాడు. డాక్టర్ అలా చెప్తాడని షిలోక్ ఊహించలేదు. పేరెంట్స్ షాకయ్యారు. కొన్నాళ్లకు వాళ్లే షిలోక్ దారిలోకే వచ్చారు.

అలా 2015లో షిలోక్ బెంగళూరుకి షిఫ్టయ్యాడు. జైన్ యూనివర్శిటీలో బీఏ సైకాలజీ తీసుకున్నాడు. అక్కడ విద్యార్ధుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. షిలోక్ లో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఆహార్యం, వాచకం పూర్తిగా మారిపోయింది. అతడు కాస్తా ఆమెగా మారింది. అందరికంటే భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టింది. కలం నుంచి కవిత్వం కురిసింది. మొదట్లో కన్నడలో పోయెట్రీ రాసేది. ఆ తర్వాత ఇంగ్లీషులో రాయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కమ్యూనిటీ రేడియో జాకీగా అవకాశం వచ్చింది. అక్కడ నుంచి లైఫ్ మారిపోయింది.

బెంగళూరులో అదే తొలి కమ్యూనిటీ రేడియో స్టేషన్. సామాన్యుల కష్టాలకు వేదికగా నిలిచిన ఆ రేడియోని పింకీ చంద్రన్ స్థాపించారు. రైతుల బాధల్ని, అణగారిన వర్గాల కన్నీళ్లను, నిజజీవిత పోరాటాలను ప్రపంచానికి చాటిచెప్పిందా రేడియో.

ప్రతీ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు వచ్చే కలర్ ఫుల్ కమనబిళు అనే కార్యక్రమంలో ఆర్జేగా పనిచేసిన అలోక్.. ఆ తర్వాత యారివారు అనే లిమిటెడ్ ఎడిషన్ షో నిర్వహించింది. ఆ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో విశేష స్పందన వచ్చింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ వారు మెచ్చి అవార్డు కూడా ఇచ్చారు. ప్రస్తుతం షిలోక్ ఆ రేడియో స్టేషన్ లో ఫుల్ టైం ఆర్జేగా పనిచేస్తున్నారు.

హిజ్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి దుర్భరమైన జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న షిలోక్ మాటలు, రచనలు సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి.