మళ్లీ మార్కెట్లోకి వస్తోంది నోకియా 3310  

1

నోకియా 3310. చేతిలో ఇమిడిపోయేంత సైజు. కొరమీను చేపను పట్టుకున్నట్టుండే దాని బాడీ షేప్. చార్జింగ్ ఎప్పుడు పెట్టామో గుర్తులేనంతగా బ్యాటరీ. భలేగా వినిపించే రింగ్ టోన్. సతాయించడం.. పాడైపోవడం అన్నది దాని ఇంటావంటా లేదు. బేసిక్ ఫోన్లనో ద బెస్ట్ ఛాయిస్. 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చి ఒక వెలుగు వెలిగింది. స్మార్ట్ ఫోన్ల రాకతో క్రమంగా కనుమరుగైంది.

ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్ల మెప్పుపొందిన ఈ ఫోన్ మళ్లీ మార్కెట్లోకి రాబోతోంది. నోకియా హక్కులున్న హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ 17 ఏళ్ల తర్వాత దీన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. వచ్చే నెలలోనే నోకియా 3310 సరికొత్త అవతార్ కనిపించబోతోంది. ఫిబ్రవరి 26న బార్సిలోనాలో జరిగే మొబైల్‌ వరల్డ్ కాంగ్రెస్‌ లో ఈ మోడల్ ని ప్రదర్శించబోతున్నారు. దీని ధర 59 డాలర్లు ఉండే అవకాశం ఉంది.

దాంతోపాటు హెచ్ఎండీ సంస్థ మరో మూడు వెర్షన్లను రిలీజ్ చేయబోతోంది. నోకియా3, నోకియా 5, నోకియా6 మోడళ్లను మొబైల్‌ వరల్డ్ కాంగ్రెస్‌ లో రివీల్ చేయబోతోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌లోకి వచ్చిన నోకియా.. 6 మోడల్‌ను చైనాలో అమ్ముతోంది. త్వరలో అది ఇండియా మార్కెట్లోకి రానుంది.

స్మార్ట్ ఫోన్లలో నోకియాకు పెద్దగా మార్కెట్ లేదు. అయినా కానీ, నోకియా 215 లాంటి రెనోవేట్ మోడళ్లతో మార్కెట్లోకి రావడం గొప్పవిషయం. తాజాగా 3310 కూడా అలాంటి మార్కెట్ స్ట్రాటజీనే. లో ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ల‌కు పోటీగా తీసుకురావాలన్నది సంస్థ గేమ్ ప్లాన్. ఏదేమైనా సెకండ్ ఫోన్ కింద నోకియా 3310ని కొనుక్కుంటే మళ్లీ పాత రోజులు నెమరు వేసుకోవచ్చు.

Related Stories

Stories by team ys telugu