పైలట్ కాలేకపోయింది.. అయినా రూ.10-15 కోట్లు సంపాదిస్తోంది!

పైలట్  కాలేకపోయింది.. అయినా రూ.10-15 కోట్లు సంపాదిస్తోంది!

Thursday March 03, 2016,

5 min Read


కొంత మంది జీవితాలు సినిమా కథలకు ఏ మాత్రం తీసిపోవు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో అనుకోని అవాంతరాలు. జీవితంలో ఎన్నో మలుపులు. మరెన్నో సవాళ్లు. ముంబైకి చెందిన సౌమ్య గుప్తా లైఫ్‌ కూడా అలాంటిదే. పట్టుబట్టి మరీ పైలట్‌ ట్రైనింగ్‌ కంప్లీట్‌ చేసింది. కానీ ఆర్థికమాంద్యం పరిస్థితి తారుమారు చేసింది. కోరుకున్న ఉద్యోగం దొరకలేదు. ఇంకేముంది నువ్వెందుకు పనికిరావు.. నీ జీవితం వృథా.. ఇలాంటి సూటిపోటి మాటలు. వెక్కిరింపులు. అన్నింటినీ మౌనంగా భరించింది.

ముంబైలోని ఓ బిజినెస్‌మేన్‌ కుటుంబంలో పుట్టింది సౌమ్య గుప్తా. సిటీ కల్చర్‌కు తగ్గట్లుగానే సౌమ్యది హైఫై లైఫ్‌ స్టైల్‌. ప్లస్‌ టూ కంప్లీట్‌ కాగానే పైలట్‌ కావాలన్న తన మనసులో మాట పేరెంట్స్‌కు చెప్పింది. వాళ్లు ససేమిరా అన్నారు. పైలట్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని బలంగా నిర్ణయించుకున్న సౌమ్య పట్టు వీడలేదు. దీంతో తల్లిదండ్రులే మెట్టు దిగొచ్చారు. అమెరికా వెళ్లి ప్లయింగ్‌లో కోర్సులో చేసింది. ట్రైనింగ్‌లో ఎన్నో ఆటుపోట్లు. వాటన్నింటినీ ఎదుర్కొంటూ 2008లో సక్సెస్‌ఫుల్‌గా కోర్సు కంప్లీట్‌ చేసింది. కానీ దురదృష్టం. ఆ సమయంలోనే మాంద్యం దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఏవియేషన్‌ సెక్టార్‌ అయితే గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. కోర్సు కంప్లీట్‌ చేసి ఇండియాకు తిరిగొచ్చిన సౌమ్యకు కష్టాలు స్వాగతం పలికాయి. కోర్సు కోసం 50 లక్షలు ఖర్చయ్యాయి. అయినా ఉద్యోగం లేదు. వేరే జాబ్‌ చేద్దామన్నా పనికొచ్చే డిగ్రీ లేదు. యూఎస్‌ నుంచి తిరిగొచ్చాక ఏడాది పాటు ఖాళీగా కూర్చొంది. జాబ్‌ కోసం ఎన్ని ఎయిర్‌లైన్స్‌కు అప్లై చేసినా రిప్లై మాత్రం రాలేదు.

“జాబ్‌ దొరకకపోవడంతో ఎంతో కుంగిపోయాను. చుట్టుపక్కల జనం నా గురించి ఏమనుకుంటారోనని బాధపడ్డాను. యూఎస్‌ వెళ్లి ఏం నేర్చుకోలేదని అందుకే ఎవరూ పైలట్‌గా ఉద్యోగం ఇవ్వడంలేదని చుట్టుపక్కల జనాలు అనుకుంటారని కుంగిపోయాను. నేనెందుకు పనికిరానన్న ఫీలింగ్‌ కలిగింది” – సౌమ్య గుప్తా


సౌమ్య పేరెంట్స్‌కు కూడా విసుగొచ్చింది. ఏదో ఒక ఉద్యోగం చూసుకోమన్నారు. పాకెట్‌ మనీ ఇవ్వడం మానేశారు. కానీ తాను చదివిన చదువుకు ఉద్యోగం దొరకడం ఈజీ కాదు. పైలెట్‌ అంటే పక్కా ప్రొఫషనల్‌. కానీ కంపెనీల దృష్టిలో మాత్రం పైలెట్‌ అంటే 10+2 విత్‌ సైన్స్‌ బ్యాక్‌ గ్రౌండ్‌. 12 క్లాస్‌ పాసైన వారికి మంచి ఉద్యోగమన్నది కలలో మాట. అప్పటికి సౌమ్యకు 20ఏళ్లు. కనీసం తన రోజువారీ ఖర్చుల కోసమైనా సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు ఓ కాల్‌ సెంటర్‌ ఉద్యోగంలో చేరింది సౌమ్య. నెలకు 20వేల రూపాయల జీతం.

“జాబ్‌లో చేరిన మొదటి రోజే కొంచెం ధైర్యం వచ్చింది. తానేం కోల్పోలేదన్న ధీమా వచ్చింది. కానీ నేను కోరుకున్న జీవితం ఇది కాదని మాత్రం అర్థమైంది. 8 నెలల పాటు కాల్‌ సెంటర్‌లో పని చేసి కొంత సొమ్ము దాచుకున్నాను. వీలైనంత తొందరగా ఆ ఉద్యోగం మారాలనుకున్నాను.” –సౌమ్య గుప్తా
image


కాల్‌సెంటర్‌లో ఉద్యోగమంటే రోజంతా పని ఒత్తిడి. ఇంటికి చేరుకునే సరికి సౌమ్య బాగా అలసిపోయేది. ఒక్కోసారి ఏడుపు వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో అమ్మ ధైర్యం చెప్పింది. తగ్గ ఉద్యోగం చూసుకోమని సలహా ఇచ్చింది. ఇంట్లోనే బట్టల బిజినెస్‌ చేస్తానని చెప్తే.. అమ్మ సరేనంది. వ్యాపారం మొదలైంది. అమ్మానాన్నలు పెట్టుబడి పెట్టకపోయినా అండగా నిలిచారు. ఖర్చులు పోనూ బిజినెస్‌లో మనీ రొటేట్‌ అయితే చాలు అనుకుంది. అలా టెన్ ఆన్‌ టెన్‌ ప్రారంభమైంది. 

వ్యాపారంలో అడుగుపెట్టిన రోజే పైలట్‌ కావాలన్న కోరికను పక్కన పెట్టింది సౌమ్య. బిజినెస్‌ పైనే దృష్టి సారించింది. ఓ గార్మెంట్‌ ఎక్స్‌ పోర్టర్‌ను కలిసి ఆయన దగ్గర సర్‌ప్లస్‌ ఉన్న రాబర్టో కావెల్లీ, జీన్‌ పాల్‌ గిటార్‌ బ్రాండ్‌ దుస్తుల్ని కొనుగోలు చేసింది. తొలుత 30 డ్రెస్సులతో ఇంట్లోనే బిజినెస్‌ స్టార్ట్‌ చేసింది. డ్రెస్సులన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. రాత్రిళ్లు ఆర్డర్‌ తీసుకుని ఉదయం వాటిని డెలివరీ చేయడం మొదలుపెట్టింది. డిమాండ్‌ పెరిగింది. 30 డ్రెస్సులు కాస్తా 45 అయ్యాయి. 45 నుంచి 60, 60 నుంచి 80 ఇలా స్టాక్ పెంచుతూ పోయింది. కాలం కలిసిరావడంతో సౌమ్య వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

image


అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది. ఫ్రెండ్స్‌, పరిచయస్తుల వరకే బిజినెస్‌ పరిమితం చేయకూడదని నిర్ణయించుకుంది. క్లాస్‌, మాస్‌ మధ్య తేడా తెలుసుకోగలిగింది. ఫ్యాషన్‌ అండ్‌ యూ లాంటి పోర్టల్స్‌ లో కలెక్షన్‌ను ఎగ్జిబిట్‌ చేయాలని ఆశపడింది. కానీ గార్మెంట్స్‌తో ఫొటో షూట్‌ చేసేందుకు మంచి కెమెరా లేదు. పెట్టుబడి కోసమే నానా కష్టాలుపడాల్సిన పరిస్థితి. ఫ్రెండ్స్‌తో కలవడం, పార్టీలకు వెళ్లడం మానేసి ఒక్కో పైసా కూడబెట్టడం మొదలుపెట్టింది సౌమ్య. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఫోటోగ్రాఫర్‌ ఫ్రెండ్‌ సౌమ్యను ఆదుకుంది. ఆమె పెద్ద మనసుతో పైసా తీసుకోకుండా ఫొటో షూట్‌కు ఒప్పుకుంది. తనే స్వయంగా మేకప్‌ వేసుకుని మేకప్ ఆర్టిస్ట్ ఖర్చు కూడా తప్పించింది. 

అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆ ఫొటోలను ఫ్యాషన్‌ అండ్‌ యూ టీంకు పంపింది. వాళ్లకు ఆమె దుస్తులు తెగ నచ్చేయడంతో సౌమ్యతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కొన్ని కండీషన్‌ పెట్టారు. సౌమ్య కలెక్షన్‌కు వెబ్‌సైట్‌లో చోటివ్వాలంటే ప్రొఫెషనల్‌ ఫోటో షూట్‌ కంపల్సరీ అన్నారు. ఈ మాట విన్న సౌమ్యకు గుండెల్లో బాంబు పేలినట్లనిపించింది. చేతిలో డబ్బులేదు. ఏం చేయాలో తోచలేదు. చివరకు తాను దాచుకున్న డబ్బంతా పెట్టి రిస్క్‌ చేయాలని డిసైడైంది. ఖర్చు తగ్గించుకునేందుకు కాలేజ్‌ స్టూడెంట్స్‌ను మోడల్స్‌ గా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. తల్లితో కలిసి మితిబాయ్‌ కాలేజ్‌ బయట నిలబడి మోడల్‌గా పనికొచ్చే అమ్మాయిల కోసం వెతకడం మొదలుపెట్టింది. మిక్స్‌డ్ రెస్పాన్స్‌. కొందరు అనుమానంగా చూస్తే మరికొందరు ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పిక్‌ ఇవ్వాలన్న షరతుతో అంగీకరించారు. అలా ఫొటోషూట్‌ కంప్లీట్‌ అయింది. తనకు సాయం చేసిన కాలేజీ అమ్మాయిలకు రెండు డ్రెస్సులు గిఫ్ట్‌గా ఇచ్చింది.

వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి కోసం 3 నెలలు కష్టపడాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే పిసినారుల్లాగా మారిపోయారు. వ్యాపారాభివృద్ధి కోసం పైసా పైసా కూడబెట్టడం మొదలుపెట్టారు. అప్పటికి ఆమె వయసు 21ఏళ్లు. బ్యాంక్‌ లోన్‌ తీసుకోవాలంటే 23 ఏళ్లుండాలి. లోన్‌ కోసం HDFC బ్యాంక్‌ను అప్రోచ్‌ అయి చాలా టైం వేస్ట్‌ చేసుకున్నారు. పెట్టుబడి కోసం ఇష్టమైన వాటిని వదులుకోవడం, ఓపికతో వేచిచూడటం మినహా మరే గత్యంతరం లేకపోయిందంటారు సౌమ్య.

స్టూడెంట్ మోడల్స్‌ సాయంతో చేసిన ఫొటో షూట్‌ ఫ్యాషన్‌ అండ్‌ యూకు తెగ నచ్చేసింది. టెన్‌ ఆన్‌ టెన్‌ బ్రాండ్‌ లైవ్‌ అయింది. తన కలెక్షన్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోవడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 60 గార్మెంట్లతో మొదలైన ప్రస్థానం 6 లక్షలకు చేరింది. ఏటా 150 శాతం వృద్ధి. ISO సర్టిఫికేషన్‌ కూడా వచ్చింది. టెన్‌ ఆన్‌ టెన్‌ ఆఫీస్‌.. పార్కింగ్‌ గ్యారేజ్‌ నుంచి వెయ్యి స్వ్కేర్‌ ఫీట్ల ఏరియాలోకి, అక్కడి నుంచి 5వేల స్క్వేర్‌ ఫీట్ల స్పేస్‌లోకి చేరింది. ప్రస్తుతం బాంబేలోని కార్పొరేట్‌ ఏరియాకు మారింది టెన్‌ ఆన్‌ టెన్‌ ఆఫీస్‌. నెలకు కోటి నుంచి కోటి 25 లక్షల రూపాయల బిజినెస్‌ జరుగుతోంది. ఏటా 10 – 15 కోట్ల టర్నోవర్‌ సాధిస్తోంది. గతేడాది తన రోల్‌ మోడల్‌ అయిన కునాల్‌ భల్‌ చేతుల మీదుగా విమెన్‌ ఆంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2015 అవార్డ్‌ అందుకుంది సౌమ్య గుప్తా. విశ్వాసం, పట్టుదల, నమ్మిన సిద్ధాంతాలే తనను విజయం వైపు నడిపించాయంటోంది సౌమ్య.

“పెద్ద ఐడియాల గురించి ఆలోచిస్తే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టాలి. టెన్‌ ఆన్‌ టెన్‌ విషయంలో నేను అదే చేశాను. ఆచితూచి అడుగేశాను. మొదటి నుంచి క్వాలిటీకి ప్రాధాన్యం ఇచ్చాను.” సౌమ్య

సక్సెస్‌ బాటలో దూసుకుపోతున్నా తన మూలాలను, పడిన కష్టాలను ఎన్నటికీ మర్చిపోనంటోంది సౌమ్య గుప్తా. ప్రవృత్తిని వృత్తిగా మార్చుకుని ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగింది. మనచుట్టూ ఉన్న జనం మన వైఫల్యాలను ఎత్తిచూపి కిందకు లాగే ప్రయత్నం చేస్తారు. ఇన్నేళ్లలో ఎదురైన సవాళ్లు ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పాయి. ప్రపంచం నిన్ను కిందకు లాగి, తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది. వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకు సాగాలి. కలల్ని నిజం చేసుకోవాలి. అలా సక్సెస్ సాధించిన సౌమ్య ఇప్పుడు ఎందరికో ఆదర్శం.